పరమ 1
1
1సొలొమోను రచించిన పరమ గీతములు.
యువతి#1:2 ప్రధానంగా మగ ఆడ ఉపన్యాసకులు (ప్రధానంగా సంబంధిత హెబ్రీ రూపాలలో లింగం ఆధారంగా గుర్తించబడ్డాయి) సర్వనామముల ద్వారా సూచించబడతారు, అనగా అతడు ఆమె ఇతర వాటికి చెలికత్తెలు. కొన్ని సందర్భాలలో ఇవి చర్చనీయాంశంగా ఉంటాయి.
2అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకోనివ్వండి,
నీ ప్రేమ ద్రాక్షరసం కంటే ఆహ్లాదకరమైనది.
3మీ పరిమళ ద్రవ్యాల సువాసన హృదయానికి ఆనందాన్నిస్తుంది;
మీ పేరు పోయబడిన పరిమళం లాంటిది.
కాబట్టి యువతులు నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు!
4నన్ను మీతో దూరానికి తీసుకెళ్లండి; త్వరగా!
రాజు తన అంతఃపురాల్లోకి నన్ను తీసుకెళ్లనివ్వండి.
చెలికత్తెలు
నీ విషయం మేము గొప్పగా సంతోషిస్తున్నాము;
నీ ప్రేమను ద్రాక్షరసం కన్నా ఎక్కువగా పొగడుతాము.
యువతి
వారు నిన్ను పొగడడం ఎంత మంచి విషయం!
5యెరూషలేము కుమార్తెలారా,
నల్లనిదానను, అయినా నేను సౌందర్యవతిని,
కేదారు డేరాలవంటిదానను,
సొలొమోను గుడారపు తెరల్లా నేనూ నల్లనిదాన్ని.
6నల్లపిల్ల అని చెప్పి నన్నిలా తేరిచూస్తారేమి?
ఎండకు నేను నల్లగా అయ్యాను.
నా తల్లి కుమారులకు నా మీద కోపం
నన్ను ద్రాక్షతోటను కావలి కాయడానికి పెట్టారు;
అందుకే నా సొంత ద్రాక్షతోటను కాయలేక పోయాను.
7నేను ప్రేమిస్తున్నవాడా,
నీ గొర్రెల మందను ఎక్కడ మేపుతున్నావో
మధ్యాహ్నం మీ మందను విశ్రాంతికి ఎక్కడ ఉంచుతున్నావో చెప్పు.
మీ స్నేహితుల మందల ప్రక్కన
నేను ముసుగు వేసుకున్న స్త్రీలా ఎందుకు ఉండాలి?
చెలికత్తెలు
8స్త్రీలలో అత్యంత అందమైనదానా, ఒకవేళ నీకు తెలియకపోతే,
మందల అడుగుజాడలను బట్టి వెళ్లు,
కాపరుల డేరాల ప్రక్కన
నీ మేక పిల్లలను మేపుకో.
యువకుడు
9నా ప్రియురాలా, నీవు అద్భుతం
నీవు ఫరో రథం యొక్క గుర్రాల్లా ఉన్నావు.
10మీ బుగ్గలు చెవిపోగులతో,
నీ మెడ హారాలతో అందంగా ఉన్నాయి.
11బంగారు చెవిపోగులు చేస్తాము
వెండి పూసలతో అలంకరిస్తాము.
యువతి
12రాజు బల్ల దగ్గర కూర్చుని ఉన్నాడు,
నా పరిమళపు సువాసన అంతా గుబాళించింది.
13నా ప్రియుడు నా స్తనముల మధ్య ఉన్న,
బోళం సంచిలా ఉన్నాడు.
14ఎన్-గేదీ ద్రాక్షవనంలో
వికసించిన గోరింట పూలగుత్తి లాంటివాడు నా ప్రియుడు.
యువకుడు
15నా ప్రియురాలా, నీవు ఎంత అందమైనదానవు!
ఓ, ఎంతో అందాలరాశివి!
నీ కళ్లు గువ్వలు.
యువతి
16నా ప్రియుడా! నీవు ఎంత సౌందర్యమూర్తివి!
ఓ, నీవు ఎంతో అందమైనవాడవు!
మనకు పడక ప్రశాంతము.
యువకుడు
17మన గృహం దేవదారు దూలాలు!
మన వాసాలు సరళవృక్షాల మ్రానులు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
పరమ 1: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.