రోమా 15
15
1బలవంతులమైన మనం మనల్ని మనం సంతోషపరచుకోవడం కాక బలహీనులైన వారి దోషాలను భరించవలసినవారిగా ఉన్నాము 2మనలో ప్రతీ ఒక్కరు మన పొరుగువారు వృద్ధిచెందేలా, వారి మంచి కొరకు వారిని సంతోషపెట్టాలి. 3క్రీస్తు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కాని, “నిన్ను అవమానపరిచేవారి అవమానాలు నాపై పడ్డాయి”#15:3 కీర్తన 69:9 అని లేఖననాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన వాటిని అనుభవించారు. 4గతంలో వ్రాయబడిన సంగతులన్ని, లేఖనాల్లో బోధించబడిన ఓర్పు ద్వారా అవి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండడం కొరకు మనకు బోధించడానికి వ్రాయబడ్డాయి.
5మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియైన దేవుణ్ణి మీరు ఒకే మనస్సుతో ఒకే స్వరంతో మహిమపరిచేలా, 6మనకు ఓర్పును ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుడు క్రీస్తు యేసు కలిగివున్న మనోవైఖరి మనం ఒకరి పట్ల ఒకరం కలిగివుండేలా మనకు అనుగ్రహించును గాక.
7క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్టుగా దేవునికి మహిమ కలిగేలా మీరు కూడా ఒకరిని ఒకరు అంగీకరించండి. 8దేవుని సత్యం పక్షాన క్రీస్తు యూదుల సేవకుడిగా మారాడు, తద్వారా పితరులకు ఇచ్చిన వాగ్దానాలు ధృవీకరించబడతాయి, 9అంతేకాక యూదేతరులు ఆయన కనికరాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారని నేను మీకు చెప్తున్నాను. దీని విషయమై లేఖనాల్లో ఇలా వ్రాయబడి వుంది:
“కాబట్టి నేను నిన్ను యూదేతరుల మధ్యలో ఘనపరుస్తాను.
నీ నామాన్ని గురించి స్తుతులు పాడతాను.”#15:9 2 సమూ 22:50; కీర్తన 18:49
10అలాగే మరొక చోట,
“యూదులు కాని వారలారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.”#15:10 ద్వితీ 32:43
11మరియొక చోట,
“యూదులు కాని వారలారా, ప్రభువును మహిమపరచండి,
ప్రజలందరు ఆయనను కీర్తించుదురు గాక.”#15:11 కీర్తన 117:1
12మరోచోట యెషయా ఇలా చెప్పాడు,
“యెష్షయి వేరు నుండి చిగురు వస్తుంది
అంటే జనాల మీద రాజ్యం చేసేవాడు వస్తాడు,
యూదేతరులంతా ఆయనలో నిరీక్షణ కలిగివుంటారు.”#15:12 యెషయా 11:10
13పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగివుండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.
యూదేతరులకు పరిచారకునిగా పౌలు
14నా సహోదరీ సహోదరులారా, మీరందరు మంచితనంతో నిండినవారై, జ్ఞానం కలిగి ఒకరికి ఒకరు బోధించుకోడానికి సమర్ధులని నేను నమ్ముతున్నాను. 15అయినప్పటికి నేను చాలా ధైర్యంగా మీకు కొన్ని విషయాలు మళ్ళి గుర్తుచేయాలని వ్రాస్తున్నాను, ఎందుకంటే నాకు ఇవ్వబడిన దేవుని కృపను బట్టి నేను యూదేతరులకు యేసు క్రీస్తు పరిచారకునిగా ఉన్నాను. 16పరిశుద్ధాత్మచేత పరిశుద్ధపరచబడి దేవునికి అంగీకారయోగ్యమైన అర్పణగా యూదేతరులు మారేలా దేవుని సువార్తను ప్రకటించడమనే యాజక ధర్మాన్ని ఆయన నాకు ఇచ్చారు.
17అందువల్ల నేను దేవునికి చేస్తున్న సేవను బట్టి క్రీస్తు యేసులో అతిశయపడుతున్నాను. 18దేవుని ఆత్మ యొక్క శక్తి వలన నేను చెప్పిన చేసిన అద్బుతాలు సూచక క్రియల ద్వారా యూదేతరులను దేవునికి విధేయత చూపించేలా నడిపించడంలో క్రీస్తు నా ద్వారా నెరవేర్చిన దానిని గురించి తప్ప నేను దేని గురించి మాట్లాడడానికి సాహసించను. 19కాబట్టి యెరూషలేము నుండి ఇల్లూరికు వరకు ఉన్న అన్ని ప్రదేశాల్లో క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించాను. 20మరొకరు వేసిన పునాది మీద నేను కట్టకుండేలా, క్రీస్తు తెలియని చోట్ల సువార్త ప్రకటించాలనేది ఎల్లప్పుడు నా ఆశగా ఉండింది. 21ఎందుకంటే, ఇలా వ్రాయబడి ఉంది:
“ఆయన గురించి చెప్పబడని వారు చూస్తారు,
ఆయన గురించి విననివారు గ్రహిస్తారు.”#15:21 యెషయా 52:15
22దీనిబట్టే నేను మీ వద్దకు రాకుండా చాలాసార్లు నాకు ఆటంకాలు ఎదురయ్యాయి.
రోమాను దర్శించాలని పౌలు యోచన
23అయితే ఇప్పుడు ఈ ప్రాంతాల్లో పనిచేయడానికి నాకిక స్థలమే లేదు. మిమ్మల్ని దర్శించాలని ఎన్నో సంవత్సరాలుగా నేను ఆశపడుతున్నాను. 24కనుక నేను స్పెయినుకు వెళ్ళేటప్పుడు అక్కడికి రావాలని ఆలోచిస్తున్నాను. నేను ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మిమ్మల్ని చూడాలని కొంత కాలం మీ సహవాసంలో ఆనందించిన తరువాత అక్కడి నుండి నా ప్రయాణంలో మీరు నాకు సహాయపడాలని ఆశిస్తున్నాను. 25ఏమైనప్పటికి, ఇప్పుడు, నేను యెరూషలేములో ఉన్న ప్రభువు ప్రజలకు సేవ చేయడానికి అక్కడికి వెళ్తున్నాను. 26యెరూషలేములో ఉన్న ప్రభువు యొక్క ప్రజల మధ్యలో ఉన్న పేదవారికి సహాయం చేయడానికి మాసిదోనియా అకయ వారు కొంత విరాళాన్ని ఇవ్వడానికి సంతోషించారు. 27వారు దానిని సంతోషంతో చేశారు, నిజానికి వారు వీరికి రుణపడి ఉన్నారు. ఎలాగంటే ఒకవేళ యూదేతరులు యూదుల ఆత్మ సంబంధమైన దీవెనలను పంచుకొన్నారు, కనుక తమ భౌతిక సంబంధమైన దీవెనలను యూదులతో పంచుకోవడానికి వారు రుణపడి ఉన్నారు. 28నేను ఈ పనిని ముగించాక ఖచ్చితంగా విరాళం వారికందేలా చూస్తాను, తరువాత అక్కడి నుండి స్పెయినుకు బయలుదేరి మార్గంలో మిమ్మల్ని కలుస్తాను. 29నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.
30సహోదరీ సహోదరులారా, నా కొరకు దేవునికి ప్రార్థించడం ద్వారా మీరు కూడా నా పోరాటంలో చేరాలని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మలోని ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకొంటున్నాను. 31యూదయలో ఉన్న అవిశ్వాసుల నుండి నేను తప్పించబడేలా, యెరూషలేముకు నేను తీసుకెళ్తున్న విరాళాన్ని అక్కడ ఉన్న ప్రభువు ప్రజలు సంతోషంగా స్వీకరించేలా ప్రార్థించండి. 32అప్పుడు నేను దేవుని చిత్తమైతే సంతోషంగా మీ దగ్గరకు వచ్చి మీ సహవాసంలో విశ్రాంతి తీసుకుంటాను. 33సమాధానకర్తయైన దేవుడు మీ అందరితో ఉండును గాక. ఆమేన్.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
రోమా 15: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.