కీర్తనలు 10
10
కీర్తన 10#10 9 10 కీర్తనలు మొదట ఒకే అక్రోస్టిక్ పద్యం అయి ఉండవచ్చు, దీనిలో హెబ్రీ అక్షరాల యొక్క వరుస అక్షరాలతో ప్రత్యామ్నాయ పంక్తులు ప్రారంభమయ్యాయి. సెప్టూజంట్ లో ఇవి రెండు ఒకే కీర్తనగా ఉన్నాయి.
1యెహోవా, ఎందుకు దూరంగా నిలిచి ఉన్నారు?
నేను కష్టంలో ఉన్నప్పుడు మీరెందుకు దాక్కుంటారు?
2దుష్టులు తమ అహంకారంలో దీనులను వేటాడతారు,
వారు ఇతరుల కోసం పన్నిన కుట్రలో వారే చిక్కుకుంటారు.
3వారు తమ హృదయ కోరికలను బట్టి అతిశయిస్తారు;
వారు అత్యాశపరులను దీవిస్తారు, యెహోవాను దూషిస్తారు.
4దుష్టులు తమ అహంకారంలో దేవున్ని వెదకరు;
వారి ఆలోచనల్లో దేవునికి చోటు లేదు.
5వారి మార్గాలు ఎప్పటికీ క్షేమంగా ఉంటాయి;
వారు మీ న్యాయవిధులను తిరస్కరించారు;
వారు తమ శత్రువులందరినీ హేళనగా చూస్తారు.
6“ఏదీ మమ్మల్ని ఎప్పటికీ కదిలించలేదు ఎవరు మాకు హాని చేయలేరు”
అని వారు తమలో తాము అనుకుంటారు.
7వారి నోటి నిండా శాపాలు, మోసాలు, బెదిరింపులు ఉన్నాయి;
ఇబ్బంది, కీడు వారి నాలుక క్రింద ఉంటాయి.
8వారు గ్రామాల సమీపంలో పొంచి ఉంటారు;
చాటైన స్థలాల్లో వారు నిర్దోషులను చంపుతారు.
నిస్సహాయులైన వారి కోసం వారి కళ్లు వెదకుతాయి;
9గుహలో సింహంలా వారు వేచి ఉంటారు.
నిస్సహాయులను పట్టుకోడానికి వారు ఎదురుచూస్తూ ఉంటారు;
వారు నిస్సహాయులను తమ వలలోనికి లాగి పట్టుకుంటారు.
10బాధితులు నలిగి కుప్పకూలిపోతారు;
వారు వారి బలత్కారం వల్ల పతనమవుతారు.
11“దేవుడు ఎప్పటికీ గమనించరు;
ఆయన తన ముఖాన్ని కప్పుకున్నారు ఇక ఎప్పుడు చూడరు”
అని వారు తమలో తాము అనుకుంటారు.
12యెహోవా, లెండి! ఓ దేవా, మీ చేయి పైకెత్తండి.
నిస్సహాయులను మరువకండి.
13దుష్టులు ఎందుకు దేవున్ని దూషిస్తారు?
“దేవుడు నన్ను లెక్క అడగరు”
అని వారు తమలో తాము ఎందుకు అనుకుంటారు?
14దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు;
వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు.
నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు;
తండ్రిలేనివారికి మీరే సహాయకులు.
15దుష్టుల చేతిని విరగ్గొట్టండి.
కీడు చేసేవారిని వారి దుష్టత్వాన్ని బట్టి లెక్క అడగండి
ఒక్కడు మిగులకుండ వారిని వెంటాడి నిర్మూలం చేయండి.
16యెహోవా నిరంతరం రాజై ఉన్నారు;
దేశాల ప్రజలు ఆయన భూభాగంలో నుండి నశిస్తారు.
17యెహోవా, మీరు బాధపడేవారి కోరిక విన్నారు;
మీరు వారి ప్రార్థనను ఆలకించి వారిని ప్రోత్సహిస్తారు.
18తండ్రిలేనివారిని అణచివేయబడిన వారిని మీరు రక్షిస్తారు,
అప్పుడు మానవులెవ్వరు ఎన్నడు భయాన్ని కలిగించరు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 10: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.