లేవీయ 11
11
పవిత్ర, అపవిత్ర ఆహారం
1యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు, 2“ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పండి: ‘భూమి మీద జీవించే జంతువులన్నిటిలో మీరు తినదగిన జంతువులు: 3చీలిన డెక్కలు కలిగి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు.
4“ ‘కొన్ని కేవలం నెమరువేస్తాయి కొన్ని చీలిన డెక్కలు మాత్రమే కలిగి ఉంటాయి, వాటిని మీరు తినకూడదు. ఒంటెలు నెమరువేస్తాయి కానీ వాటికి చీలిన డెక్కలు లేవు; ఇవి మీకు ఆచారరీత్య అపవిత్రమైనవి. 5అలాగే పొట్టి కుందేలు కూడా నెమరువేస్తుంది కాని దానికి చీలిన డెక్కలు లేవు; ఇది మీకు అపవిత్రమైనది. 6అలాగే కుందేలు నెమరువేస్తుంది గాని దానికి చీలిన డెక్కలు లేవు; ఇది మీకు అపవిత్రమైనది. 7పందికి చీలిన డెక్కలు ఉంటాయి కాని అది నెమరువేయదు; ఇది మీకు అపవిత్రమైనది. 8వాటి మాంసం తినవద్దు వాటి కళేబరాలు ముట్టుకోవద్దు; అవి మీకు అపవిత్రమైనవి.
9“ ‘సముద్రాల్లో నదులలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు. 10సముద్రంలో గాని, నదిలో గాని నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోను, నీటి ప్రాణుల్లోను రెక్కలు, పొలుసులు లేనివాటిని మీరు అపవిత్రమైనవిగా చూడాలి. 11అవి అపవిత్రమైనవి కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు; వాటి కళేబరాలను మీరు అసహ్యించుకోవాలి. 12రెక్కలు, పొలుసులు లేని జలచరాలేవైనా అపవిత్రమైనవిగా చూడాలి.
13“ ‘మీకు అపవిత్రమైనవిగా భావించి మీరు తినకూడని పక్షులు ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు, 14ఎర్ర గ్రద్ద, ప్రతి రకమైన నల్ల గ్రద్ద, 15ప్రతి రకమైన కాకి, 16కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ, 17పైడికంటే, చెరువు కాకి, గుడ్లగూబ, 18హంస, గూడబాతు, నల్లబోరువ, 19సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.
20“ ‘నాలుగు కాళ్లతో నడిచే ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవిగా మీరు భావించాలి. 21అయితే, నాలుగు కాళ్లతో నడుస్తూ నేలమీద గెంతడానికి కాళ్లకు కీళ్ళున్న ఎగిరే కీటకాలను మీరు తినవచ్చు. 22వీటిలో నేత మిడత గాని చిన్న మిడత గాని ఆకు మిడత గాని ప్రతి రకమైన మిడతను తినవచ్చు. 23కాని నాలుగు కాళ్లు ఉండి ఎగిరే ఇతర పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి.
24“ ‘వీటి ద్వార మీరు అపవిత్రులవుతారు; వాటి కళేబరాలను ఎవరైనా తాకితే వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు. 25వీటి కళేబరాలలో దేనినైన ఎవరైనా మోస్తే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు.
26“ ‘చీలిన డెక్కలు లేని నెమరువేయని ప్రతి జంతువు మీకు అపవిత్రం; వాటిలో దేని కళేబరాన్నైనా ఎవరైనా తాకితే వారు అపవిత్రులవుతారు. 27నాలుగు కాళ్ల జంతువులన్నిటిలో తమ పంజాలతో నడిచేవన్నీ అపవిత్రమైనవి; వాటిలో దేని కళేబరాన్నైనా ఎవరైనా తాకితే వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు. 28వీటి కళేబరాలలో దేనినైన ఎవరైనా మోస్తే, వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు. ఈ జంతువులు మీకు అపవిత్రమైనవి.
29“ ‘నేల మీద ప్రాకే జంతువుల్లో, మీకు అపవిత్రమైనవి ఇవే: ముంగీస, ఎలుక, ప్రతి రకమైన పెద్ద బల్లి, 30తొండ, మచ్చల బల్లి, గోడ తొండ, ఉడుము, ఊసరవెల్లి. 31భూమి మీద కదిలే వాటన్నిటిలో, ఇవి మీకు నిషేధమైనవి. అవి చనిపోయిన తర్వాత వాటి కళేబరాన్ని తాకినవారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు. 32అవి చనిపోయిన తర్వాత వాటి కళేబరం దేని పైననైన పడితే, అది చెక్క గాని, వస్త్రం గాని, చర్మం గాని గోనెసంచి గాని దేనితో చేసినదైనా, దాని ఉపయోగం ఏదైనా దానిని నీటిలో పెట్టండి; అది సాయంత్రం వరకు అపవిత్రం, తర్వాత అది పవిత్రమవుతుంది. 33వాటిలో ఏదైనా మట్టికుండలో పడితే, దానిలో ఉన్నదంతా అపవిత్రమవుతుంది, మీరు తప్పనిసరిగా ఆ కుండను పగులగొట్టాలి. 34మీరు తినదగిన ఏ ఆహారమైనా అలాంటి కుండలోని నీరు తగిలితే అది అపవిత్రమవుతుంది, ఎటువంటి పానీయమైనా సరే అలాంటి కుండలో నుండి త్రాగితే అది అపవిత్రము. 35వాటి కళేబరాలలో కొంచెమైనా ఒకటి దేనిపైనైనా పడితే అది అపవిత్రమవుతుంది; అది పొయ్యి గాని లేదా వంటచేసే కుండ గాని తప్పకుండ పగులగొట్టబడాలి. అవి అపవిత్రమైనవి, మీరు వాటిని అపవిత్రమైనవిగా భావించాలి. 36ఏదేమైనా, ఒక ఊటలో గాని లేదా నీటి తొట్టిలో గాని పవిత్రంగా ఉంటుంది, కానీ వీటిలో ఏదైన ఒకటి ఈ కళేబరాన్ని తాకితే వారు అపవిత్రమవుతారు. 37ఒకవేళ నాటబడవలసిన విత్తనాలపై కళేబరం పడితే, అవి పవిత్రంగా ఉంటాయి. 38కానీ ఒకవేళ విత్తనాలకు నీరు పెట్టిన తర్వాత, వాటిపై పడితే, అది మీకు అపవిత్రమవుతాయి.
39“ ‘ఒకవేళ మీరు తినదగిన జంతువుల్లో ఏదైనా చనిపోతే, దాని కళేబరాన్ని తాకిన ఎవరైనా సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు. 40దాని కళేబరంలో ఎవరైనా ఏదైనా తింటే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు. కళేబరాన్ని ఎవరైనా మోస్తే వారు బట్టలు ఉతుక్కోవాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
41“ ‘నేలపై ప్రాకే జీవులన్నీ అపవిత్రమైనవి; దానిని తినకూడదు. 42నేలమీద ప్రాకే జీవులలో పొట్ట మీద ప్రాకేవైనా లేదా నాలుగు కాళ్లతో లేదా అంతకన్నా ఎక్కువ కాళ్లతో నడిచేవైనా అవి మీకు అపవిత్రమైనవి. 43ప్రాకే జీవులను తిని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు. వాటిని బట్టి గాని వాటి ద్వారా గాని మీరు అపవిత్రం కాకూడదు. 44నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను కాబట్టి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని పరిశుద్ధంగా ఉండండి. నేలపై ప్రాకే ఏ జీవిని బట్టి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు. 45మీకు దేవునిగా ఉండాలని ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు తెచ్చిన యెహోవాను నేనే; నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి.
46“ ‘జంతువులు, పక్షులు, నీటిలో నివసించే ప్రతి జీవి, నేలపైన ప్రాకే జీవులకు సంబంధించిన నియమాలు ఇవే. 47అపవిత్రమైన వాటికి పవిత్రమైన వాటికి మధ్య తేడాను, తినదగిన జీవులకు తినకూడని జీవులకు మధ్య తేడాను మీరు గుర్తించాలి.’ ”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లేవీయ 11: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.