లేవీయ 10
10
నాదాబు, అబీహుల మరణం
1అహరోను కుమారులు నాదాబు, అబీహు తమ ధూపార్తులను తీసుకుని, వాటిలో నిప్పు ఉంచి దానిపై ధూపం వేశారు; వారు యెహోవా ఎదుట ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా అనధికార అగ్నిని సమర్పించారు. 2కాబట్టి యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి వారిని దహించివేయగా, వారు యెహోవా ఎదుట చనిపోయారు. 3అప్పుడు మోషే అప్పుడు అహరోనుతో ఇలా అన్నాడు, “యెహోవా ఇలా చెప్పారు:
“ ‘నన్ను సమీపించేవారి ద్వారా
నేను నా పరిశుద్ధతను కనుపరచుకుంటాను;
ప్రజలందరి దృష్టిలో
నేను ఘనపరచబడతాను.’ ”
అహరోను మౌనంగా ఉండిపోయాడు.
4మోషే అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలు, ఎల్సాఫానులను పిలిపించి వారితో, “ఇక్కడకు రండి; మీ బంధువులను పరిశుద్ధాలయం ఎదుట నుండి, బయటకు తీసుకెళ్లండి” అని అన్నాడు. 5కాబట్టి వారు వచ్చి, మోషే ఆజ్ఞాపించినట్లుగా, శిబిరం బయట ఇప్పటికీ తమ వస్త్రాలతో వాటిని తీసుకెళ్లారు.
6మోషే అహరోనుతో అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారులతో, “మీరు చావకూడదన్నా, యెహోవా ఆగ్రహం ఈ సమాజం మీదికి రావద్దన్నా మీరు మీ జుట్టు విరబోసుకోవద్దు, మీ బట్టలు చింపుకోవద్దు, అయితే యెహోవా అగ్నితో వారిని నాశనం చేసినందుకు మీ బంధువులైన ఇశ్రాయేలీయులందరు దుఃఖించవచ్చు. 7యెహోవా యొక్క అభిషేక తైలం మీమీద ఉంది కాబట్టి సమావేశ గుడారం యొక్క ప్రవేశం వదిలి వెళ్లొద్దు, వెళ్తే మీరు చస్తారు” అని అన్నాడు. కాబట్టి వారు మోషే చెప్పినట్లు చేశారు.
8తర్వాత యెహోవా అహరోనుతో ఇలా అన్నారు, 9“నీవూ, నీ కుమారులు సమావేశ గుడారంలోకి ఎప్పుడు వెళ్లినా మద్యం త్రాగకూడదు ఇతర పులిసిన పానీయం త్రాగకూడదు, ఒకవేళ అలా చేస్తే మీరు చస్తారు. మీ రాబోయే తరాలకు ఇది నిత్య సంస్కారంగా ఉంటుంది. 10పరిశుద్ధమైన దానికి సాధారణమైన దానికి, అపవిత్రమైన దానికి పవిత్రమైన దానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించగలిగేలా, 11యెహోవా మోషే ద్వార ఇశ్రాయేలీయులకు ఇచ్చిన శాసనాలన్నిటిని మీరు వారికి బోధించాలి.”
12మోషే అహరోనుతో అతని కుమారులలో మిగతా వారైన ఎలియాజరు, ఈతామారులతో ఇలా అన్నాడు, “యెహోవాకు సమర్పించిన హోమబలిలో మిగిలిన భోజనార్పణ పులుపు లేకుండ తీసుకుని బలిపీఠం ప్రక్కన తినండి, ఎందుకంటే అది అతిపరిశుద్ధమైనది. 13యెహోవాకు సమర్పించిన హోమబలులలో ఇది మీకు, మీ కుమారులకు ఇచ్చిన వాటా; దీనిని పరిశుద్ధాలయ ప్రాంతంలో తినండి; ఎందుకంటే నాకు అలాగే ఆజ్ఞ ఇవ్వబడింది. 14కానీ నీవూ, నీ కుమారులు, మీ కుమార్తెలు పైకెత్తిన రొమ్ము భాగాన్ని, ప్రత్యేక అర్పణగా అర్పించిన తొడను తినవచ్చు. ఆచారరీత్య శుభ్రంగా ఉన్న స్థలంలో వాటిని తినండి; అవి నీకు, నీ పిల్లలకు ఇశ్రాయేలీయుల సమాధానబలులలో మీ వాటాగా ఇవ్వబడ్డాయి. 15ప్రత్యేక అర్పణ యైన తొడను పైకెత్తిన రొమ్ము భాగాన్ని హోమబలుల క్రొవ్వుతో పాటు తీసుకువచ్చి, యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి. యెహోవా ఆజ్ఞాపించినట్లు ఇది నీకు, నీ పిల్లలకు శాశ్వత వాటాగా ఉంటుంది.”
16పాపపరిహారబలి కొరకైన మేక గురించి మోషే ఆరా తీయగా, అది కాలిపోయిందని తెలుసుకుని, అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు, ఈతామారులపై కోప్పడి, 17“మీరు పాపపరిహారబలిని పరిశుద్ధాలయ ప్రాంగణంలో ఎందుకు తినలేదు? అది అతిపరిశుద్ధమైనది; సమాజం యొక్క అపరాధం యొక్క శిక్షను భరించి యెహోవా ఎదుట వారి కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఇది మీకు ఇచ్చారు. 18దాని రక్తం పరిశుద్ధ స్థలంలోకి తేబడలేదు కాబట్టి నేను ఆజ్ఞాపించినట్లు, మీరు పరిశుద్ధాలయ ప్రాంతంలో మేకను తప్పక తిని ఉండాల్సింది” అని అన్నాడు.
19అందుకు అహరోను మోషేతో, “ఈ రోజు వారు యెహోవా ఎదుట వారి పాపపరిహారబలి, దహనబలి అర్పించారు, అయినా నా పట్ల ఇలాంటి విషాదం జరిగింది. ఈ రోజు ఒకవేళ నేను పాపపరిహారబలి తినివుంటే యెహోవా ఆనందించి ఉండేవారా?” అని అడిగాడు. 20ఆ మాటలు మోషే విని సంతృప్తి చెందాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లేవీయ 10: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.