యెహోషువ 7
7
ఆకాను పాపం
1శపించబడిన వాటి#7:1 ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడానికే. అలాగే 11, 12, 13, 15. విషయంలో ఇశ్రాయేలీయులు నమ్మకద్రోహులుగా ఉన్నారు. యూదా గోత్రపు వాడైన జెరహు కుమారుడు జబ్ది,#7:1 కొ.ప్ర.లలో జిమ్రీ అని వాడబడింది జబ్ది కుమారుడు కర్మీ, కర్మీ కుమారుడైన ఆకాను వాటిలో కొన్నిటిని తీసుకున్నాడు. కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలీయులపై రగులుకుంది.
2తర్వాత యెహోషువ యెరికో నుండి బేతేలుకు తూర్పున బేత్-ఆవెను సమీపంలో ఉన్న హాయికి మనుష్యులను పంపుతూ, “మీరు వెళ్లి ఆ ప్రదేశాన్ని వేగుచూసి రండి” అని చెప్పాడు. కాబట్టి వారు వెళ్లి హాయిని వేగు చూశారు.
3వారు యెహోషువ దగ్గరకు తిరిగివచ్చి, “హాయి మీదికి సైన్యమంతా వెళ్లాల్సిన అవసరం లేదు. దాన్ని స్వాధీనపరచుకోడానికి రెండు లేదా మూడువేలమందిని పంపండి చాలు, సైన్యమంతా అలసిపోనవసరం లేదు, ఎందుకంటే అక్కడ కొంతమంది మాత్రమే నివసిస్తున్నారు.” 4కాబట్టి ప్రజల్లో సుమారు మూడువేలమంది యోధులు వెళ్లారు; కానీ వారు హాయి ప్రజల ఎదుట నిలబడలేక పారిపోయారు, 5హాయి ప్రజలు వారిలో ముప్పై ఆరుగురిని చంపారు. వారు ఇశ్రాయేలీయులను పట్టణ ద్వారం నుండి రాతి గనుల వరకు కొండ దిగువన వారిని చంపారు. దీంతో ప్రజల గుండెలు భయంతో నీరుగారిపోయాయి.
6అప్పుడు యెహోషువ, తన బట్టలు చింపుకొని యెహోవా మందసం ముందు నేలమీద పడి, సాయంకాలం వరకు అక్కడే ఉన్నాడు. ఇశ్రాయేలు పెద్దలు కూడా అలాగే చేసి తమ తలలపై దుమ్ము చల్లుకున్నారు. 7యెహోషువ, “అయ్యో! ప్రభువైన యెహోవా! ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మమ్మల్ని నాశనం చేయమని అమోరీయుల చేతికి అప్పగించడానికా? మేము యొర్దాను అవతలి ఒడ్డున ఆగిపోవడానికి నిర్ణయించుకొని ఉంటే ఎంత బాగుండేది! 8ప్రభువా, మీ సేవకుని క్షమించు. ఇప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువును ఎదుర్కోలేక పారిపోయారు, నేను ఏమి చెప్పగలను? 9కనాను ప్రజలు, ఈ దేశంలో ఉన్న ఇతర ప్రజలు ఈ సంగతిని విని మమ్మల్ని చుట్టుముట్టి భూమి మీద మా పేరును తుడిచివేస్తారు. అప్పుడు మీ గొప్ప పేరుకు ఉన్న ఘనత కోసం ఏమి చేస్తావు?” అని ప్రార్థించాడు.
10అయితే యెహోవా యెహోషువతో ఇలా అన్నారు, “నీవు లే! నీ ముఖం నేలకేసి నీవేమి చేస్తున్నావు? 11ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు; నేను వారికి ఆజ్ఞాపించిన నా ఒడంబడికను వారు ఉల్లంఘించారు. శపించబడిన వాటిలో కొన్నిటిని తీసి దొంగిలించి అబద్ధమాడారు, వారు వాటిని తమ సొంత ఆస్తులతో పాటు పెట్టుకున్నారు. 12అందుకే ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల ఎదుట నిలువలేక పోతున్నారు; వారు శాపానికి గురికావడం వల్లనే శత్రువులకు వెన్ను చూపి పారిపోయారు. మీ మధ్య వేరుగా ఉంచబడిన వాటన్నిటిని మీరు నాశనం చేస్తేనే తప్ప నేను ఇప్పటినుండి మీతో ఉండను.
13“నీవు వెళ్లి, ప్రజలను పవిత్రపరచు. వారితో ఇలా చెప్పు, ‘రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి; ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలూ, మీ మధ్య శాపగ్రస్తమైనవి ఉన్నాయి. వాటిని తీసివేసే వరకు మీరు మీ శత్రువుల ఎదుట నిలబడలేరు.
14“ ‘ఉదయాన్నే గోత్రం వెంబడి గోత్రం మీరు హాజరు కావాలి. అప్పుడు యెహోవా ఎంచుకున్న గోత్రం వంశాలవారిగా ముందుకు వస్తుంది; యెహోవా ఎంచుకున్న వంశం కుటుంబాల ప్రకారం ముందుకు వస్తుంది; యెహోవా ఎంచుకున్న కుటుంబం యొక్క పురుషులు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వస్తారు. 15శపించబడినవి ఎవరి దగ్గర దొరుకుతుందో వారిని, వారికి చెందిన వారందరిని అగ్నితో నాశనం చేయాలి. వారు యెహోవా ఒడంబడికను మీరి ఇశ్రాయేలులో అవమానకరమైన పని చేశారు!’ ”
16మరుసటిరోజు తెల్లవారుజామున యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను గోత్రాల ప్రకారం ముందుకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టుబడింది. 17యూదా వంశాలు ముందుకు వచ్చినప్పుడు జెరహీయులు పట్టుబడ్డారు. అతడు జెరహీయుల వంశాన్ని కుటుంబాల ప్రకారం ముందుకు వచ్చినప్పుడు జబ్ది ఎంపిక చేయబడ్డాడు. 18యెహోషువ అతని కుటుంబాన్ని ఒక్కొక్కరిగా ముందుకు రప్పించగా, యూదా గోత్రానికి చెందిన జెరహు కుమారుడైన జిమ్రీ, జిమ్రీ కుమారుడైన కర్మీ, కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడ్డాడు.
19అప్పుడు యెహోషువ ఆకానుతో, “నా కుమారుడా, నిజం చెప్పి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మహిమ కలిగేలా ఆయనను ఘనపరచు. నువ్వేం చేశావో నాతో చెప్పు; దాన్ని నా దగ్గర దాచవద్దు అన్నాడు” అన్నాడు.
20అందుకు ఆకాను యెహోషువతో, “అది నిజమే! ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరుద్ధంగా నేను పాపం చేశాను. నేను ఏం చేశానంటే, 21దోపుడు సొమ్ములో ఒక అందమైన బబులోను#7:21 హెబ్రీలో షీనారు వస్త్రం, రెండువందల షెకెళ్ళ#7:21 అంటే సుమారు 2.3 కి. గ్రా. లు వెండి, యాభై షెకెళ్ళ#7:21 అంటే సుమారు 575 గ్రాములు బరువుగల బంగారుకడ్డీని నేను చూసి, నాకు చాలా ఇష్టమై నేను వాటిని తెచ్చుకున్నాను. అవి నా డేరాలో నేలలో వెండిని క్రింద ఉంచి వాటిని దాచిపెట్టాను” అని చెప్పాడు.
22కాబట్టి యెహోషువ దూతలను పంపినప్పుడు వారు గుడారానికి పరుగెత్తి, అతని గుడారంలో నేలలో క్రింద వెండి, దానిపై మిగతావి దాచిపెట్టబడి ఉండడం చూశారు. 23ఆ డేరా మధ్య నుండి వారు వాటిని తీసి యెహోషువ, ఇశ్రాయేలీయుల దగ్గరకు తెచ్చి యెహోవా ఎదుట వాటిని ఉంచారు.
24అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులతో పాటు జెరహు వంశస్థుడైన ఆకానును వెండిని వస్త్రాన్ని బంగారుకడ్డీని ఆకాను కుమారులను కుమార్తెలను అతని ఎద్దులను గాడిదలను గొర్రెలను అతని డేరాను అతనికి ఉన్నదంతటిని పట్టుకుని ఆకోరు లోయకు తెచ్చారు. 25యెహోషువ, “నీవు మాకు ఈ ఇబ్బంది ఎందుకు తెచ్చావు? ఈ రోజు యెహోవా నిన్ను బాధిస్తారు” అని అన్నాడు.
అప్పుడు ఇశ్రాయేలీయులంతా ఆకానును, అతని కుటుంబీకులను రాళ్లతో కొట్టి కాల్చివేశారు. 26ఆకాను మీద వారు ఒక పెద్ద రాళ్లకుప్పను వేశారు, అది ఇప్పటికీ ఉంది. అప్పుడు యెహోవా తీవ్రమైన కోపం చల్లారింది. కాబట్టి అప్పటినుండి ఆ స్థలాన్ని ఆకోరు#7:26 ఆకోరు అంటే ఇబ్బంది లోయ అని పిలుస్తారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహోషువ 7: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.