యెహోషువ 6

6
1ఇశ్రాయేలీయుల భయంతో యెరికో ద్వారాలు గట్టిగా మూసివేయబడ్డాయి. ఎవరూ బయటకు రావడానికి గాని లోపలికి వెళ్లడానికి గాని లేదు.
2అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పారు, “చూడు, యెరికోను, దాని రాజును, దానిలో ఉన్న యుద్ధవీరులతో పాటు మీ చేతికి అప్పగిస్తున్నాను. 3నీవు యుద్ధవీరులందరితో పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి. ఇలా ఆరు రోజులు చేయాలి. 4మందసం ముందు ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి. ఏడవ రోజున యాజకులు బూరలు ఊదుతూ పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరగాలి. 5వారు మానకుండా చేస్తున్న బూరధ్వని మీరు విన్నప్పుడు, సైన్యమంతా పెద్దగా కేకలు వేయాలి; అప్పుడు ఆ పట్టణపు గోడ కూలిపోతుంది, సైన్యంలో ప్రతి ఒక్కరు పైకి ఎక్కి నేరుగా లోపలికి వెళ్తారు.”
6కాబట్టి నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిచి వారితో, “మీరు యెహోవా నిబంధన మందసాన్ని ఎత్తుకుని దాని ముందు ఏడుగురు యాజకులు బూరలు పట్టుకుని నడవాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు. 7తర్వాత అతడు, “పదండి ముందుకు! యెహోవా మందసం ముందు ఆయుధాలు ధరించిన వీరులు నడుస్తుండగా పట్టణం చుట్టూ తిరగాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
8యెహోషువ ప్రజలతో మాట్లాడినప్పుడు, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని ఏడు బూరలను మోస్తూ, బూరలు పట్టుకుని వాటిని ఊదుతూ ముందుకు సాగుతూ ఉండగా, యెహోవా నిబంధన మందసం వారి వెంట వెళ్లింది. 9ఆయుధాలు ధరించిన వీరులు బూరలు ఊదుతున్న యాజకుల ముందు నడుస్తుండగా, వెనుక ఉన్న వీరులు మందసం వెనుక నడిచారు. ఆ సమయమంతా యాజకులు బూరలు ఊదుతూనే ఉన్నారు. 10కానీ యెహోషువ, “యుద్ధపు కేక వేయవద్దు, మీ స్వరాలు ఎత్తవద్దు, నేను మీకు అరవమని చెప్పే రోజు వరకు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నేను చెప్పినప్పుడు అరవండి!” అని సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. 11అలా అతడు యెహోవా మందసాన్ని మోసుకొని పట్టణం చుట్టూ ఒకసారి తిరిగేలా చూశాడు. తర్వాత సైన్యం శిబిరానికి తిరిగివచ్చి రాత్రి అక్కడ గడిపింది.
12యెహోషువ మరుసటిరోజు ఉదయాన్నే లేవగా, యాజకులు, యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తుకున్నారు. 13ఆ ఏడుగురు యాజకులు ఏడు బూరలను పట్టుకుని యెహోవా మందసం ముందు నడుస్తూ బూరలు ఊదుతూ ఉన్నారు. బూరధ్వని వినబడుతూ ఉండగా, ఆయుధాలు ధరించిన వీరులు వారికి ముందు వెళ్తుండగా, వెనుక ఉన్న వీరులు యెహోవా మందసం వెనుక వెళ్లారు. 14రెండవ రోజున కూడా వారు పట్టణం చుట్టూ ఒకసారి తిరిగి, శిబిరానికి తిరిగి వచ్చారు. అలా వారు ఆరు రోజులపాటు చేశారు.
15ఏడవ రోజున వారు తెల్లవారుజామున లేచి, రోజూలాగే పట్టణం చుట్టూ తిరిగారు. అయితే ఆ రోజు ఆ పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు. 16ఏడవసారి తిరుగుతూ ఉండగా, యాజకులు బూరధ్వని చేయగానే యెహోషువ, “అరవండి! యెహోవా మీకు ఈ పట్టణాన్ని ఇచ్చారు! 17పట్టణం, దానిలో ఉన్నవన్నీ యెహోవా వలన శపించబడ్డాయి.#6:17 ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే; అలాగే 18, 21. అయితే మనం పంపిన దూతలను దాచిపెట్టిన వేశ్యయైన రాహాబును, ఆమెతో పాటు ఆమె ఇంట్లో ఉన్నవారిని మాత్రం మనం విడిచిపెట్టాలి. 18శపించబడిన వాటికి దూరంగా ఉండండి, లేకపోతే వాటిలో ఏదైనా తీసుకుని మీ సొంత నాశనాన్ని మీరు తెచ్చుకుంటారు! ఇశ్రాయేలీయుల శిబిరాన్ని నాశనానికి గురిచేసి దాని మీదికి కష్టాలు తెచ్చిన వారవుతారు. 19వెండి, బంగారం, ఇత్తడి, ఇనుప వస్తువులు అన్నీ యెహోవాకు పవిత్రమైనవి, వాటిని ఆయన ఖజానాలోనికి చేర్చాలి.”
20బూరలు ఊదగానే సైన్యం కేకలు వేసింది. బూర శబ్దానికి పురుషులు పెద్దగా అరవడంతో గోడ కూలిపోయింది; కాబట్టి అందరు నేరుగా లోపలికి ప్రవేశించి వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. 21వారు పట్టణాన్ని యెహోవా కోసం ప్రత్యేకపరచి, పురుషులను, స్త్రీలను, చిన్నవారిని, పెద్దవారిని, పశువులను, గొర్రెలను, గాడిదలను దానిలోని ప్రతి జీవిని ఖడ్గంతో నాశనం చేశారు.
22ఆ దేశాన్ని వేగు చూసిన ఇద్దరు వ్యక్తులతో యెహోషువ ఇలా అన్నాడు: “మీరు వేశ్య ఇంటికి వెళ్లి మీరు ఆమెతో చేసిన ప్రమాణం ప్రకారం ఆమెను, ఆమెకు చెందిన వారందరినీ బయటకు తీసుకురండి.” 23కాబట్టి వేగు చూసిన యువకులు లోపలికి వెళ్లి రాహాబును, ఆమె తండ్రిని, తల్లిని, ఆమె సోదరులు, సోదరీమణులను, ఆమెకు చెందిన వారందరినీ బయటకు తీసుకువచ్చారు. వారు ఆమె కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి ఇశ్రాయేలు శిబిరం బయట ఒకచోట ఉంచారు.
24ఆ తర్వాత వారు ఆ పట్టణాన్ని, దానిలోని సమస్తాన్ని కాల్చివేసి, వెండి బంగారాన్ని, ఇత్తడి ఇనుప వస్తువులను యెహోవా మందిరంలోని ఖజానాలో పెట్టారు. 25అయితే యెరికోకు వేగులవారిగా యెహోషువ పంపిన వారిని దాచిపెట్టింది కాబట్టి, వేశ్యయైన రాహాబును ఆమె కుటుంబంతో పాటు ఆమెకు సంబంధించిన వారందరినీ విడిచిపెట్టాడు; ఆమె ఈనాటికీ ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తుంది.
26ఆ సమయంలో యెహోషువ ఈ గంభీరమైన ప్రమాణం చేశాడు: “యెరికో పట్టణాన్ని మరలా కట్టాలనుకునేవాడు యెహోవా ఎదుట శాపగ్రస్తుడు:
“దాని పునాది వేసే వాడి
పెద్దకుమారుడు చనిపోతాడు
దాని తలుపులను నిలబెట్టేవాడి
చిన్నకుమారుడు చనిపోతాడు.”
27యెహోవా యెహోషువతో ఉన్నారు కాబట్టి అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహోషువ 6: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి