యిర్మీయా 26

26
యిర్మీయాకు మరణ బెదిరింపు
1యూదారాజు యోషీయా కుమారుడైన యెహోయాకీము పరిపాలన ప్రారంభంలో, యెహోవా నుండి ఈ మాట వచ్చింది: 2“యెహోవా ఇలా అంటున్నారు: యెహోవా ఆలయ ఆవరణలో నిలబడి, యూదా పట్టణాల నుండి యెహోవా మందిరంలో ఆరాధించడానికి వచ్చే ప్రజలందరితో మాట్లాడు. ఒక్క మాట కూడా వదలకుండ నేను నీకు ఆజ్ఞాపిస్తున్నదంతా వారికి చెప్పు. 3బహుశా వారు విని తమ చెడు మార్గాలను విడిచిపెట్టవచ్చు. అప్పుడు నేను నా మనస్సు మార్చుకుని వారి దుర్మార్గాన్ని బట్టి నేను వారి మీదికి రప్పించాలనుకున్న విపత్తును రప్పించను. 4వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు నా మాట వినకపోయినా, నేను మీ ముందు ఉంచిన నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినా, 5పదే పదే నేను మీ దగ్గరకు పంపిన నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోయినా, 6నేను ఈ మందిరానికి షిలోహుకు చేసినట్లు చేస్తాను, ఈ పట్టణాన్ని భూమ్మీద ఉన్న అన్ని దేశాల్లో ఒక శాపంగా చేస్తాను.’ ”
7యిర్మీయా యెహోవా మందిరంలో ఈ మాటలు మాట్లాడడం యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ విన్నారు. 8అయితే చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించినవన్నీ యిర్మీయా ప్రజలందరికి చెప్పడం ముగించిన వెంటనే యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ అతన్ని పట్టుకుని, “నీవు తప్పక చావాల్సిందే! 9ఈ మందిరం షిలోహులా అవుతుందని, ఈ పట్టణం నిర్జనమై ఎడారిగా అవుతుందని నీవు యెహోవా నామంలో ఎందుకు ప్రవచిస్తున్నావు?” అని అంటూ ప్రజలంతా యిర్మీయా యెహోవా మందిరంలో ఉండగానే అతని చుట్టూ గుమిగూడారు.
10ఈ సంగతుల గురించి యూదా అధికారులు విన్నప్పుడు, వారు రాజభవనం నుండి యెహోవా ఆలయానికి వెళ్లి యెహోవా ఆలయ క్రొత్త గుమ్మం దగ్గర కూర్చున్నారు. 11అప్పుడు యాజకులు, ప్రవక్తలు అధికారులతో, ప్రజలందరితో, “ఈ వ్యక్తి ఈ పట్టణానికి వ్యతిరేకంగా ప్రవచించాడు, అది మీ చెవులతో మీరే విన్నారు. కాబట్టి ఇతనికి మరణశిక్ష విధించాలి” అని అన్నారు.
12అప్పుడు యిర్మీయా అధికారులందరితోను, అలాగే ప్రజలందరితోను ఇలా చెప్పారు: “మీరు విన్నదంతా ఈ ఆలయానికి, ఈ పట్టణానికి వ్యతిరేకంగా ప్రవచించడానికి యెహోవాయే నన్ను పంపించారు. 13మీ మార్గాలను, క్రియలను, సరిచేసికొని, మీ దేవుడైన యెహోవాకు లోబడండి. అప్పుడు యెహోవా తన మనస్సు మార్చుకుని, మీ మీదికి రప్పిస్తానని ఆయన ప్రకటించిన విపత్తును ఆయన రప్పించరు. 14ఇక నా విషయానికొస్తే, నేను మీ చేతుల్లో ఉన్నాను; మీకు ఏది మంచిది, సరియైనది అనిపిస్తే అదే చేయండి. 15కాని ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఒకవేళ మీరు నన్ను చంపితే, నిర్దోషిని చంపిన అపరాధం మీ మీదికి, ఈ పట్టణం మీదికి, అందులో నివసించేవారి మీదికి తెచ్చిన వారవుతారు. ఎందుకంటే ఈ మాటలన్నీ మీకు వినబడేలా చెప్పడానికి నిజంగా యెహోవాయే నన్ను మీ దగ్గరికి పంపారు.”
16అప్పుడు అధికారులు, ప్రజలందరూ యాజకులతో ప్రవక్తలతో ఇలా అన్నారు, “ఇదంతా ఇతడు మన దేవుడైన యెహోవా నామంలో మనతో చెప్పాడు కాబట్టి ఇతనికి మరణశిక్ష విధించకూడదు!” అన్నారు.
17అప్పుడు ఆ దేశంలోని పెద్దలలో కొందరు ముందుకు వచ్చి, ప్రజల సమాజమంతటితో ఇలా అన్నారు, 18“మోరెషెతు వాడైన మీకా ప్రవక్త యూదా రాజైన హిజ్కియా దినాల్లో ప్రవచించాడు. అతడు యూదా ప్రజలందరితో ఇలా చెప్పాడు, ‘సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు:
“ ‘సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది,
యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది,
ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో నిండిపోతుంది.’#26:18 మీకా 3:12
19“మరి యూదా రాజైన హిజ్కియా గాని, యూదా దేశస్థుడు ఎవడైనా గాని, ఆ ప్రవక్తను చంపారా? ఆ రాజైన హిజ్కియా భయభక్తులతో యెహోవా దయ కోసం ప్రార్ధన చేశాడు గదా! యెహోవా మనస్సు మార్చుకుని, వారి మీదికి రప్పించవలసిన కీడును ఆపివేయలేదా? మనకు మనమే మన మీదికి భయంకరమైన విపత్తు తెచ్చుకోబోతున్నాం!”
20(అదే సమయంలో కిర్యత్-యారీము వాడైన షెమయా కుమారుడైన ఊరియా అనే మరొక వ్యక్తి యెహోవా నామమున ప్రవచించాడు; అతడు కూడా యిర్మీయా ప్రవచించినట్లే ఈ పట్టణానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రవచించాడు. 21రాజైన యెహోయాకీము, అతని అధికారులు, ముఖ్యులందరూ అతని మాటలు విన్నప్పుడు, రాజు అతన్ని చంపాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఊరియా అది విని భయపడి ఈజిప్టుకు పారిపోయాడు. 22అయితే రాజైన యెహోయాకీము, అక్బోరు కుమారుడైన ఎల్నాతానును మరికొందరు వ్యక్తులతో పాటు ఈజిప్టుకు పంపాడు. 23వారు ఊరియాను ఈజిప్టు నుండి రాజైన యెహోయాకీము దగ్గరకు తీసుకురాగా, రాజు అతడిని ఖడ్గంతో చంపి అతని దేహాన్ని సామాన్య ప్రజల సమాధి స్థలంలోకి విసిరివేశాడు.)
24ఇంకా, షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు అండగా నిలబడ్డాడు, కాబట్టి యిర్మీయాను చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 26: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి