యెషయా 59
59
పాపం, ఒప్పుకోలు, విమోచన
1నిజంగా రక్షించలేనంతగా యెహోవా చేయి కురుచకాలేదు,
వినలేనంతగా ఆయన చెవులు మందం కాలేదు.
2కాని మీ పాపాలు మిమ్మల్ని
మీ దేవుని నుండి వేరు చేశాయి;
మీ పాపాలు ఆయన ముఖాన్ని మీకు కనబడకుండా చేశాయి,
కాబట్టి ఆయన వినడం లేదు.
3మీ చేతులు రక్తంతో
మీ వ్రేళ్లు దోషంతో మలినమయ్యాయి.
మీ పెదవులు అబద్ధాలు పలికాయి,
మీ నాలుక చెడ్డ మాటలు మాట్లాడింది.
4న్యాయం గురించి ఎవరూ పట్టించుకోరు;
ఎవరూ నిజాయితితో వాదించరు.
వారు వట్టి వాదనలను నమ్ముకుని అబద్ధాలు చెప్తారు;
వారు హింసను గర్భం దాల్చి చెడును కంటారు.
5వారు మిడునాగుల గుడ్లను పొదుగుతారు
సాలెగూడు నేస్తారు.
వారి గుడ్లు తిన్నవారు చనిపోతారు,
ఒక గుడ్డు పగిలితే విషపాము పుడుతుంది.
6వారి సాలెగూళ్లు దుస్తులకు పనికిరావు
వారు తయారుచేసిన వాటితో తమను తాము కప్పుకోలేరు.
వారి పనులు చెడుపనులు.
వారి చేతులతో హింసాత్మక క్రియలు ఉన్నాయి.
7వారి కాళ్లు పాపంలోకి పరుగెత్తుతాయి;
నిరపరాధుల రక్తాన్ని చిందించడానికి వారు త్వరపడతారు.
వారు దుష్ట పథకాలు అనుసరిస్తారు.
హింస క్రియలు వారి మార్గాల్లో ఉన్నాయి.
8సమాధాన మార్గం వారికి తెలియదు;
వారి మార్గాల్లో న్యాయం ఉండదు.
వాటిని వారు వంకర దారులుగా చేశారు;
వాటిలో నడిచే వారెవరికి సమాధానం ఉండదు.
9కాబట్టి న్యాయం మనకు దూరంగా ఉంది,
నీతి మనకు అందడం లేదు.
మేము వెలుగు కోసం చూస్తున్నాం కాని అంతా చీకటే ఉంది;
ప్రకాశం కోసం చూస్తున్నాం కాని కటిక చీకటిలోనే నడుస్తున్నాము.
10గ్రుడ్డివారిలా గోడ కోసం తడుముకుంటున్నాము,
కళ్లులేని వారిలా తడుముకుంటున్నాము.
సంధ్య చీకటి అన్నట్టు మధ్యాహ్నం కాలుజారి పడుతున్నాము.
బలవంతుల మధ్యలో చచ్చిన వారిలా ఉన్నాము.
11మేమంతా ఎలుగుబంట్లలా కేకలు వేస్తున్నాము;
పావురాల్లా దుఃఖంతో మూలుగుతున్నాము.
మేము న్యాయం కోసం చూస్తున్నాం కాని అది దొరకడం లేదు.
రక్షణ కోసం చూస్తున్నాం కాని అది మాకు దూరంగా ఉంది.
12మా అపరాధాలన్నీ మా ఎదుట ఉన్నాయి
మా పాపాలు మామీద సాక్ష్యం ఇస్తున్నాయి.
మా అపరాధాలన్నీ ఎల్లప్పుడు మాతో ఉన్నాయి,
మా దోషాలు మాకు తెలుసు.
13తిరుగుబాటు చేసి యెహోవాకు ద్రోహం చేశాం,
మా దేవునికి విరుద్ధంగా ఉంటూ,
తిరుగుబాటును ప్రేరేపించడం బాధపెట్టడం,
మా హృదయంలో ఆలోచించుకుని, అబద్ధాలు చెప్పడము.
14కాబట్టి న్యాయం వెనుకకు నెట్టబడింది,
నీతి దూరంగా నిలబడింది.
సత్యం వీధుల్లో పడి ఉంది.
నిజాయితీ లోపలికి రాలేకపోతుంది.
15సత్యం ఎక్కడా కనిపించడం లేదు,
చెడును విడిచిపెట్టేవాడు దోచుకోబడుతున్నాడు.
న్యాయం జరగకపోవడం చూసి
యెహోవా అసంతృప్తి చెందారు.
16ఎవరూ లేరని ఆయన చూశారు,
మధ్యవర్తి ఎవరూ లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు;
కాబట్టి ఆయన చేయి ఆయనకు సహాయం చేసింది,
ఆయన నీతి ఆయనను నిలబెట్టింది.
17ఆయన నీతిని తన కవచంగా ధరించారు,
రక్షణను తన తలమీద శిరస్త్రాణంగా ధరించారు;
ఆయన ప్రతీకార వస్త్రాలను ధరించారు
పై వస్త్రం ధరించినట్లు ఆయన తనను తాను ఆసక్తితో చుట్టుకున్నారు.
18వారు చేసిన దానిని బట్టి
ఆయన ప్రతిఫలం ఇస్తారు
తన శత్రువులకు కోపం చూపిస్తారు
తన విరోధులకు ప్రతీకారం చేస్తారు;
ఆయన ద్వీపాలకు తగిన ప్రతిఫలాన్ని చెల్లిస్తారు.
19పశ్చిమలో ఉన్నవారు యెహోవా నామానికి భయపడతారు.
సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమను గౌరవిస్తారు.
యెహోవా ఊపిరి తీసుకువచ్చే ఉధృతమైన
వరదలా ఆయన వస్తారు.
20“సీయోను దగ్గరకు, యాకోబులో తమ పాపాలకు పశ్చాత్తాపం చెందినవారి దగ్గరకు
విమోచకుడు వస్తాడు,”
అని యెహోవా తెలియజేస్తున్నారు.
21“నేను వారితో చేసే నా నిబంధన ఇదే” అని యెహోవా చెప్తున్నారు. “మీమీద ఉన్న నా ఆత్మ మీ నుండి తొలిగిపోదు, నేను మీ నోటిలో ఉంచిన నా మాటలు, మీ పెదవుల నుండి, మీ పిల్లల పెదవుల నుండి, వారి వారసుల పెదవుల నుండి, ఇప్పటినుండి ఎప్పటికీ తొలగిపోవు” అని యెహోవా తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 59: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.