యెషయా 60
60
సీయోను యొక్క మహిమ
1“లేచి ప్రకాశించు, నీ వెలుగు వచ్చింది,
యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.
2చూడు, భూమిని చీకటి కమ్ముతుంది
కటిక చీకటి జనాంగాలను కమ్ముకుంటుంది.
కాని యెహోవా నీ మీద ఉదయిస్తున్నారు.
ఆయన మహిమ నీ మీద కనబడుతుంది.
3దేశాలు నీ వెలుగు దగ్గరకు వస్తాయి,
రాజులు నీ ఉదయకాంతి దగ్గరకు వస్తారు.
4“నీ కళ్లు పైకెత్తి చూడు:
అందరు కలిసి నీ దగ్గరకు వస్తున్నారు;
నీ కుమారులు దూరం నుండి వస్తున్నారు,
నీ కుమార్తెలు చంకనెక్కి వస్తున్నారు.
5అప్పుడు నీవు చూసి ప్రకాశిస్తావు.
నీ గుండె కొట్టుకొంటూ ఆనందంతో పొంగుతుంది;
సముద్ర సంపద నీ దగ్గరకు త్రిప్పబడుతుంది,
దేశాల సంపద నీ దగ్గరకు వస్తుంది.
6ఒంటెల మందలు, మిద్యాను ఏఫాల ఒంటె పిల్లలతో
నీ దేశం నిండిపోతుంది.
వారందరు షేబ నుండి వస్తారు,
బంగారం ధూపద్రవ్యాలను తీసుకువస్తారు,
యెహోవా స్తుతిని ప్రకటిస్తారు.
7నీ దగ్గర కేదారు గొర్రె మందలన్నీ సమకూడతాయి.
నెబాయోతు పొట్టేళ్లు నీకు సేవ చేస్తాయి;
అవి నా బలిపీఠం మీద అర్పణలుగా అంగీకరించబడతాయి.
నేను నా మహిమగల మందిరాన్ని అలంకరిస్తాను.
8“మేఘాల్లా, తమ గూళ్లకు ఎగిరిపోయే పావురాల్లా
ఎగిరే వీరెవరు?
9నిజంగా ద్వీపాలు నా వైపు చూస్తాయి;
నీ దేవుడైన యెహోవాను
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఘనపరచడానికి,
తర్షీషు ఓడలు మొదట వస్తున్నాయి,
దూరము నుండి నీ పిల్లలను
తమ వెండి బంగారాలను తీసుకువస్తున్నాయి,
ఎందుకంటే ఆయన నిన్ను వైభవంతో అలంకరించారు.
10“విదేశీయులు నీ గోడల్ని మరల కడతారు,
వారి రాజులు నీకు సేవ చేస్తారు.
నేను కోపంలో నిన్ను కొట్టాను కాని,
నేను కరుణించి నీ మీద దయ చూపిస్తాను.
11నీ దగ్గరకు దేశాల సంపద తీసుకురావడానికి,
జయోత్సవంతో వారి రాజులను నడిపించడానికి,
నీ ద్వారాలు రాత్రింబగళ్ళు మూసివేయకుండా
నిత్యం తెరిచే ఉంటాయి.
12నిన్ను సేవించని దేశమైనా రాజ్యమైనా నాశనమవుతుంది;
అది పూర్తిగా నాశనమవుతుంది.
13“నా పరిశుద్ధాలయాన్ని అలంకరించడానికి
లెబానోను యొక్క వైభవమైన దేవదారు వృక్షాలు,
సరళ వృక్షాలు, గొంజిచెట్లు నీ దగ్గరకు తీసుకువస్తారు.
నేను నా పాదాలు పెట్టే స్థలాన్ని మహిమపరుస్తాను.
14నిన్ను బాధించినవారి పిల్లలు నీ ఎదుటకు వచ్చి నమస్కరిస్తారు.
నిన్ను తృణీకరించిన వారందరు వచ్చి నీ పాదాల దగ్గర మోకరిస్తారు,
యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యొక్క
సీయోనని వారు నిన్ను పిలుస్తారు.
15“నీవు విడిచిపెట్టబడి, ద్వేషించబడి
నీ మార్గంలో ఎవరూ ప్రయాణించకపోయినా,
నేను నిన్ను శాశ్వత ఘనతగా
అన్ని తరాలకు ఆనందంగా చేస్తాను.
16నీవు దేశాల పాలు త్రాగుతావు
రాజుల చనుపాలు త్రాగుతావు.
అప్పుడు నీవు యెహోవానైన నేనే నీ రక్షకుడనని
యాకోబు యొక్క బలవంతుడైన నీ విమోచకుడని తెలుసుకుంటావు.
17నేను ఇత్తడికి బదులు బంగారాన్ని
ఇనుముకు బదులు వెండిని నీకు తెస్తాను.
నేను కర్రకు బదులు ఇత్తడిని
రాళ్లకు బదులు ఇనుమును నీకు తెస్తాను.
నేను సమాధానాన్ని నీకు అధిపతిగా
నీతిని నీకు పాలకునిగా నియమిస్తాను.
18ఇకపై నీ దేశంలో హింస అనేది వినబడదు,
నీ సరిహద్దులలో నాశనం గాని విధ్వంసం గాని వినపడదు.
అయితే నీవు నీ గోడలను రక్షణ అని
నీ గుమ్మాలను స్తుతి అని పిలుస్తావు.
19ఇకమీదట పగలు సూర్యుని వెలుగు నీకు ఉండదు,
చంద్రుని వెన్నెల నీపై ప్రకాశించదు,
యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు.
నీ దేవుడు నీకు మహిమగా ఉంటారు.
20నీ సూర్యుడికపై అస్తమించడు.
నీ చంద్రుడు క్షీణించడు.
యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు,
నీ దుఃఖ దినాలు అంతమవుతాయి.
21అప్పుడు నీ ప్రజలందరు నీతిమంతులుగా ఉంటారు;
వారు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు.
నా వైభవం కనుపరచడానికి
వారు నేను నాటిన కొమ్మగా
నా చేతుల పనిగా ఉంటారు.
22నీలో చిన్నవాడు వేయిమంది అవుతాడు,
కొద్దిగా ఉన్నది బలమైన దేశమవుతుంది.
నేను యెహోవాను;
సరియైన సమయంలో ఈ పనిని త్వరగా చేస్తాను.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 60: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.