యెషయా 22
22
యెరూషలేము గురించి ప్రవచనం
1దర్శనపు లోయకు వ్యతిరేకంగా ప్రవచనం:
ఏ కారణంగా మీరందరు
మేడల మీదికి ఎక్కారు?
2కల్లోలంతో నిండిన పట్టణమా!
కోలాహలం, ఉల్లాసంతో ఉన్న పట్టణమా!
నీలో చనిపోయినవారు ఖడ్గం వలన చనిపోలేదు.
యుద్ధంలో మరణించలేదు.
3నీ నాయకులందరు కలిసి పారిపోయారు;
విల్లు వాడకుండానే వారు పట్టుబడ్డారు.
శత్రువు దూరంగా ఉండగానే పారిపోయిన వారందరిని,
మీలో పట్టుబడిన వారందరిని కలిపి బందీలుగా తీసుకెళ్లారు.
4అప్పుడు నేను, “నా నుండి దూరంగా వెళ్లండి;
నన్ను గట్టిగా ఏడవనివ్వండి.
నా ప్రజలకు కలిగిన నాశనం గురించి
నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి” అని చెప్తాను.
5దర్శనపు లోయలో
సైన్యాల అధిపతియైన యెహోవా
నియమించిన రోజున కల్లోలం, తొక్కిసలాట, గందరగోళం ఉంటాయి,
గోడలు కూలిపోతాయి
పర్వతాల వైపు కేకలతో ఏడ్వడం ఉంటుంది.
6ఏలాము రథసారధులతో గుర్రాలతో
తన అంబులపొదిని నింపుకుంది.
కీరు మనుష్యులు డాలును బయటకు తీశారు.
7కాబట్టి మీకు ఇష్టమైన లోయల నిండా రథాలు ఉన్నాయి,
గుర్రపురౌతులు పట్టణపు గుమ్మాల దగ్గర తమ స్థానాల్లో ఉన్నారు.
8ప్రభువు యూదా నుండి రక్షణ కవచాన్ని తీసివేశారు,
ఆ రోజున మీరు అరణ్య రాజభవనంలో ఉన్న
ఆయుధాల వైపు చూశారు.
9దావీదు పట్టణపు గోడలు
చాలా స్థలాల్లో పాడైనట్లు చూశారు
దిగువన ఉన్న కొలనులో
మీరు నీటిని సమకూర్చారు.
10మీరు యెరూషలేములోని భవనాలను లెక్కపెట్టి
గోడను పటిష్టం చేయడానికి ఇళ్ళను పడగొట్టారు.
11పాత కొలనులో నీటి కోసం
మీరు రెండు గోడల మధ్య జలాశయం కట్టారు.
కాని దానిని నిర్మించిన వ్యక్తి వైపు మీరు చూడలేదు.
పూర్వకాలంలో దానిని ఆలోచించిన వ్యక్తిని మీరు లెక్కచేయలేదు.
12ఆ రోజున ఏడ్వడానికి కన్నీరు కార్చడానికి
తలలు గొరిగించుకోడానికి
గోనెపట్ట కట్టుకోడానికి
సైన్యాల అధిపతియైన యెహోవా మిమ్మల్ని పిలుస్తారు.
13కాని మీరు, “రేపు చనిపోతాం కాబట్టి
మనం తిని త్రాగుదాం” అని చెప్పి,
పశువులను నరుకుతూ గొర్రెలను చంపుతూ,
మాంసం తింటూ, ద్రాక్షరసం త్రాగుతూ,
మీరు సంతోషించి ఉల్లసిస్తారు.
14ప్రభువు, సైన్యాల యెహోవా బయలుపరిచింది ఇది: “నీ మరణించే రోజు వరకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు” అని సర్వశక్తిమంతుడైన సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.
15సైన్యాల అధిపతియైన యెహోవా ఇలా అంటున్నారు:
“నిర్వాహకుడు, అనగా రాజభవన నిర్వాహకుడైన
షెబ్నా దగ్గరకు వెళ్లి అతనితో ఇలా చెప్పు:
16నీవిక్కడేం చేస్తున్నావు
నీకోసం ఇక్కడ సమాధిని ఎందుకు తొలిపించుకున్నావు?
నీ సమాధిని ఎత్తైన స్థలంలో తొలిపించుకున్నావు?
నీ విశ్రాంతి స్థలాన్ని బండపై ఎందుకు చెక్కించుకున్నావు?
నీకు ఎవరు అనుమతి ఇచ్చారు?
17“ఓ బలవంతుడా, యెహోవా నిన్ను గట్టిగా పట్టుకుని,
వేగంగా విసిరివేస్తారు, జాగ్రత్త!
18ఆయన నిన్ను ఒక బంతిలా దొర్లించి
విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేస్తారు.
అక్కడ నీవు చనిపోతావు,
నీ గొప్ప రథాలు అక్కడే పడి ఉంటాయి;
నీ యజమాని ఇంటికి అవమానాన్ని తెస్తావు.
19నీ పని నుండి నేను నిన్ను తొలగిస్తాను,
నీ హోదా నుండి త్రోసివేయబడతావు.
20“ఆ రోజున నేను, నా సేవకుడైన హిల్కీయా కుమారుడైన ఎల్యాకీమును పిలిపించి, 21నీ చొక్కా అతనికి తొడిగించి, నీ నడికట్టు అతనికి కట్టి, నీ అధికారాన్ని అతనికి ఇస్తాను. అతడు యెరూషలేములో నివసించేవారికి, యూదా ప్రజలకు తండ్రిగా ఉంటాడు. 22నేను దావీదు ఇంటి తాళపు చెవిని అతని భుజం మీద ఉంచుతాను; అతడు తెరచిన దానిని ఎవరూ మూయలేరు. అతడు మూసివేసిన దానిని ఎవరూ తెరవలేరు. 23బలమైన చోట మేకు కొట్టినట్లు నేను అతని స్థిరపరుస్తాను; అతడు తన తండ్రి ఇంటికి గౌరవాన్ని ఘనతను తెచ్చే సింహాసనంగా ఉంటాడు. 24చిన్న గిన్నెలను పాత్రలను మేకుకు వ్రేలాడదీసినట్టు అతని కుటుంబ ఘనతను అతనిపై వ్రేలాడి ఉంటుంది.
25“సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, ఆ రోజున బలమైన చోట స్థిరంగా కొట్టబడిన మేకు ఊడిపోయి క్రిందపడిపోతుంది. దానిపై ఉన్న బరువు తెగి క్రిందపడుతుంది.” ఇదే యెహోవా చెప్పిన మాట.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 22: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.