యెషయా 21
21
బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం
1సముద్రపు తీరాన ఉన్న ఎడారికి వ్యతిరేకంగా ప్రవచనం:
దక్షిణ దిక్కున సుడిగాలి వీచినట్లుగా
ఎడారిలో నుండి
భయంకరమైన దేశం నుండి దోచుకునేవాడు వస్తాడు.
2భయంకరమైన దర్శనం నాకు వచ్చింది:
మోసం చేసేవారు మోసం చేస్తారు, దోచుకొనేవారు దోచుకుంటారు.
ఏలామూ, వెళ్లి దాడి చేయి! మెదీయా, ముట్టడించు!
దాని మూలుగు అంతటిని నేను ఆపివేస్తాను.
3కాబట్టి నా నడుము చాలా నొప్పిగా ఉంది,
ప్రసవించే స్త్రీ వేదన నాకు కలిగింది;
నేను విన్నదానిని బట్టి నేను తడబడ్డాను,
నేను చూసిన దానిని బట్టి నేను దిగ్భ్రాంతి చెందాను.
4నా గుండె దడదడలాడుతుంది
భయంతో వణుకు పుడుతుంది;
నేను ఇష్టమైన సంధ్యవేళ
నాకు భయం పుట్టించింది.
5వారు భోజనపు బల్లలను సిద్ధం చేశారు,
వారు తివాసీలు పరిచారు,
వారు తిని త్రాగుతారు!
అధిపతులారా! లేవండి
డాళ్లకు నూనె రాయండి.
6ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే:
“వెళ్లి కాపలా పెట్టండి
అతడు చూసింది తెలియజేయాలి.
7అతడు రథాలను
గుర్రాల జట్లను
గాడిదల మీద వచ్చేవారిని
ఒంటెల మీద వచ్చేవారిని చూడగానే
అతడు జాగ్రత్తగా
చాలా జాగ్రత్తగా ఉండాలి.”
8కావలివాడు సింహంలా కేకలు వేసి
“నా ప్రభువా, ప్రతిరోజు పగలంతా కావలి గోపురం మీద నిలబడుతున్నాను;
రాత్రంతా కాపలా కాస్తూనే ఉన్నాను.
9చూడు, జతలు జతలుగా గుర్రపు రౌతులతో కలిసి
రథం మీద ఓ మనిషి వస్తున్నాడు అనగా
అతడు ఇలా సమాధానం చెప్పాడు:
‘బబులోను కూలిపోయింది, కూలిపోయింది!
దాని దేవతల విగ్రహాలన్నీ
నేలమీద బద్దలై పడి ఉన్నాయి.’ ”
10నూర్పిడి కళ్ళాల్లో నలిగిపోతున్న నా ప్రజలారా!
సైన్యాల యెహోవా నుండి
ఇశ్రాయేలు దేవుని నుండి
నేను విన్నది నీకు చెప్తాను.
ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం
11దూమాకు#21:11 దూమా ఎదోముకు పదప్రయోగం అంటే, నిశబ్దం వ్యతిరేకంగా ప్రవచనం:
ఒకడు శేయీరులో నుండి నన్ను పిలుస్తున్నాడు,
“కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది?
కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది?”
12కావలివాడు, “ఉదయం అవుతుంది,
రాత్రి కూడా అవుతుంది.
మీరు అడగాలనుకుంటే అడగండి;
మరలా తిరిగి రండి” అని సమాధానం ఇస్తాడు.
అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం
13అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం:
అరేబియా ఎడారిలో బసచేసే
దెదానీయులైన యాత్రికులారా,
14మీరు దాహంతో ఉన్నవారికి నీళ్లు తీసుకురండి;
తేమా దేశ నివాసులారా,
పారిపోతున్నవారి కోసం ఆహారం తీసుకురండి.
15ఖడ్గం నుండి,
దూసిన ఖడ్గం నుండి,
ఎక్కుపెట్టిన బాణాల నుండి,
తీవ్రమైన యుద్ధం నుండి వారు పారిపోతారు.
16ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “కూలివాని లెక్క ప్రకారం ఒక సంవత్సరంలోనే కేదారు వైభవమంతా ముగిసిపోతుంది. 17కేదారు వీరులైన విలుకాండ్రలో కొంతమందే మిగిలి ఉంటారు.” ఇలా జరుగుతుందని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 21: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.