హెబ్రీయులకు 1:1-14

హెబ్రీయులకు 1:1-14 TCV

గతంలో దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు ఎన్నోవిధాలుగా మాట్లాడారు. కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు. ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తరువాత, ఆయన పరలోకంలో ఉన్న మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు. కనుక ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన నామాన్ని వారసత్వంగా పొందినట్లే ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందారు. దేవదూతల్లో ఎవరితోనైనా ఎన్నడైన దేవుడు, “నీవు నా కుమారుడివి; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను” అని గాని, “నేను ఆయనకు తండ్రిగా ఉంటాను, ఆయన నాకు కుమారునిగా ఉంటాడు,” అని గాని అన్నారా? దేవుడు తన మొదటి సంతానాన్ని భూలోకానికి తెచ్చినప్పుడు, ఆయన, “దేవదూతలందరు ఆయనను ఆరాధించాలి,” అని చెప్పారు. దేవదూతల గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు, “ఆయన తన దూతలను ఆత్మలుగా, తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేస్తారు,” అని అన్నారు. కాని తన కుమారుని గురించి ఆయన, “ఓ దేవా, నీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; న్యాయమనేది నీ రాజ్యానికి రాజదండం. నీవు నీతిని ప్రేమిస్తావు దుష్టత్వాన్ని ద్వేషిస్తావు; కనుక దేవుడు, నీ దేవుడు, ఆనంద తైలంతో నిన్ను అభిషేకించి, నీ తోటివారి కన్నా నిన్ను అధికంగా హెచ్చించారు,” అని అన్నారు. ఇంకా ఆయన, “ప్రభువా, ఆదిలో నీవు భూమికి పునాదులు వేశావు, ఆకాశాలు నీ చేతిపనులే. అవి ఒక వస్త్రంలా పాతగిల్లి నశించిపోతాయి; గాని నీవు ఎల్లప్పుడూ నిలిచివుంటావు. వాటిని నీవు అంగీలా చుట్టిపెడతావు; వస్త్రంలా అవన్నీ మార్చబడతాయి. కానీ నీవు అలాగే ఉంటావు, నీ సంవత్సరాలు ఎన్నడు తరగవు,” అని అన్నారు. దేవుడు దేవదూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా, “నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు నా కుడి వైపున కూర్చో అని చెప్పారా”? దేవదూతలందరు రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి పరిచర్య చేయడానికి పంపబడిన ఆత్మలు కారా?