హెబ్రీయులకు 1
1
దేవుని తుది వాక్కు: ఆయన కుమారుడు
1గతంలో దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు ఎన్నోవిధాలుగా మాట్లాడారు. 2కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు. 3ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తరువాత, ఆయన పరలోకంలో ఉన్న మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు. 4కనుక ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన నామాన్ని వారసత్వంగా పొందినట్లే ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందారు.
కుమారుడు దేవదూతల కంటే ఉన్నతుడు
5దేవదూతల్లో ఎవరితోనైనా ఎన్నడైన దేవుడు,
“నీవు నా కుమారుడివి;
ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను”#1:5 కీర్తన 2:7
అని గాని,
“నేను ఆయనకు తండ్రిగా ఉంటాను,
ఆయన నాకు కుమారునిగా ఉంటాడు,”#1:5 2 సమూ 7:14; 1 దినవృ 17:13
అని గాని అన్నారా? 6దేవుడు తన మొదటి సంతానాన్ని భూలోకానికి తెచ్చినప్పుడు, ఆయన,
“దేవదూతలందరు ఆయనను ఆరాధించాలి,”
అని చెప్పారు. 7దేవదూతల గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు,
“ఆయన తన దూతలను ఆత్మలుగా,
తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేస్తారు,”#1:7 కీర్తన 104:4
అని అన్నారు. 8కాని తన కుమారుని గురించి ఆయన,
“ఓ దేవా, నీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది;
న్యాయమనేది నీ రాజ్యానికి రాజదండం.
9నీవు నీతిని ప్రేమిస్తావు దుష్టత్వాన్ని ద్వేషిస్తావు;
కనుక దేవుడు, నీ దేవుడు, ఆనంద తైలంతో నిన్ను అభిషేకించి,
నీ తోటివారి కన్నా నిన్ను అధికంగా హెచ్చించారు,”#1:9 కీర్తన 45:6,7
అని అన్నారు. 10ఇంకా ఆయన,
“ప్రభువా, ఆదిలో నీవు భూమికి పునాదులు వేశావు,
ఆకాశాలు నీ చేతిపనులే.
11అవి ఒక వస్త్రంలా పాతగిల్లి నశించిపోతాయి;
గాని నీవు ఎల్లప్పుడూ నిలిచివుంటావు.
12వాటిని నీవు అంగీలా చుట్టిపెడతావు;
వస్త్రంలా అవన్నీ మార్చబడతాయి.
కానీ నీవు అలాగే ఉంటావు,
నీ సంవత్సరాలు ఎన్నడు తరగవు,”#1:12 కీర్తన 102:25-27
అని అన్నారు. 13దేవుడు దేవదూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా,
“నేను నీ శత్రువులను
నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు
నా కుడి వైపున కూర్చో అని చెప్పారా”#1:13 కీర్తన 110:1?
14దేవదూతలందరు రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి పరిచర్య చేయడానికి పంపబడిన ఆత్మలు కారా?
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హెబ్రీయులకు 1: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.