హెబ్రీయులకు 1:1-14

హెబ్రీయులకు 1:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేప్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా –నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక –నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితో నైన ఎప్పుడైనను చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. –తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే –దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. మరియు – ప్రభువా , నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. అయితే –నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయువరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనినిగూర్చియైన యెప్పుడైనను చెప్పెనా? వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?

హెబ్రీయులకు 1:1-14 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

గతంలో దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు ఎన్నోవిధాలుగా మాట్లాడారు. కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు. ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తరువాత, ఆయన పరలోకంలో ఉన్న మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు. కనుక ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన నామాన్ని వారసత్వంగా పొందినట్లే ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందారు. దేవదూతల్లో ఎవరితోనైనా ఎన్నడైన దేవుడు, “నీవు నా కుమారుడివి; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను” అని గాని, “నేను ఆయనకు తండ్రిగా ఉంటాను, ఆయన నాకు కుమారునిగా ఉంటాడు,” అని గాని అన్నారా? దేవుడు తన మొదటి సంతానాన్ని భూలోకానికి తెచ్చినప్పుడు, ఆయన, “దేవదూతలందరు ఆయనను ఆరాధించాలి,” అని చెప్పారు. దేవదూతల గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు, “ఆయన తన దూతలను ఆత్మలుగా, తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేస్తారు,” అని అన్నారు. కాని తన కుమారుని గురించి ఆయన, “ఓ దేవా, నీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; న్యాయమనేది నీ రాజ్యానికి రాజదండం. నీవు నీతిని ప్రేమిస్తావు దుష్టత్వాన్ని ద్వేషిస్తావు; కనుక దేవుడు, నీ దేవుడు, ఆనంద తైలంతో నిన్ను అభిషేకించి, నీ తోటివారి కన్నా నిన్ను అధికంగా హెచ్చించారు,” అని అన్నారు. ఇంకా ఆయన, “ప్రభువా, ఆదిలో నీవు భూమికి పునాదులు వేశావు, ఆకాశాలు నీ చేతిపనులే. అవి ఒక వస్త్రంలా పాతగిల్లి నశించిపోతాయి; గాని నీవు ఎల్లప్పుడూ నిలిచివుంటావు. వాటిని నీవు అంగీలా చుట్టిపెడతావు; వస్త్రంలా అవన్నీ మార్చబడతాయి. కానీ నీవు అలాగే ఉంటావు, నీ సంవత్సరాలు ఎన్నడు తరగవు,” అని అన్నారు. దేవుడు దేవదూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా, “నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు నా కుడి వైపున కూర్చో అని చెప్పారా”? దేవదూతలందరు రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి పరిచర్య చేయడానికి పంపబడిన ఆత్మలు కారా?

హెబ్రీయులకు 1:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

పురాతన కాలంలో అనేక సమయాల్లో అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మన పూర్వీకులతో మాట్లాడాడు. ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు. దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు. దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠమైన నామాన్ని ఆయన వారసత్వంగా పొందాడు కాబట్టి ఆయన వారి కంటే ఎంతో శ్రేష్ఠుడయ్యాడు. ఎందుకంటే దేవుడు, “నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను.” అని గానీ, “నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు” అని గానీ తన దూతల్లో ఎవరి గురించైనా అన్నాడా? అంతేగాక ఆయన సృష్టికి ముందు ఉన్న ప్రథముణ్ణి భూమి పైకి తీసుకు వచ్చినప్పుడు, “దేవదూతలందరూ ఆయనను పూజించాలి” అన్నాడు. తన దూతల గూర్చి చెప్పినప్పుడు ఆయన, “దేవదూతలను ఆత్మలుగానూ, తన సేవకులను అగ్ని జ్వాలలుగానూ చేసుకునేవాడు” అని చెప్పాడు. అయితే తన కుమారుణ్ణి గూర్చి ఇలా అన్నాడు. “దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయదండం. నువ్వు నీతిని ప్రేమించి అక్రమాన్ని అసహ్యించుకున్నావు. కాబట్టి దేవా, నీ దేవుడు నీ సహచరుల కంటే ఎక్కువగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడు. ప్రభూ, ప్రారంభంలో నువ్వు భూమికి పునాది వేశావు. నీ చేతులతోనే ఆకాశాలను చేశావు. అవి నాశనమై పోతాయి. కానీ నువ్వు కొనసాగుతావు. బట్టలు ఎలా మాసిపోతాయో అలాగే అవి కూడా మాసిపోతాయి. వాటిని అంగవస్త్రంలాగా చుట్టి వేస్తావు. బట్టలను మార్చినట్టు వాటిని మార్చి వేస్తావు. కానీ నువ్వు ఒకేలా ఉంటావు. నీ సంవత్సరాలు ముగిసిపోవు.” “నేను నీ శత్రువులను నీ పాదాల కింద పీటగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో” అని దేవుడు తన దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా? ఈ దూతలంతా రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపించిన సేవక ఆత్మలే కదా?

హెబ్రీయులకు 1:1-14 పవిత్ర బైబిల్ (TERV)

దేవుడు గతంలో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు, ఎన్నోవిధాలుగా మన పూర్వికులతో మాట్లాడాడు. అన్నిటిపై తన కుమారుణ్ణి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ చివరి రోజుల్లో ఆయన ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుడు దేవుని మహిమ యొక్క ప్రకాశం. తండ్రి యొక్క ఉనికిలో పరిపూర్ణ ఉనికిగలవాడు. కుమారుడు శక్తివంతమైన తన మాటతో అన్నిటినీ పోషించి సంరక్షిస్తున్నాడు. పాపపరిహారం చేసాక ఈయన పరలోకంలోకి వెళ్ళాడు. అక్కడ, మహా తేజస్వియైన దేవుని కుడివైపు కూర్చున్నాడు. ఆయన దేవదూతలకన్నా గొప్పవాడు. దానికి తగ్గట్టుగా ఆయన గొప్ప పేరు కూడా వారసత్వంగా పొందాడు. దేవదూతలకన్నా కుమారుడు గొప్పవాడు. ఎందుకంటే దేవుడు ఏ దేవదూతతో కూడా ఈ విధంగా అనలేదు: “నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినయ్యాను.” మరొక చోట: “నేనతనికి తండ్రి నౌతాను. అతడు నా కుమారుడౌతాడు.” మరొకచోట, దేవుడు తన మొదటి సంతానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ విధంగా అన్నాడు: “దేవదూతలు ఆయన్ని ఆరాధించాలి!” దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ: “దేవుడు తన దూతల్ని ఆత్నలుగాను తన సేవకుల్ని అగ్ని జ్వాలల్లా చేస్తాడు!” కాని కుమారుణ్ణి గురించి ఈ విధంగా అన్నాడు: “ఓ దేవా! నీ సింహాసనం చిరకాలం ఉంటుంది. నీతి నీ రాజ్యానికి రాజదండంగా ఉంటుంది. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు. అందువల్ల దేవుడు, నీ దేవుడు ఆనందమనే నూనెతో నిన్ను అభిషేకించి నీ స్నేహితులందరి కన్నా నిన్ను అధికంగా గౌరవించాడు.” ఆయనింకా ఈ విధంగా అన్నాడు: “ఓ ప్రభూ! ఆదిలో ఈ ప్రపంచానికి నీవు పునాదులు వేశావు. ఆకాశాలను నీ చేతుల్తో సృష్టించావు. అవి నశించి పోతాయి ఒక వస్త్రంలా పాత బడతాయి. కాని, నీవు చిరకాలం ఉంటావు. వాటిని నీవు ఒక వస్త్రంలా మడుస్తావు. వాటిని నీవు దుస్తులు మార్చినట్లు మారుస్తావు. కాని నీవు మాత్రం అలాగే ఉంటావు! నీ సంవత్సరములకు అంతంలేదు!” దేవుడు ఏ దేవదూతతోనైనా: “నీ శత్రువుల్ని నీ పాద పీఠంగా చేసేవరకు నా కుడివైపు కూర్చో,” అని ఎన్నడైనా అన్నాడా? ఈ దేవదూతలందరూ సేవ చేయటానికి వచ్చిన ఆత్మలే కదా! రక్షణ పొందే వ్యక్తుల సేవ చేయటానికే గదా దేవుడు వీళ్ళను పంపింది?

హెబ్రీయులకు 1:1-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

గతంలో దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మాట్లాడారు. కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు. ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తర్వాత, ఆయన పరలోకంలో మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు. కాబట్టి ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన నామాన్ని వారసత్వంగా పొందినట్లే ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందారు. దేవదూతల్లో ఎవరితోనైనా ఎన్నడైన దేవుడు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను” అని గాని, “నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు,” అని గాని అన్నారా? దేవుడు తన మొదటి సంతానాన్ని భూలోకానికి తెచ్చినప్పుడు, ఆయన, “దేవదూతలందరు ఆయనను ఆరాధించాలి,” అని చెప్పారు. దేవదూతల గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు, “ఆయన తన దూతలను ఆత్మలుగా, తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేస్తారు,” అని అన్నారు. కాని తన కుమారుని గురించి ఆయన, “ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; మీ న్యాయ దండం మీ రాజ్య రాజదండం. మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషించారు; కాబట్టి దేవుడు, మీ దేవుడు, ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి, మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు,” అని అన్నారు. ఇంకా ఆయన, “ప్రభువా, ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు, ఆకాశాలు మీ చేతి పని. అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు; ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి. వాటిని మీరు అంగీలా చుట్టి పెడతారు; వస్త్రంలా అవన్నీ మార్చబడతాయి. కానీ మీరు అలాగే ఉంటారు, మీ సంవత్సరాలకు అంతం ఉండదు,” అని అన్నారు. దేవుడు దేవదూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా, “నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు నా కుడి వైపున కూర్చో అని చెప్పారా”? దేవదూతలందరు రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి పరిచర్య చేయడానికి పంపబడిన ఆత్మలు కారా?