ఈజిప్టు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు చెరలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకే రాత్రి కలగన్నారు. ఇద్దరి కలలకు దేని భావం దానికే ఉంది. మరుసటిరోజు ప్రొద్దున్నే యోసేపు వారి దగ్గరకు వచ్చినప్పుడు, వారు దిగులుగా ఉన్నట్లు గమనించాడు. కాబట్టి అతడు తన యజమాని ఇంట్లో నిర్బంధంలో ఉన్న అధికారులను, “మీరు ఎందుకు ఈ రోజు విచారంగా ఉన్నారు?” అని అడిగాడు. “మా ఇద్దరికి కలలు వచ్చాయి కానీ వాటి భావం చెప్పడానికి ఎవరు లేరు” అని వారు జవాబిచ్చారు. అప్పుడు యోసేపు వారితో, “భావాలు చెప్పడం దేవుని వశం కాదా? మీ కలలు నాకు చెప్పండి” అని అన్నాడు. కాబట్టి గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుకు తన కలను చెప్పాడు. అతడు, “నా కలలో నా ఎదుట ఒక ద్రాక్షచెట్టు ఉంది, ఆ ద్రాక్షచెట్టుకు మూడు తీగెలున్నాయి. అది చిగురించి, పూలు పూసింది, దాని గెలలు ద్రాక్షపండ్లతో ఉన్నాయి. ఫరో గిన్నె నా చేతిలో ఉంది, నేను ద్రాక్షపండ్లు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి అతని చేతికి ఆ గిన్నెను ఇచ్చాను” అని చెప్పాడు. యోసేపు అతనితో, “దాని అర్థం ఇది. మూడు తీగెలు మూడు రోజులు. మూడు రోజుల్లో ఫరో నీ తల పైకెత్తి నీ స్థానం నీకు మరలా ఇస్తాడు, గతంలో నీవు గిన్నె అందించే వానిగా ఉన్నప్పుడు చేసినట్టు, ఫరో గిన్నెను అతనికి చేతికి అందిస్తావు. నీకు అంతా మంచి జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు దయ చూపించు; ఫరోతో నా గురించి మాట్లాడి నన్ను ఈ చెరసాల నుండి బయటకు రప్పించు. హెబ్రీ దేశం నుండి బలవంతంగా నన్ను దొంగిలించి తీసుకువచ్చారు, నేను చెరసాలలో ఉండడానికి చేసిన నేరం ఏమి లేదు” అని చెప్పాడు. యోసేపు అనుకూలంగా భావం చెప్పాడు అని గమనించిన రొట్టెలు కాల్చేవాడు యోసేపుతో, “నాకు కూడా కల వచ్చింది: నా తలమీద రొట్టెలు ఉన్న మూడు గంపలు ఉన్నాయి. పై గంపలో ఫరో కోసం అన్ని రకాల మంచి వంటకాలున్నాయి, కానీ పక్షులు వచ్చి, నా తలమీద ఉన్న గంపలో నుండి తింటున్నాయి” అని చెప్పాడు. యోసేపు అన్నాడు, “దాని అర్థం ఇది. మూడు గంపలు మూడు రోజులు. మూడు రోజుల్లో ఫరో నీ తలను తీసివేసి, నీ శరీరాన్ని స్తంభానికి వ్రేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తినివేస్తాయి.”
Read ఆది 40
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆది 40:5-19
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు