ఆదికాండము 40:5-19
ఆదికాండము 40:5-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఈజిప్టు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు చెరలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకే రాత్రి కలగన్నారు. ఇద్దరి కలలకు దేని భావం దానికే ఉంది. మరుసటిరోజు ప్రొద్దున్నే యోసేపు వారి దగ్గరకు వచ్చినప్పుడు, వారు దిగులుగా ఉన్నట్లు గమనించాడు. కాబట్టి అతడు తన యజమాని ఇంట్లో నిర్బంధంలో ఉన్న అధికారులను, “మీరు ఎందుకు ఈ రోజు విచారంగా ఉన్నారు?” అని అడిగాడు. “మా ఇద్దరికి కలలు వచ్చాయి కానీ వాటి భావం చెప్పడానికి ఎవరు లేరు” అని వారు జవాబిచ్చారు. అప్పుడు యోసేపు వారితో, “భావాలు చెప్పడం దేవుని వశం కాదా? మీ కలలు నాకు చెప్పండి” అని అన్నాడు. కాబట్టి గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుకు తన కలను చెప్పాడు. అతడు, “నా కలలో నా ఎదుట ఒక ద్రాక్షచెట్టు ఉంది, ఆ ద్రాక్షచెట్టుకు మూడు తీగెలున్నాయి. అది చిగురించి, పూలు పూసింది, దాని గెలలు ద్రాక్షపండ్లతో ఉన్నాయి. ఫరో గిన్నె నా చేతిలో ఉంది, నేను ద్రాక్షపండ్లు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి అతని చేతికి ఆ గిన్నెను ఇచ్చాను” అని చెప్పాడు. యోసేపు అతనితో, “దాని అర్థం ఇది. మూడు తీగెలు మూడు రోజులు. మూడు రోజుల్లో ఫరో నీ తల పైకెత్తి నీ స్థానం నీకు మరలా ఇస్తాడు, గతంలో నీవు గిన్నె అందించే వానిగా ఉన్నప్పుడు చేసినట్టు, ఫరో గిన్నెను అతనికి చేతికి అందిస్తావు. నీకు అంతా మంచి జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు దయ చూపించు; ఫరోతో నా గురించి మాట్లాడి నన్ను ఈ చెరసాల నుండి బయటకు రప్పించు. హెబ్రీ దేశం నుండి బలవంతంగా నన్ను దొంగిలించి తీసుకువచ్చారు, నేను చెరసాలలో ఉండడానికి చేసిన నేరం ఏమి లేదు” అని చెప్పాడు. యోసేపు అనుకూలంగా భావం చెప్పాడు అని గమనించిన రొట్టెలు కాల్చేవాడు యోసేపుతో, “నాకు కూడా కల వచ్చింది: నా తలమీద రొట్టెలు ఉన్న మూడు గంపలు ఉన్నాయి. పై గంపలో ఫరో కోసం అన్ని రకాల మంచి వంటకాలున్నాయి, కానీ పక్షులు వచ్చి, నా తలమీద ఉన్న గంపలో నుండి తింటున్నాయి” అని చెప్పాడు. యోసేపు అన్నాడు, “దాని అర్థం ఇది. మూడు గంపలు మూడు రోజులు. మూడు రోజుల్లో ఫరో నీ తలను తీసివేసి, నీ శరీరాన్ని స్తంభానికి వ్రేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తినివేస్తాయి.”
ఆదికాండము 40:5-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారిద్దరూ, అంటే ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు ఒకే రాత్రి కలలు కన్నారు. ఒక్కొక్కడు వేరు వేరు భావాలతో కల కన్నారు. ఉదయాన యోసేపు వారి దగ్గరికి వచ్చి చూసినపుడు వారు విచారంగా ఉన్నారు. అతడు “మీరెందుకు విచారంగా ఉన్నారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు “మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది. వాటి అర్థం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు” అన్నారు. యోసేపు వారితో “అర్థాలు తెలియచేయడం దేవుని అధీనమే గదా! దయచేసి నాకు చెప్పండి” అన్నాడు. అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుతో “నా కలలో ఒక ద్రాక్షతీగ నా ఎదుట ఉంది. ఆ ద్రాక్షతీగకు మూడు కొమ్మలున్నాయి. దానికి మొగ్గలొచ్చి పూలు పూసి గెలలు పండి ద్రాక్షపళ్ళు వచ్చాయి. ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేను ద్రాక్షపళ్ళు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చాను” అని చెప్పాడు. అప్పుడు యోసేపు “దాని అర్థం ఇదే. ఆ మూడు కొమ్మలు, మూడు రోజులు. ఇంక మూడు రోజుల్లో ఫరో నిన్ను హెచ్చించి, నువ్వు అతనికి గిన్నె అందించే నీ ఉద్యోగం నీకు మళ్ళీ ఇప్పిస్తాడు. అయితే నీకంతా సరి అయినప్పుడు నన్ను గుర్తు చేసుకుని నామీద దయ చూపించు. ఫరో దగ్గర నా గురించి మాట్లాడి ఈ చెరసాల నుండి నేను బయటికి వచ్చేలా చూడు. ఎందుకంటే నన్ను హెబ్రీయుల దేశం నుండి దొంగిలించి తీసుకొచ్చారు. ఈ చెరసాలలో నన్ను వేయడానికి ఇక్కడ కూడా నేనేమీ నేరం చేయలేదు” అన్నాడు. రొట్టెలు చేసే వాడు యోసేపు మంచి అర్థం చెప్పడం చూసి అతనితో “నాకూ ఒక కల వచ్చింది. మూడు రొట్టెల బుట్టలు నా తల మీద ఉన్నాయి. పై బుట్టలో ఫరో కోసం అన్ని రకాల పిండివంటలు ఉన్నాయి. పక్షులు వచ్చి నా తల మీద ఉన్న ఆ బుట్టలో నుండి వాటిని తిన్నాయి” అన్నాడు. యోసేపు “దాని అర్థం ఇదే. ఆ మూడు బుట్టలు మూడు రోజులు. ఇంక మూడు రోజుల్లో ఫరో నీ తల తీసి చెట్టుకు వేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తింటాయి” అని జవాబిచ్చాడు.
ఆదికాండము 40:5-19 పవిత్ర బైబిల్ (TERV)
ఒక రాత్రి ఆ ఇద్దరు ఖైదీలకు కలలు వచ్చాయి. (ఈ ఇద్దరు ఖైదీలు ఈజిప్టు రాజు సేవకులు– ఒకడు రొట్టెలు కాల్చేవాడు, మరొకడు ద్రాక్షా పాత్రల పెద్ద). ఒక్కో ఖైదీకి ఒక్కో కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో భావం ఉంది. మర్నాడు ఉదయం యోసేపు వాళ్ల దగ్గరకు వెళ్లాడు. ఆ ఇద్దరు మనుష్యులు ఏదో చింతిస్తున్నట్లు యోసేపు గమనించాడు. “ఏమిటి, ఈ వేళ మీరు చాలా చింతిస్తున్నట్లు కనబడుతున్నారు?” అని వారిని అడిగాడు యోసేపు. “రాత్రి మాకు కలలు వచ్చాయి. కాని మేము కన్న కలలు మాకు అర్థం కాలేదు. ఆ కలలు ఏమిటో, వాటి భావం ఏమిటో మాకు వివరించే వాళ్లెవరూ లేరు” అని వాళ్లిద్దరు జవాబిచ్చారు. యోసేపు, “కలలను తెలిసికొని, వాటి భావం చెప్పగలవాడు దేవుడు మాత్రమే కనుక దయచేసి మీ కలలు నాకు చెప్పండి” అని వారితో అన్నాడు. కనుక ద్రాక్షా పాత్రల సేవకుడు యోసేపుతో తన కల చెప్పాడు. ఆ సేవకుడు ఇలా చెప్పాడు: “నా కలలో ఒక ద్రాక్షావల్లి కనబడింది. ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలున్నాయి. నేను చూస్తుండగా ఆ తీగెలకు పూలు పూసి, ద్రాక్షాగెలలు అయ్యాయి. నేను ఫరో పాత్ర పట్టుకొని ఉన్నాను. కనుక నేను ఆ ద్రాక్షాలను తీసుకొని ఆ పాత్రలో వాటి రసం పిండాను. అప్పుడు ఆ పాత్ర నేను ఫరోకు ఇచ్చాను.” అప్పుడు యోసేపు అన్నాడు: “ఆ కలను నీకు నేను వివరిస్తాను. మూడు కొమ్మలంటే మూడు రోజులు. మూడు రోజులు గతించక ముందే ఫరో నిన్ను క్షమించి, నిన్ను మళ్లీ నీ పని చేసుకోనిస్తాడు. ఇది వరకు నీవు ఫరో దగ్గర చేసిన పని నీవు మళ్లీ చేస్తావు. నీకు విడుదల అయింతర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో. నా మీద దయ ఉంచి, నాకు సహాయం చేయి. నాకు కూడ ఈ చెరసాలలోనుంచి విముక్తి కలిగేటట్టు నా గురించి ఫరోతో చెప్పు. నన్ను అన్యాయంగా బలవంతంగా నా యింటినుండి నా ప్రజలైన హీబ్రూలనుండి తీసుకొనివచ్చారు. నేనేమి తప్పు చేయలేదు. అందుచేత నేను ఈ చెరసాలలో ఉండకూడదు.” మరో సేవకుని కల బాగున్నట్లు రొట్టెలు కాల్చేవాడికి తోచింది. వాడు యోసేపుతో అన్నాడు, “నాకూ ఒక కల వచ్చింది. నా తలమీద రొట్టెల బుట్టలు మూడు ఉన్నట్లు నాకు కనబడింది. పై బుట్టలో అన్ని రకాల కాల్చిన ఆహారాలు ఉన్నాయి. ఈ భోజనం రాజుగారి కోసం. కాని పక్షులు ఈ భోజనాన్ని తినేస్తున్నాయి.” యోసేపు ఇలా జవాబిచ్చాడు: “ఈ కల అర్థం ఏమిటో నీకు నేను చెబుతాను. మూడు బుట్టలు అంటే మూడు రోజులు. మూడు రోజులు గడవక ముందే రాజుగారు నిన్ను ఈ చెరసాలలోనుంచి విడుదల చేస్తారు. తర్వాత రాజుగారు నీ తల నరికేస్తాడు, నీ శరీరాన్ని ఒక స్తంభానికి వేలాడదీస్తాడు, పక్షులు నీ శరీరాన్ని తినివేస్తాయి.”
ఆదికాండము 40:5-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి; ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతా క్రాంతులై యుండిరి. అతడు–ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి యున్నవని తన యజమానుని యింట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్థుల నడిగెను. అందుకు వారు–మేము కలలు కంటిమి; వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి–భావములు చెప్పుట దేవుని అధీనమే గదా; మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి–నా కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను; ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలుండెను, అది చిగిరించినట్టు ఉండెను; దాని పువ్వులు వికసించెను; దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను; ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపు–దాని భావ మిదే; ఆ మూడు తీగెలు మూడుదినములు; ఇంక మూడుదినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పాన దాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతనిచేతికప్పగించెదవు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను–నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలు గల మూడు గంపలు నా తలమీద ఉండెను. మీదిగంపలో ఫరో నిమిత్తము సమస్తవిధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలోనుండి వాటిని తీసికొని తినుచుండెను. అందుకు యోసేపు–దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడుదినములు ఇంక మూడుదినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీదనుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను.
ఆదికాండము 40:5-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)