యెహెజ్కేలు 8
8
మందిరంలో విగ్రహారాధన
1ఆరవ సంవత్సరం ఆరవ నెల అయిదవ రోజున నా ఇంట్లో నేను, యూదా పెద్దలు కూర్చుని ఉన్నప్పుడు, ప్రభువైన యెహోవా చేయి నా మీదికి వచ్చింది. 2నేను చూస్తుండగా ఒక మానవ ఆకారం#8:2 లేదా అగ్ని లాంటి ఆకారం కనిపించింది. అతని నడుము నుండి క్రిందికి నిప్పులా ఉన్నాడు, అక్కడినుండి అతని రూపం మెరుస్తున్న లోహంలా ప్రకాశవంతంగా ఉంది. 3ఆయన చేయిలాంటి దానిని చాపి నా జుట్టు పట్టుకున్నారు. ఆత్మ నన్ను భూమికి ఆకాశానికి మధ్యకు ఎత్తి దేవుని దర్శనాలలో ఆయన నన్ను యెరూషలేముకు లోపలి ఆవరణ ఉత్తర ద్వారం దగ్గర ఉన్న రోషం పుట్టించే విగ్రహం దగ్గరకు తీసుకువచ్చాడు. 4అప్పుడు సమతల మైదానంలో నేను చూసిన దర్శనంలో కనిపించినట్లే ఇశ్రాయేలీయుల దేవుని మహిమ మళ్ళీ కనిపించింది.
5ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఉత్తరదిక్కు చూడు” అని చెప్పినప్పుడు, నేను ఉత్తరదిక్కు చూడగా అక్కడ బలిపీఠపు ఉత్తర ద్వారం దగ్గర రోషం పుట్టించే విగ్రహం కనిపించింది.
6ఆయన నాతో, “మనుష్యకుమారుడా, వారు చేస్తున్నది నీవు చూశావు కదా! నా పరిశుద్ధాలయం నుండి నన్ను దూరం చేసేలా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేస్తున్న చాలా అసహ్యకరమైన పనులు చూశావా? కాని వీటి కంటే మరింత అసహ్యకరమైన వాటిని నీవు చూస్తావు” అన్నారు.
7అప్పుడు ఆయన నన్ను ఆవరణ ద్వారం దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడ నేను చూడగా, నాకు గోడకు ఒక రంధ్రం కనిపించింది. 8ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఆ గోడ లోపలికి త్రవ్వు” అని చెప్పారు. నేను ఆ గోడ లోపలికి త్రవ్వగా ద్వారం ఒకటి కనిపించింది.
9ఆయన నాతో, “లోపలికి వెళ్లి వారు ఇక్కడ చేస్తున్న దుర్మార్గమైన అసహ్యకరమైన పనులు చూడు” అని చెప్పారు. 10నేను లోపలికి వెళ్లి చూస్తే, అన్ని రకాల ప్రాకే జీవులు, అపవిత్రమైన జంతువులు, ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహాలు గోడ మీద అంతటా గీయబడి కనిపించాయి. 11డెబ్బది మంది ఇశ్రాయేలీయుల పెద్దలు వాటి ముందు నిలబడి ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కుమారుడైన యాజన్యా ఉన్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో ధూపార్తి ఉంది. ఆ ధూపం యొక్క సువాసన మేఘంలా పైకి వెళ్తుంది.
12ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ తమ విగ్రహాల గుడి దగ్గర ప్రతి ఒక్కరూ తమ తమ విగ్రహాల గుడి దగ్గర ఏమి చేస్తున్నారో నీవు చూశావు గదా? యెహోవా మమ్మల్ని చూడడు; యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడని వారు అనుకుంటున్నారు” అన్నారు. 13ఆయన ఇంకా నాతో, “నీవు ఈ వైపుకు తిరిగి చూస్తున్నావా? వీటికి మించిన అసహ్యమైన పనులు వీరు చేయడం నీవు చూస్తావు” అన్నారు.
14ఇలా చెప్పి ఆయన నన్ను యెహోవా ఆలయానికి ఉత్తర ద్వారం దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, అక్కడ కొందరు స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవతను గురించి ఏడుస్తూ నాకు కనిపించారు. 15అప్పుడు ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నీవు ఇది చూస్తున్నావా? అని యెహోవా అన్నాడు. వీటికి మించిన అసహ్యమైన పనులు వీరు చేయడం నీవు చూస్తావు” అన్నారు.
16ఆయన నన్ను యెహోవా ఆలయ లోపలి ఆవరణంలోనికి తీసుకువచ్చినప్పుడు, ఆలయ ప్రవేశం దగ్గర ఉన్న మంటపానికి బలిపీఠానికి మధ్యలో ఇంచుమించు ఇరవై అయిదుగురు మనుష్యులు నాకు కనిపించారు. వారి వీపులు యెహోవా మందిరం వైపు వారి ముఖాలు తూర్పు వైపు తిరిగి ఉన్నాయి. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారం చేస్తున్నారు.
17అప్పుడు ఆయన నాతో, “మనుష్యకుమారుడా, చూశావా? యూదా ప్రజలు ఇక్కడ చేస్తున్న ఈ అసహ్యమైన పనులు చేయడం చిన్న విషయమా? అంతే కాకుండా వారు దేశాన్ని హింసతో నింపివేస్తూ నా కోపాన్ని అంతకంతకు పెంచుతున్నారు. వారి ముక్కుకు తీగె పెట్టుకుంటున్నారు చూడు! 18కాబట్టి నేను వారితో కోపంగా వ్యవహరిస్తాను; వారి మీద జాలి చూపించను వారిని వదిలిపెట్టను. వారు నా చెవుల్లో అరిచినా నేను వారి మొర వినను” అన్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 8: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.