యెహెజ్కేలు 35
35
ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం
1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“మనుష్యకుమారుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖం త్రిప్పి దానికి వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు: 3‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఓ శేయీరు పర్వతమా, నేను నీకు వ్యతిరేకిని, నేను నీకు వ్యతిరేకంగా నా చేయి చాపి నిన్ను నిర్జనమై వ్యర్థంగా మిగిలిపోయేలా చేస్తాను. 4నీ పట్టణాలను శిథిలాలుగా మారుస్తాను; నీవు నిర్జనమవుతావు. అప్పుడు నేనే యెహోవానని తెలుసుకుంటావు.
5“ ‘నీవు ఇశ్రాయేలీయుల పట్ల ఎప్పుడూ పగతో ఉండి, వారి విపత్తు సమయంలో, వారి శిక్ష ముగింపుకు చేరుకున్న సమయంలో నీవు వారిని ఖడ్గానికి అప్పగించావు, 6కాబట్టి నా జీవం తోడు, నేను నిన్ను రక్తపాతానికి అప్పగిస్తాను, అది నీ వెంటపడుతుంది. నీవు రక్తపాతాన్ని ద్వేషించలేదు కాబట్టి, రక్తపాతం నిన్ను వెంటాడుతుందని యెహోవా ప్రకటిస్తున్నారు. 7నేను శేయీరు పర్వతాన్ని నిర్జనంగా వ్యర్థంగా చేస్తాను, వస్తూ వెళ్తూ ఉండేవారు అక్కడ లేకుండా చేస్తాను. 8నీ పర్వతాలను శవాలతో నింపుతాను; ఖడ్గం చేత చచ్చినవారు నీ కొండలమీద, నీ లోయల్లో, నీ వాగుల్లో పడి ఉంటారు. 9నేను నిన్ను శాశ్వతంగా పాడైపోయేలా చేస్తాను; నీ పట్టణాల్లో ఎవరూ నివసించరు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.
10“ ‘యెహోవానైన నేను అక్కడ ఉన్నప్పటికీ, “ఈ రెండు జాతులు, దేశాలు మనవే; మనం వాటిని స్వాధీనం చేసుకుందాం” అని మీరు చెప్పారు. 11కాబట్టి నా జీవం తోడు నీవు వారిమీద ద్వేషంతో నీవు వారికి చూపించిన కోపం అసూయను బట్టి నేను నీ పట్ల తగిన రీతిగా వ్యవహరిస్తాను. నేను నిన్ను శిక్షించినప్పుడు నన్ను నేను వారికి పరిచయం చేసుకుంటాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. 12“అవి పాడుచేయబడ్డాయి, మనకు ఆహారంగా ఇవ్వబడ్డాయి” అని నీవు ఇశ్రాయేలు పర్వతాలను దూషించిన మాటలన్నీ యెహోవానైన నేను విన్నానని నీవు తెలుసుకుంటావు. 13మీరు ప్రగల్భాలు పలుకుతూ, ఏమాత్రం అదుపు లేకుండా నాకు వ్యతిరేకంగా మాట్లాడారు, అదంతా నేను విన్నాను. 14ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఒకవైపు లోకమంతా సంతోషిస్తూ ఉంటే, నేను నిన్ను నాశనం చేస్తాను. 15ఇశ్రాయేలీయుల వారసత్వం పాడైపోయినప్పుడు నీవు సంతోషించావు, కాబట్టి నేను నీతో అలాగే వ్యవహరిస్తాను. శేయీరు పర్వతమా, నీవూ నీతో పాటు ఎదోము అంతా పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 35: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.