యెహెజ్కేలు 34

34
యెహోవా ఇశ్రాయేలీయుల కాపరి
1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు కాపరులకు వ్యతిరేకంగా ప్రవచించు; ప్రవచించి వారితో ఇలా చెప్పు: ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మిమ్మల్ని మీరు మాత్రమే చూసుకునే ఇశ్రాయేలు కాపరులారా మీకు శ్రమ! కాపరులు తమ గొర్రెల మందను జాగ్రత్తగా చూసుకోవాలి కదా? 3మీరు క్రొవ్విన వాటిని తింటారు, ఉన్నితో బట్టలు వేసుకుంటారు, ఎంపిక చేసిన జంతువులను వధిస్తారు, కానీ మందను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోరు. 4మీరు బలహీనమైన వాటిని బలపరచలేదు, రోగంతో ఉన్నవాటిని స్వస్థపరచలేదు, గాయపడిన వాటికి కట్టు కట్టలేదు. మీరు దారితప్పిన వాటిని తిరిగి తీసుకురాలేదు, తప్పిపోయిన వాటికోసం వెదకలేదు. మీరు వాటిని కఠినంగా, క్రూరంగా పాలించారు. 5కాపరి లేనందున అవి చెదిరిపోయాయి, అవి చెదిరిపోయి అడవి జంతువులన్నిటికి ఆహారమయ్యాయి. 6నా గొర్రెలు పర్వతాలన్నిటి మీదా, ఎత్తైన ప్రతి కొండ మీదా సంచరించాయి. వారు భూమి అంతటా చెల్లాచెదురుగా ఉన్నారు, ఎవరూ వాటిని వెదకలేదు, వాటికోసం చూడలేదు.
7“ ‘కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి: 8నా జీవం తోడు కాపరులు లేని నా గొర్రెలు దోచుకోబడ్డాయి, అడవి మృగాలన్నిటికి ఆహారమయ్యాయి, నా కాపరులు నా గొర్రెలను వెదకలేదు, నా గొర్రెలను జాగ్రత్తగా చూసుకోకుండా వారు తమ గురించి మాత్రమే చూసుకున్నారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. 9కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి: 10ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఆ కాపరులకు వ్యతిరేకిని, నా మంద గురించి నేను వారిని లెక్క అడుగుతాను. గొర్రెల కాపరులు ఇకపై మందను మేపకుండ నేను వారిని తొలగిస్తాను, తద్వార వారు తమను తాము పోషించుకోలేరు. వారి నోటి నుండి నేను నా మందను విడిపిస్తాను, ఇకపై అది వారికి ఆహారంగా ఉండదు.
11“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేనే స్వయంగా నా గొర్రెలను వెదికి వాటిని చూసుకుంటాను. 12గొర్రెల కాపరి చెదిరిపోయిన తన మందను వెదకినట్లు నేను నా గొర్రెలను వెదకుతాను. మేఘాలు కమ్మి చీకటిగా ఉన్న రోజున, అవి ఎక్కడెక్కడ చెదిరిపోయాయో అక్కడ నుండి నేను వాటిని రక్షిస్తాను. 13నేను వాటిని ఇతర జాతుల నుండి బయటకు రప్పించి, దేశాల నుండి వాటిని సమకూర్చి, నేను వాటిని వారి స్వదేశానికి తీసుకువస్తాను. నేను వాటిని ఇశ్రాయేలు పర్వతాలమీద, కనుమలలో, దేశంలోని అన్ని నివాస స్థలాల్లో మేపుతాను. 14మంచి పచ్చిక ఉన్నచోట వాటిని మేపుతాను, ఇశ్రాయేలీయుల ఎత్తైన పర్వతాలు వాటికి పచ్చికబయళ్లుగా ఉంటాయి. అందులో అవి హాయిగా పడుకుంటాయి. ఇశ్రాయేలు పర్వతాలమీద శ్రేష్ఠమైన మేత ఉన్న స్థలాల్లో అవి మేస్తాయి. 15నేనే స్వయంగా నా గొర్రెలను మేపి వాటిని పడుకోబెడతాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. 16నేను తప్పిపోయిన వాటిని వెదికి, తోలివేసిన వాటిని తిరిగి తోలుకు వస్తాను. నేను గాయపడిన వాటికి కట్టుకడతాను. బలహీనమైన వాటిని బలపరుస్తాను. క్రొవ్విన వాటిని బలిసిన వాటిని నాశనం చేస్తాను. మందను న్యాయంగా మేపుతాను.
17“ ‘నా మందా, నీ గురించి ప్రభువైన యెహోవా చెప్తున్నారు: నేను గొర్రెకు మధ్య, పొట్టేళ్లకు మేకపోతులకూ మధ్య తీర్పు తీరుస్తాను. 18మంచి పచ్చికబయళ్లను తింటే సరిపోదా? మిగిలిన పచ్చికబయళ్లను కాళ్లతో త్రొక్కాలా? మీరూ స్వచ్ఛమైన నీరు త్రాగితే సరిపోదా? మీ పాదాలతో మిగిలిన నీటిని బురదమయం చేయాలా? 19మీ కాళ్లతో త్రొక్కింది నా మంద మేయాలా? కాళ్లతో బురద చేసిన నీళ్లను నా గొర్రెలు త్రాగాలా?
20“ ‘ప్రభువైన యెహోవా వారికి చెబుతున్న మాట ఇదే: క్రొవ్విన గొర్రెలకు బక్కచిక్కిన గొర్రెలకు మధ్య నేనే తీర్పు తీరుస్తాను. 21మీరు కొమ్ములతో పొడుస్తూ, భుజంతో ప్రక్కలతో తోస్తూ బలహీనమైన గొర్రెలన్నిటిని తరిమికొడుతున్నారు కాబట్టి, 22నేను నా గొర్రెలను కాపాడతాను, ఇకపై అవి దోచుకోబడవు. గొర్రెకు మధ్య నేను తీర్పు తీరుస్తాను. 23వాటిని మేపడానికి నేను నా సేవకుడైన దావీదును కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని కాస్తాడు; అతడు వాటిని మేపుతాడు, వాటికి కాపరిగా ఉంటాడు. 24యెహోవానైన నేను వారికి దేవునిగా ఉంటాను, నా సేవకుడైన దావీదు వాటికి అధిపతిగా ఉంటాడు. యెహోవానైన నేను మాట చెప్పాను.
25“ ‘అవి అరణ్యంలో క్షేమంగా నివసించి అడవుల్లో పడుకునేలా నేను వాటితో సమాధాన ఒడంబడిక చేసుకుంటాను, అలాగే అడవి మృగాలను దేశంలో లేకుండా చేస్తాను. 26నేను వాటిని నా పర్వతం చుట్టుప్రక్కల ఉన్న స్థలాలను ఆశీర్వాదకరంగా చేస్తాను.#34:26 లేదా వాటిని నా పర్వతం చుట్టూ ఉన్న ప్రదేశాలను ఆశీర్వాదాల పేరుతో పిలువబడతాయి (ఆది 48:20) లేదా నేను వాటిని నా కొండ చుట్టూ ఉన్న ప్రదేశాలను దీవించబడినవిగా చూస్తాను రుతువుల ప్రకారం జల్లులు కురిపిస్తాను; ఆశీర్వాదకరమైన జల్లులు కురుస్తాయి. 27చెట్లు తమ పండ్లను ఇస్తాయి, భూమి తన పంటను ఇస్తుంది; ప్రజలు తమ దేశంలో క్షేమంగా ఉంటారు. నేను వారి కాడిని విరగ్గొట్టి, వారిని బానిసలుగా చేసుకున్న వారి చేతుల్లో నుండి వారిని విడిపించినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. 28వారు ఇకపై దేశాలచేత దోచుకోబడరు, అడవి మృగాలకు వారు ఆహారం కారు. వారు క్షేమంగా జీవిస్తారు, వారిని ఎవరూ భయపెట్టరు. 29పంటలకు ప్రసిద్ధి చెందిన దేశాన్ని నేను వారికి ఇస్తాను, వారు ఇకపై దేశంలో కరువు బారిన పడరు, ఇతర దేశాల మధ్య అవమానాన్ని భరించే అవసరం ఉండదు. 30అప్పుడు నేను వారి దేవుడనైన యెహోవాను వారికి తోడుగా ఉన్నానని, ఇశ్రాయేలీయులైన వారు నా ప్రజలని వారు తెలుసుకుంటారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. 31మీరు నా గొర్రెలు, నా పచ్చిక బయళ్లలోని గొర్రెలు, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 34: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెహెజ్కేలు 34 కోసం వీడియో