యెహెజ్కేలు 23

23
వ్యభిచారులైన అక్కాచెల్లెలు
1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“మనుష్యకుమారుడా, ఒకే తల్లి కుమార్తెలైన ఇద్దరు స్త్రీలు ఉన్నారు. 3వారు తమ యవ్వనం నుండి వ్యభిచారం చేస్తూ ఈజిప్టులో వేశ్యలుగా మారారు. ఆ దేశంలో వారి రొమ్ములు పిండబడ్డాయి, వారి కన్య చనుమొనలు నలిపివేయబడ్డాయి. 4వారిలో పెద్దదాని పేరు ఒహోలా, దాని చెల్లి పేరు ఒహోలీబా. నేను వారిని పెళ్ళి చేసుకోగా వారు నాకు కుమారులను, కుమార్తెలను కన్నారు. ఒహోలా అంటే సమరయ, ఒహోలీబా అంటే యెరూషలేము.
5“ఒహోలా నాదానిగా ఉన్నప్పుడే వ్యభిచారం చేసింది; అది తన ప్రేమికులైన అష్షూరు వారిని మోహించింది. 6వారు నీలిరంగు వస్త్రాలను ధరించిన యోధులు, అధికారులు సైన్యాధిపతులు, వారందరూ అందమైన యువకులు, గుర్రాలు స్వారీ చేసేవారు. 7అది ఒక వేశ్యలా అష్షూరీయులలో ముఖ్యులైన వారి ఎదుట తిరుగుతూ వారందరితో వ్యభిచరిస్తూ వారు నిలబెట్టిన విగ్రహాలన్నిటిని పూజించి అపవిత్రురాలైంది. 8అది ఈజిప్టులో ప్రారంభించిన వ్యభిచారాన్ని ఇంకా వదల్లేదు, దాని యవ్వనంలోనే పురుషులు దానితో పడుకున్నప్పుడు, దాని కన్య చనుమొనలను నలిపి, దానితో తమ కామాన్ని తీర్చుకున్నారు.
9“కాబట్టి అది మోహించిన దాని ప్రేమికులైన అష్షూరువారి చేతికే దానిని అప్పగించాను. 10వారు దానిని నగ్నంగా నిలబెట్టారు, దాని కుమారులను కుమార్తెలను బంధించి దాన్ని ఖడ్గంతో చంపారు. స్త్రీలందరిలో అది ఒక సామెతగా అయ్యింది, దానికి శిక్ష విధించబడింది.
11“దాని చెల్లి ఒహోలీబా ఇదంతా చూసింది, అయినాసరే కామంలో వ్యభిచారంలో దాని అక్కను మించి దిగజారిపోయింది. 12అది కూడా అష్షూరు వారిలో సైన్యాధిపతులు, అధికారులను, నీలిరంగు వస్త్రాలను ధరించిన యోధులు, గుర్రాలు స్వారీ చేసేవారిని, అందమైన యువకులను మోహించింది. 13అది కూడా తనను తాను అపవిత్రపరచుకోవడం నేను చూశాను; వారిద్దరు ఒకే దారిలో వెళ్లారు.
14“అయితే అది వ్యభిచారాన్ని మరింత ఎక్కువగా చేసింది. అది గోడపై ఎరుపు రంగులో చిత్రీకరించబడిన కల్దీయుల#23:14 లేదా బబులోనీయుల పురుషుల చిత్రాలను చూసింది. 15వారు నడుములకు దట్టీలు, తలలపై తలపాగాలు ధరించిన బబులోను రథ అధికారుల్లా, కల్దీయ సంతానంలా కనిపించారు. 16అది వారిని చూడగానే వారిని మోహించి, కల్దీయలో ఉన్న వారి దగ్గరకు దూతలను పంపింది. 17అప్పుడు బబులోనువారు దాని పడక సుఖాన్ని కోరి వచ్చి వ్యభిచరించి దానిని అపవిత్రం చేశారు. అది వారిచే అపవిత్రపరచబడిన తర్వాత, దాని మనస్సుకు వారంటే అసహ్యం వేసింది. 18అదలా తన వ్యభిచారాన్ని బహిరంగంగా నిర్వహిస్తూ, తన నగ్న శరీరాన్ని బహిర్గతం చేసినప్పుడు, నేను దాని సోదరిని వదిలేసినట్టే, దీని మీద అసహ్యం కలిగి దీన్ని కూడా వదిలేశాను. 19అయినప్పటికీ అది ఈజిప్టులో వేశ్యగా ఉన్న తన యవ్వన రోజులను గుర్తుచేసుకుని మరింత వ్యభిచారం చేసింది. 20గాడిదల్లాంటి పురుషాంగం గుర్రాల్లాంటి వీర్య స్ఖలనం ఉన్న తన ప్రేమికులను అది మోహించింది. 21కాబట్టి ఈజిప్టులో నీ రొమ్ములను చనుమొనలను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని నీ యవ్వనపు అశ్లీల ప్రవర్తన కొనసాగించాలని ఎంతో ఆశించావు.
22“కాబట్టి ఒహోలీబా, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీ ప్రేమికులనే నీకు వ్యతిరేకంగా రేపుతాను, నీవు అసహ్యం కలిగి వదిలేసిన వారినే అన్ని వైపుల నుండి నీ మీదికి రప్పిస్తాను. 23బబులోనీయులు, కల్దీయులందరూ, పేకోదు, షోవ, కోవ యొక్క పురుషులు, వారితో ఉన్న అష్షూరీయులందరు, అందమైన యువకులు, అధికారులు, అధిపతులు, రథ అధికారులు ఉన్నత స్థాయి పురుషులు, గుర్రపు స్వారీ చేసే వీరందరిని రప్పిస్తాను. 24వారు ఆయుధాలతో రథాలతో బండ్లతో జనసమూహంతో నీ మీదికి వస్తారు. పెద్ద డాళ్లు, చిన్న డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి అన్ని వైపుల నుండి నిన్ను చుట్టుముడతారు. శిక్షించడానికి నేను నిన్ను వారికి అప్పగిస్తాను, వారు తమ పద్ధతిలో నిన్ను శిక్షిస్తారు. 25నేను రోషంతో నా కోపాన్ని చూపించగా కోపాగ్రతతో వారు నిన్ను శిక్షిస్తారు. వారు నీ ముక్కు నీ చెవులు నరికివేస్తారు, నీలో మిగిలి ఉన్నవారు కత్తివేటుకు కూలిపోతారు. నీ కుమారులను కుమార్తెలను వారు తీసుకెళ్తారు, నీలో మిగిలిన వారు అగ్నిచేత కాల్చబడతారు. 26వారు నీ బట్టలు లాగివేసి నీ విలువైన ఆభరణాలు తీసుకెళ్తారు. 27కాబట్టి ఈజిప్టులో నీవు మొదలుపెట్టిన అశ్లీల ప్రవర్తన, వ్యభిచారం నీలో ఉండకుండా చేస్తాను. ఇకపై నీవు ఈజిప్టును జ్ఞాపకం చేసుకోవు, నీవు వీటిపై నీ దృష్టిని పెట్టవు.
28“ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు ద్వేషించిన వారికి నీవు అసహ్యించుకునే వారికి నిన్ను అప్పగిస్తున్నాను. 29వారు ద్వేషంతో నిన్ను బాధిస్తారు. నీవు వేటి కోసం కష్టపడ్డావో వాటన్నిటిని తీసుకుంటారు. వారు నిన్ను నగ్నంగా వదిలివేయగా నీ వేశ్యాత్వం వలన కలిగిన అవమానం బహిర్గతమవుతుంది. 30నీవు దేశాలను మోహించి, వారి విగ్రహాలతో నిన్ను నీవు అపవిత్రం చేసుకున్నావు, నీ అశ్లీలత, వ్యభిచారం వల్లనే ఇది నీ మీదికి వచ్చింది. 31నీ సోదరి వెళ్లిన దారిలోనే నీవు వెళ్లావు; కాబట్టి నేను దాని గిన్నెనే నీ చేతిలో పెడతాను.
32“ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు:
“నీ అక్క త్రాగిన గిన్నె లోనిదే నీవు త్రాగుతావు,
అది లోతైన పెద్ద గిన్నె;
అది అపహాస్యం ఎగతాళిని తెస్తుంది,
అందులో త్రాగాల్సింది చాలా ఉంటుంది.
33నీవు మత్తుతో, విచారంతో నిండిపోతావు,
నీ సోదరియైన సమరయ గిన్నె,
శిథిలం నిర్మానుష్యంతో నిండిన గిన్నె.
34అడుగు వరకు దానిలోనిది త్రాగి
ఆ పాత్రను ముక్కలు చేసి,
వాటితో నీ రొమ్ములు చీల్చుకుంటావు.
ఇది నేనే చెప్పాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
35“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు నన్ను మరచిపోయి నాకు వెన్ను చూపావు, నీ అశ్లీల ప్రవర్తనకు వ్యభిచారానికి తగిన శిక్షను నీవు భరించాలి.”
36యెహోవా నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఒహోలాకు, ఒహోలీబాకు నీవు తీర్పు తీరుస్తావా? వారు చేసిన అసహ్యమైన పనులను వారికి తెలియజేయి. 37వారు వ్యభిచారులు, వారి చేతికి రక్తం అంటింది. వారు విగ్రహాలతో వ్యభిచరించారు; నాకు కన్న బిడ్డలను వారు విగ్రహాలకు ఆహారంగా అర్పించారు. 38వారు నాకు కూడా ఇలా చేశారు: అదే సమయంలో వారు నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు; నా సబ్బాతులను కూడా అపవిత్రం చేశారు. 39వారు తాము పెట్టుకున్న విగ్రహాలకు తమ పిల్లలను అర్పించిన రోజే వారు నా పరిశుద్ధాలయంలో ప్రవేశించి దానిని అపవిత్రం చేశారు. నా నివాసంలో వారు ఈ విధంగానే చేశారు.
40“వారు దూర ప్రాంతాల నుండి వచ్చిన పురుషుల కోసం దూతలను కూడా పంపారు. వారు వచ్చినప్పుడు వారి కోసం నీవు స్నానం చేసి కళ్లకు కాటుక పెట్టుకుని నగలు ధరించావు. 41అందమైన మంచం మీద కూర్చుని దాని ఎదురుగా ఉన్న బల్లమీద నా పరిమళద్రవ్యాన్ని ఒలీవల నూనెను పెట్టావు.
42“అప్పుడే కోలాహలం చేసే గుంపు ఆమె చుట్టూ వినిపించింది; అల్లరిమూకలోని వారితో పాటు ఎడారి మార్గాన త్రాగుబోతులు వచ్చారు. వారు ఈ అక్కచెల్లెళ్ల చేతులకు కడియాలను తొడిగి వారి తలకు అందమైన కిరీటాలు పెట్టారు. 43వ్యభిచారం చేసి అలసిపోయిన దాని గురించి ఇలా అన్నాను, ‘అది వారితో చేసినట్లే వారు దానితో వ్యభిచారం చేశారు.’ 44వేశ్యతో గడిపినట్లుగా వారు ఆమెతో గడిపారు. అలాగే వేశ్యలైన ఒహోలాతో, ఒహోలీబాతో గడిపారు. 45వీరిద్దరు వ్యభిచారం చేసి హత్యలు చేశారు కాబట్టి నీతిమంతులైన న్యాయాధిపతులు వీరికి తగిన శిక్ష విధిస్తారు.
46“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: వారి మీదికి నేను అల్లరిమూకను రప్పిస్తాను. శత్రువులు వారిని భయపెట్టి దోచుకుంటారు. 47అల్లరిమూక వారిని రాళ్లు రువ్వి చంపుతుంది. ఖడ్గంతో చంపుతారు. వారి కుమారులు కుమార్తెలను చంపి వారి ఇళ్ళను కాల్చివేస్తారు.
48“కాబట్టి స్త్రీలందరూ మిమ్మల్ని అనుకరించకుండా హెచ్చరికగా ఉండేలా నేను దేశంలోని అసభ్య అంతం చేస్తాను. 49మీరు మీ అసభ్య ప్రవర్తనకు శిక్ష అనుభవిస్తారు, విగ్రహారాధన పాపానికి పర్యవసానాలను భరిస్తారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 23: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెహెజ్కేలు 23 కోసం వీడియో