యెహెజ్కేలు 21

21
దేవుని తీర్పు అనే ఖడ్గంగా బబులోను
1అప్పుడు యెహోవా వాక్కు నాకు వచ్చి: 2“మనుష్యకుమారుడా, యెరూషలేము వైపు నీ ముఖం త్రిప్పుకుని పరిశుద్ధాలయం గురించి ఇశ్రాయేలు దేశాన్ని గురించి ప్రవచించి ఇలా చెప్పు: 3యెహోవా ఇలా చెప్తున్నారు: ‘ఓ ఇశ్రాయేలూ, నేను నీకు విరోధంగా ఉన్నాను. ఒర నుండి నా ఖడ్గాన్ని దూసి నీలో ఉన్న నీతిమంతులను, దుర్మార్గులను హతమారుస్తాను. 4నీతిమంతులను, దుర్మార్గులను చంపబోతున్నాను కాబట్టి, దక్షిణం నుండి ఉత్తరం వరకు వారందరినీ చంపే వరకు నా ఖడ్గం ఒరలో పెట్టబడదు. 5అప్పుడు యెహోవానైన నేనే నా ఖడ్గాన్ని మళ్ళీ ఒరలో పెట్టకుండా దూసానని ప్రజలందరూ తెలుసుకుంటారు.’
6“కాబట్టి మనుష్యకుమారుడా, మూల్గు! నీ విరిగిన మనస్సుతో తీవ్రమైన దుఃఖంతో వారి ముందు మూలుగు. 7‘నీవెందుకు మూల్గుతున్నావు?’ అని వారు అడిగినప్పుడు, నీవు వారితో, ‘శ్రమ దినం వస్తుందనే భయంకరమైన వార్త నాకు వినబడింది! ప్రతి హృదయం భయంతో కరిగిపోతుంది, ప్రతి చేయి బలహీనం అవుతుంది. ప్రతి ఆత్మ సొమ్మసిల్లుతుంది, ప్రతీ కాలు మూత్రంతో తడిసిపోతుంది’ అని చెప్తావు. అది వస్తోంది! అది తప్పక జరుగుతుందని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
8మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 9“మనుష్యకుమారుడా, నీవు ప్రవచించి ఇలా చెప్పు: ‘యెహోవా ఇలా చెప్తున్నారు:
“ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం
పదును పెట్టబడి మెరుగు పెట్టబడింది.
10వధించడానికి పదును పెట్టబడింది,
మెరుపులా మెరిసేలా మెరుగు పెట్టబడింది!
“ ‘నా కుమారుని రాజదండాన్ని బట్టి మనం సంతోషిద్దామా? అలాంటి ప్రతి దండాన్ని ఆ ఖడ్గం తృణీకరిస్తుంది.
11“ ‘ఆ ఖడ్గం మెరుగుపరచడానికి,
చేతితో పట్టుకోడానికి నియమించబడింది;
హతం చేసేవాడు పట్టుకోడానికి,
అది పదును పెట్టబడి, మెరుగు పెట్టబడి సిద్ధంగా ఉంది.
12మనుష్యకుమారుడా, మొరపెట్టు, రోదించు
ఆ ఖడ్గం నా ప్రజలమీదికి
ఇశ్రాయేలు అధిపతులందరి మీదికి వస్తున్నది.
నా ప్రజలతో పాటు
వారు కూడా ఖడ్గంతో చంపబడతారు.
కాబట్టి నీ రొమ్ము కొట్టుకో.
13“ ‘పరీక్ష తప్పకుండా వస్తుంది. ఒకవేళ ఖడ్గం తృణీకరించిన రాజదండం కూడా కొనసాగకపోతే ఎలా? అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’
14“కాబట్టి మనుష్యకుమారుడా, ప్రవచించు,
నీ రెండు చేతులతో చప్పట్లు కొట్టు.
ఖడ్గం రెండు సార్లు దాడి చేయును గాక
మూడుసార్లు అయినా దాడి చేయును గాక.
అది వధ కొరకైన ఖడ్గం,
మహా వధ కొరకైన ఖడ్గం,
అన్ని వైపుల నుండి వారి మీద దాడి చేస్తుంది.
15తద్వార వారి హృదయాలు భయంతో కరిగిపోవును గాక,
చాలామంది హతమవుదురు గాక,
వారి గుమ్మాలన్నిటి దగ్గర
నేను ఖడ్గాన్ని నిలబెట్టాను.
చూడండి! అది తళతళ మెరుస్తూ ఉంది,
అది వధ కోసం దూయబడింది.
16ఖడ్గమా! కుడివైపు వేటు వేయి,
తర్వాత ఎడమవైపు వేటు వేయి.
ఎటువైపు త్రిప్పబడితే అటు వేటు వేయి.
17నేను కూడా నా చేతులతో చప్పట్లు కొట్టి,
నా ఉగ్రత తీర్చుకుంటాను.
యెహోవానైన నేనే ఈ మాట అన్నాను.”
18యెహోవా వాక్కు నాకు వచ్చి: 19“మనుష్యకుమారుడా, బబులోను రాజు ఖడ్గం పట్టడానికి రెండు దారులను ఏర్పరచు, రెండూ ఒకే దేశం నుండి మొదలవుతాయి. ఒక సూచికను తయారుచేసి, పట్టణానికి వెళ్లే రహదారి ఆరంభంలో ఉంచు. 20అమ్మోనీయుల పట్టణమైన రబ్బా మీదికి ఒక మార్గాన్ని, అలాగే యూదా దేశంలో ఉన్న ప్రాకార పట్టణమైన యెరూషలేము మీదికి ఒక ఖడ్గం వచ్చేలా మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలి. 21దారులు విడిపోయే చోట రెండు మార్గాలు చీలే స్థలంలో శకునం తెలుసుకోవడానికి బబులోను రాజు ఆగుతాడు. అతడు బాణాలను అటూ ఇటూ ఆడిస్తూ విగ్రహాల దగ్గర విచారణ చేస్తాడు. అతడు కాలేయం శకునాన్ని పరీక్షించి చూస్తున్నాడు. 22యెరూషలేము గురించి తన కుడి వైపున శకునం కనిపించింది ఏర్పాటు చేయమని, చంపమని, యుద్ధధ్వని చేయమని, గుమ్మాలకు ఎదురుగా పడగొట్టే యంత్రాలు ఏర్పాటు చేయమని, ముట్టడి దిబ్బలు వేయమని చెప్పాడు. 23అతనితో ఒప్పందం చేసుకున్న వారికి ఇది తప్పుడు శకునంగా కనిపిస్తుంది, కాని అతడు వారి అపరాధాన్ని వారికి గుర్తు చేసి వారిని బందీగా తీసుకెళ్తాడు.
24“కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘మీరు బహిరంగంగా తిరుగుబాటు చేసి మీ అపరాధాన్ని గుర్తుకు తెచ్చారు, మీరు చేసేవాటన్నిటిలో మీ పాపాలను బయట పెట్టుకున్నారు. మీరు ఇలా చేశారు కాబట్టి, మీరు బందీలుగా కొనిపోబడతారు.
25“ ‘అపవిత్రుడా ఇశ్రాయేలీయుల దుష్ట అధిపతీ, నిన్ను శిక్షించే రోజు సమీపించింది; నీ శిక్షాకాలం ముగింపుకు చేరుకుంది, 26ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: తలపాగా తీసివేయి, కిరీటాన్ని తీసివేయి. ఇది వరకు ఉన్నట్లుగా ఇక ఉండదు: అల్పులు హెచ్చింపబడతారు, గొప్పవారు తగ్గించబడతారు. 27శిథిలం! ఒక శిథిలం! నేను దానిని శిథిలం చేస్తాను! కిరీటం న్యాయంగా ఎవరికి చెందినదో ఆయన వచ్చేవరకు అది ఉండదు; దానిని నేను ఆయనకు ఇస్తాను.’
28“మనుష్యకుమారుడా! నీవు ప్రవచించి ఇలా చెప్పు, ‘అమ్మోనీయుల గురించి వారి అవమానాల గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు:
“ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం,
వధ కోసం దూయబడింది,
నాశనం చేయడానికి మెరుగు పెట్టబడి,
మెరుపులా తళతళలాడుతూ ఉంది!
29నీ గురించి శకునగాండ్రు తప్పుడు దర్శనాలు చూస్తుండగా,
నీ గురించి అబద్ధపు శకునాలు చెప్తున్నప్పుడు,
ఎవరి దినమైతే వచ్చేసిందో,
ఎవరి శిక్షా సమయం ముగింపుకు చేరుకుందో,
ఆ దుర్మార్గుల మెడ మీద ఆ ఖడ్గం పెట్టబడుతుంది.
వారి మెడ ప్రక్కనే అది నిన్ను పడవేస్తుంది.
30“ ‘ఖడ్గాన్ని తిరిగి ఒరలో పెట్టు.
నీవు సృజించబడిన స్థలంలోనే,
నీ పూర్వికుల దేశంలోనే
నేను నీకు తీర్పు తీరుస్తాను.
31నేను నా ఉగ్రతను నీపై కుమ్మరించి
నా కోపాగ్నిని నీ మీదికి ఊదుతాను;
నాశనం చేయడంలో నేర్పరులైన
క్రూరుల చేతికి నిన్ను అప్పగిస్తాను.
32నీవు అగ్నికి ఆహుతి అవుతావు,
నీ రక్తం నీ దేశంలో చిందించబడుతుంది,
నీవు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోబడవు;
ఎందుకంటే యెహోవానైన నేనే చెప్పాను.’ ”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 21: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెహెజ్కేలు 21 కోసం వీడియో