యెహెజ్కేలు 16

16
వ్యభిచరించిన భార్యగా యెరూషలేము
1యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చి: 2“మనుష్యకుమారుడా, యెరూషలేము చేసిన అసహ్యమైన ఆచారాలు దానికి తెలియజేసి, 3ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఇలా చెప్తున్నారు: మీ మూలలు, మీ పుట్టుక కనానీయుల దేశంలోనే; మీ తండ్రి అమోరీయుడు, మీ తల్లి హిత్తీయురాలు. 4నీ జన్మ విధానం చూస్తే, నీవు పుట్టిన రోజున నీ నాభి సూత్రం కత్తిరించబడలేదు, నిన్ను నీళ్లతో శుభ్రం చేయలేదు, ఉప్పుతో రుద్దలేదు, గుడ్డలో చుట్టలేదు. 5నీ మీద ఎవరూ జాలిపడలేదు. ఈ పనులలో ఒక్కటైనా చేయాలని ఎవరూ నీ మీద కనికరం చూపించలేదు. పైగా, పుట్టిననాడే నిన్ను అసహ్యించుకుని, బయట పొలంలో విసిరివేశారు.
6“ ‘అప్పుడు నేను అటు నుండి వెళ్తూ నీ రక్తంలో కొట్టుకుంటున్న నిన్ను చూసి, నీవు నీ రక్తంలో పడి ఉన్నప్పుడు నేను నీతో, “బ్రతుకు!” అని అన్నాను. 7నిన్ను పొలం లోని మొక్కలా పెంచాను. నీవు పెరిగి అభివృద్ధిచెంది యుక్తవయస్సులోకి ప్రవేశించావు. నీకు రొమ్ములు ఏర్పడ్డాయి, నీ జుట్టు పెరిగింది, అయినప్పటికీ నీవు పూర్తిగా నగ్నంగా ఉన్నావు.
8“ ‘తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసి, నీవు ప్రేమకు తగిన వయస్సులో ఉన్నావు కాబట్టి నా వస్త్రాన్ని నీపై వేసి నీ నగ్న శరీరాన్ని కప్పాను. నేను నీతో ప్రమాణం చేసి నిబంధన చేసుకున్నప్పుడు నీవు నా దానివి అయ్యావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
9“ ‘నీకు నీళ్లతో స్నానం చేయించి నీ రక్తాన్ని కడిగి సువాసనగల నూనెతో నిన్ను అభిషేకించాను. 10నీకు అందమైన కుట్టుపని చేసిన వస్త్రాలు వేసి, మంచి చర్మంతో చేసిన చెప్పులు నీ పాదాలకు తొడిగించాను. నీకు సన్నని అవిసె నారబట్టలు వేసి ఖరీదైన పట్టు వస్త్రంతో నిన్ను కప్పాను. 11నేను నిన్ను నగలతో అలంకరించాను: నీ చేతులకు కంకణాలు, మెడలో హారం వేసి, 12ముక్కుకు ముక్కుపుడక, చెవులకు పోగులు తలపై కిరీటం పెట్టాను. 13ఇలా నిన్ను బంగారం, వెండితో అలంకరించి, సన్నని నార కుట్టుపని ఉన్న ఖరీదైన పట్టు వస్త్రాలు నీకు ధరింపజేశాను. నీకు ఆహారంగా తేనె, ఒలీవనూనె నాణ్యమైన పిండి ఇవ్వగా నీవు చాలా అందంగా తయారయ్యావు, ఒక రాణిగా ఎదిగావు. 14నీ అందం కారణంగా నీ కీర్తి దేశాల్లో వ్యాపించింది, ఎందుకంటే నేను నీకు ఇచ్చిన వైభవం నీ అందాన్ని పరిపూర్ణం చేసిందని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
15“ ‘అయితే నీ అందాన్ని నమ్ముకుని, నీ కీర్తిని ఉపయోగించుకుని నీవు వేశ్యగా మారావు. దారిన వెళ్లే వారందరితో వ్యభిచరించావు; నీ అందం వారి సొంతం అయింది. 16నీవు అందమైన క్షేత్రాలను ఏర్పాటు చేయడానికి నీ వస్త్రాల్లో కొన్నిటిని తీసుకున్నావు, అక్కడ నీవు నీ వ్యభిచారం కొనసాగించావు. నీవు అతని దగ్గరకు వెళ్లావు, అతడు నీ అందాన్ని తనది చేసుకున్నాడు. 17నేను నీకు ఇచ్చిన నాణ్యమైన నగలు, నా బంగారు వెండితో చేసిన నగలు కూడా తీసుకుని, నీకోసం మగ విగ్రహాలను తయారుచేసి, వాటితో వ్యభిచారం చేశావు. 18నీవు వాటికి నీ కుట్టుపని చేసిన వస్త్రాలు ధరింపజేసి, నీవు వాటికి నా నూనె, ధూపం సమర్పించావు. 19నేను నీకు ఆహారంగా ఇచ్చిన నాణ్యమైన పిండి, తేనె, నూనెలను తీసుకుని సువాసన వచ్చేలా వాటికి అర్పించావు. జరిగింది ఇదే అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
20“ ‘నీవు నాకు కనిన కుమారులను, కుమార్తెలను ఆ విగ్రహాలకు ఆహారంగా బలి అర్పించావు. నీవు చేసిన వ్యభిచారం సరిపోలేదా? 21నా పిల్లలను నీవు వధించి ఆ విగ్రహాలకు బలి ఇచ్చావు. 22నీవు అసహ్యకరమైన ఆచారాలు పాటిస్తూ వ్యభిచారం చేస్తున్నప్పుడు నీ యవ్వనంలో నీవు నగ్నంగా ఒంటి మీద ఏమి లేకుండ, నీ రక్తంలో పడి తన్నుకుంటున్న రోజులను జ్ఞాపకం చేసుకోలేదు.
23“ ‘నీవు చేసిన చెడుతనాన్ని బట్టి శ్రమ! నీకు శ్రమ అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. 24నీవు నీకోసం ఒక మట్టిదిబ్బను నిర్మించుకున్నావు, ప్రతి బహిరంగ కూడలిలో ఒక ఎత్తైన క్షేత్రాన్ని నిర్మించావు. 25ప్రతి వీధి మూలలో నీవు నీ ఎత్తైన క్షేత్రాలను నిర్మించి, నీ అందాన్ని దిగజార్చుకున్నావు, కామం ఎక్కువై దారిన ఎవరు వెళ్తే వారికి నీ కాళ్లను తెరిచి వ్యభిచరించావు. 26నీవు కామవాంఛలతో నిండిన నీ పొరుగువారైన ఈజిప్టు వారితో మరి ఎక్కువగా వ్యభిచారం చేసి నాకు కోపాన్ని రేపావు. 27కాబట్టి నేను నీ మీదికి చేయి చాచి నీ సరిహద్దులను కుదించాను; నీ అశ్లీల ప్రవర్తనకు దిగ్భ్రాంతి చెందిన ఫిలిష్తీయుల కుమార్తెలైన నీ శత్రువుల దురాశకు నిన్ను అప్పగించాను. 28నీకు తృప్తి కలుగలేదు కాబట్టి నీవు అష్షూరీయులతో కూడా వ్యభిచరించావు; ఆ తర్వాత కూడా నీకు తృప్తి కలుగలేదు. 29బబులోను వర్తక దేశంతో కూడా వ్యభిచరించావు, అయినా నీకు తృప్తి కలుగలేదు.
30“ ‘నీవు ఇవన్నీ చేస్తూ సిగ్గులేని వేశ్యలా ప్రవర్తిస్తూ ఉంటే, నాకు నీ మీద కోపం వచ్చింది,#16:30 లేదా నీ హృదయం ఎంత తాపంతో ఉండింది అని ప్రభువైన యెహోవా అంటున్నారు. 31నీవు ప్రతి వీధి మూలలో నీ మట్టిదిబ్బలను నిర్మించినప్పుడు, ప్రతి బహిరంగ కూడలిలో నీ క్షేత్రాలను నిర్మించినప్పుడు నీవు ఒక వేశ్య చేసినట్లు చేయలేదు, ఎందుకంటే నీవు డబ్బును తిరస్కరించావు.
32“ ‘వ్యభిచారియైన భార్యా! నీవు నీ సొంత భర్త కంటే అపరిచితులే కావాలనుకుంటావు! 33వేశ్యలందరూ బహుమతులు తీసుకుంటారు, కానీ నీ ప్రేమికులందరికీ నీవు ఎదురు బహుమతులు ఇస్తావు, నీతో వ్యభిచారం చేయడం కోసం ఎక్కడి నుండైనా నీ దగ్గరకు రావాలని వారికి లంచం ఇస్తావు. 34కాబట్టి నీ వ్యభిచారంలో నీకు ఇతరులకు తేడా ఉంది; నీతో వ్యభిచరించడానికి ఎవరూ నీ వెంట పడరు. నీవు డబ్బులు తీసుకోవు కాని తిరిగి నీవే వారికి ఇస్తావు కాబట్టి నీవు చాలా భిన్నమైనదానివి.
35“ ‘కాబట్టి, వేశ్యా, నీవు యెహోవా మాట విను! 36ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: నీవు నీ ప్రేమికులతో నీ వ్యభిచారంలో నీ కామాన్ని కుమ్మరించి, నీ నగ్న శరీరాన్ని చూపించినందుకు, నీ అసహ్యకరమైన విగ్రహాల కారణంగా, నీవు వాటికోసం నీ పిల్లల రక్తాన్ని చిందించినందున, 37నీకు ఇష్టమైన నీ ప్రేమికులందరిని నీవు ప్రేమించినవారిని అలాగే నీవు ద్వేషించిన వారందరిని పోగుచేస్తాను. నీ చుట్టూ వారిని పోగు చేసి వారు నీ నగ్న శరీరాన్ని చూసేలా వారి ఎదుట నిన్ను వివస్త్రను చేస్తాను. 38వ్యభిచారులై హత్యలు చేసే స్త్రీలకు విధించే శిక్షను నేను నీకు విధిస్తాను; నా కోపం, రోషంతో కూడిన రక్త ప్రతీకారాన్ని నేను నీ మీదికి తెస్తాను. 39తర్వాత నేను నిన్ను నీ ప్రేమికుల చేతికి అప్పగిస్తాను, వారు నీ మట్టిదిబ్బలను కూల్చివేసి, నీ ఎత్తైన క్షేత్రాలను నాశనం చేస్తారు. వారు నీ బట్టలు విప్పి, నీ సొగసైన నగలును తీసుకుని నిన్ను నగ్నంగా వదిలివేస్తారు. 40వారు నీ మీదికి గుంపును రెచ్చగొట్టి పంపుతారు, ఆ గుంపు నిన్ను రాళ్లతో కొట్టి, తమ ఖడ్గాలతో నిన్ను ముక్కలు చేస్తారు. 41వారు నీ ఇళ్ళను తగలబెట్టి, అనేకమంది స్త్రీల చూస్తుండగా నీకు శిక్ష విధిస్తారు. నేను నీ వ్యభిచారాన్ని మాన్పిస్తాను, నీవు ఇకపై నీ ప్రేమికులకు డబ్బు చెల్లించవు. 42అప్పుడు నీ మీద నా ఉగ్రత తగ్గిపోతుంది, రోషంతో కూడిన నా కోపం నీ మీద నుండి తొలగిపోతుంది; నేను ప్రశాంతంగా ఉంటాను, ఇకపై కోపంగా ఉండను.
43“ ‘నీవు నీ యవ్వన దినాలను జ్ఞాపకం చేసుకోక వీటన్నిటితో నాకు కోపం రేపావు కాబట్టి, నీవు చేసిన పనిని నేను నిశ్చయంగా నీ తల మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. మీరు మీ ఇతర అసహ్యకరమైన ఆచారాలకు అసభ్యతను జోడించలేదా?
44“ ‘సామెతలు చెప్పే ప్రతి ఒక్కరూ నీ గురించి ఈ సామెత చెప్తారు: “తల్లి ఎలాంటిదో కూతురు అలాంటిదే” అని. 45నీవు భర్తను పిల్లలను విడిచిపెట్టిన నీ తల్లికి తగిన కుమార్తెవు; అలాగే నీవు తన భర్తను పిల్లలను విడిచిపెట్టిన నీ అక్కకు తగ్గ చెల్లెలివి. నీ తల్లి హిత్తీయురాలు నీ తండ్రి అమోరీయుడు. 46నీ ఎడమ ప్రక్కన తన కుమార్తెలతో నివసించే సమరయ నీకు అక్క, నీ కుడి ప్రక్కన తన కుమార్తెలతో నివసించే సొదొమ నీకు చెల్లెలు. 47నీవు వారిలా ప్రవర్తించడమే కాకుండా వారి అసహ్యకరమైన ఆచారాలను పాటించావు, ప్రవర్తన అంతటిలో వారికన్నా మరింతగా దిగజారిపోయావు. 48నీవు, నీ కుమార్తెలు చేసినట్లు నీ సోదరియైన సొదొమ గాని దాని కుమార్తెలు గాని చేయలేదని నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
49“ ‘నీ సోదరి సొదొమ చేసిన పాపమేమిటంటే, తాను, తన కుమార్తెలు అహంకారులు, ఆహార సమృద్ధి కలిగి ఉండి ఇతరులను పట్టించుకోరు; వారు పేదలకు గాని అవసరంలో ఉన్నవారికి గాని సహాయం చేయలేదు. 50వారంతా గర్వించి నా ఎదుట అసహ్యమైన వాటిని చేశారు కాబట్టి అదంతా చూసి నేను వారిని వెళ్లగొట్టాను. 51సమరయ సైతం నీవు చేసిన పాపంలో సగమైనా చేయలేదు. నీవు వారికంటే అసహ్యమైన పనులు చేశావు. నీవు చేసిన వాటితో పోల్చితే నీ అక్కచెల్లెళ్లు నీతిమంతులుగా కనబడతారు. 52నీ అక్కచెల్లెళ్లకు నీవు విధించిన అవమాన శిక్ష నీవే భరించాలి. వారి పాపాల నీ పాపాలు కంటే చాలా నీచంగా ఉన్నాయి కాబట్టి వారు నీ కంటే ఎక్కువ నీతిమంతులుగా కనిపిస్తారు. నీ పనుల వలన నీ అక్కచెల్లెళ్లు నీతిమంతులుగా కనబడుతున్నారు కాబట్టి సిగ్గుపడి అవమానాన్ని భరించు.
53“ ‘నేను సొదొమకు దాని కుమార్తెలకు, సమరయకు దాని కుమార్తెలకు వారి సంపదతో పాటు మీ సంపదను తిరిగి ఇస్తాను. 54తద్వార వారి ఆదరణ కోసం నీవు చేసిన దానంతటిని బట్టి నీవు అవమానాన్ని భరించి సిగ్గుపడతావు. 55నీ సోదరీలైన సొదొమ దాని కుమార్తెలు, సమరయ దాని కుమార్తెలు తమ పూర్వస్థితికి వస్తారు. అలాగే నీవు నీ కుమార్తెలు కూడా మీ పూర్వస్థితికి వస్తారు. 56నీవు గర్వించే రోజుల్లో, నీ దుర్మార్గం బయటపడక ముందు నీ సోదరి సొదొమ గురించి కూడా ప్రస్తావించవు, 57అయినప్పటికీ, ఇప్పుడు ఎదోము కుమార్తెలు, ఆమె పొరుగువారైన ఫిలిష్తీయుల కుమార్తెలు, మీ చుట్టూ ఉన్న మిమ్మల్ని తృణీకరించే వారందరూ మిమ్మల్ని దూషిస్తున్నారు. 58నీ అసభ్య ప్రవర్తనకు నీ అసహ్యమైన ఆచారాల పర్యవసానాన్ని నీవే భరించాలి అని యెహోవా ప్రకటిస్తున్నారు.
59“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు చేసిన నిబంధన ఉల్లంఘించడం ద్వారా నీవు నా ప్రమాణాన్ని తృణీకరించావు కాబట్టి దానికి తగినట్లుగా నీకు చేస్తాను. 60అయినా నీ యవ్వనంలో నేను నీతో చేసిన ఒడంబడికను జ్ఞాపకం చేసుకుంటాను, నీతో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను. 61నీవు నీ అక్కచెల్లెళ్లను కలుసుకున్నప్పుడు నీ మార్గాలను జ్ఞాపకం చేసుకుని సిగ్గుపడతావు. నీతో నా ఒడంబడికలో భాగం కాకపోయినా నేను వారిని నీకు కుమార్తెలుగా ఇస్తాను. 62నేను నీతో నా ఒడంబడికను స్థిరపరుస్తాను, అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు. 63నీవు చేసిన వాటన్నిటికి నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు నీవు వాటిని జ్ఞాపకం చేసుకుని సిగ్గుపడతావు, నీ అవమానాన్ని బట్టి ఇక ఎన్నటికీ నోరు విప్పవు, ఇదే యెహోవా వాక్కు.’ ”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 16: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెహెజ్కేలు 16 కోసం వీడియో