ఎస్తేరు 2
2
ఎస్తేరు రాణి అయింది
1తర్వాత రాజైన అహష్వేరోషు కోపం తగ్గినప్పుడు, అతడు వష్తిని, ఆమె చేసిన దానిని, ఆమె గురించి ఎలాంటి శాసనం ఇచ్చాడో జ్ఞాపకం చేసుకున్నాడు. 2రాజ వ్యక్తిగత పరిచారకులు, “రాజు కోసం అందమైన యువ కన్యకలను వెదకడం జరగాలి. 3రాజు తన సామ్రాజ్యంలో ఉన్న ప్రతి దేశంలో ఈ అందమైన యువ కన్యకలను షూషను కోటలో ఉన్న అంతఃపురంలోకి తీసుకురావడానికి ప్రతినిధులను నియమించాలి. ఆ యువ కన్యకలు రాజు యొక్క నపుంసకుడైన హేగై సంరక్షణలో ఉంచాలి; ఆ స్త్రీలకు అందం కోసం సుగంధద్రవ్యాలు అందించాలి. 4తర్వాత వారందరిలో ఏ కన్య రాజుని ఆకర్షిస్తుందో, ఆమె వష్తి స్థానంలో రాణి అవుతుంది” అని ప్రతిపాదించారు. ఈ సలహా రాజు ఆమోదం పొందింది, అతడు దానిని పాటించాడు.
5ఆ సమయంలో షూషను కోటలో బెన్యామీను గోత్రానికి చెందిన కీషుకు పుట్టిన షిమీ యొక్క కుమారుడైన యాయీరుకు పుట్టిన మొర్దెకై అనే యూదుడు ఉండేవాడు, 6బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము నుండి చెరకు తీసుకెళ్లిన యూదా రాజైన యెహోయాకీనుతో#2:6 హెబ్రీలో యెకొన్యా యెహోయాకీనుకు మరొక రూపం పాటు ఉన్నవారిలో ఇతడు ఉన్నాడు. 7మొర్దెకై యొక్క పినతండ్రి యొక్క కుమార్తె, హదస్సా అనే బంధువు ఉన్నది, ఆమెకు తల్లిదండ్రులు లేనందుకు అతడే ఆమెను పెంచాడు. ఎస్తేరు అని కూడ పిలువబడే ఈ యువతి మంచి రూపం కలిగి, అందంగా ఉండేది. ఆమె తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మొర్దెకై ఆమెను తన సొంత కుమార్తెగా దత్తత తీసుకున్నాడు.
8రాజు ఆజ్ఞ అంతా ప్రకటించబడింది, చాలామంది యువతులను, షూషను కోటకు తెచ్చారు, హేగై అనే ఆ అంతఃపురం యొక్క అధికారి ఆధీనంలో వారిని ఉంచారు, ఎస్తేరును కూడా రాజభవనానికి తీసుకెళ్లి హేగైకు అప్పగించారు. 9ఎస్తేరు అతనికి నచ్చింది, దయ పొందుకుంది. వెంటనే పరిమళద్రవ్యాలు ఆమెకు అందించి, ప్రత్యేక ఆహారం ఆమెకు ఏర్పాటు చేశాడు. అతడు ఆమె కోసం రాజభవనం నుండి ఏర్పరచబడిన ఏడుగురు స్త్రీ పరిచారకులను నియమించాడు, ఆమెను, ఆమె పరిచారకులను అంతఃపురంలోని శ్రేష్ఠమైన స్థలంలోనికి పంపించాడు.
10ఎస్తేరు తన జాతిని, తన కుటుంబ నేపధ్యాన్ని బయలుపరచలేదు, ఎందుకంటే అవి చెప్పకూడదని మొర్దెకై ఆమెకు ఆదేశించాడు. 11ఎస్తేరు ఎలా ఉందో, ఆమె క్షేమం తెలుసుకోవడానికి మొర్దెకై ప్రతిరోజు అంతఃపురం ఆవరణం దగ్గరే అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు.
12ఒక యువతి రాజైన అహష్వేరోషు దగ్గరకు వెళ్లే సమయం రాకముందు, ఆమె ఆరు నెలలు పాటు గోపరస తైలం, మరో ఆరు నెలలు వివిధ పరిమళద్రవ్యాలు వాడాలి. 13ఈ విధంగా ఒక యువతి రాజు దగ్గరకు వెళ్లాలి: అంతఃపురం నుండి రాజు సముఖంలోకి వెళ్లేటప్పుడు, ఆమెకు ఏది కావాలో అది తనకు ఇవ్వబడుతుంది. 14సాయంత్రం ఆమె అక్కడికి వెళ్తుంది, ఉదయం అంతఃపురంలో ఇంకొక భాగముకు, ఉపపత్నులపై అధికారిగా ఉన్న షయష్గజు యొక్క సంరక్షణకు తిరిగి వెళ్తుంది. రాజుకు ఆమె నచ్చి, తన పేరు పెట్టి పిలిపిస్తే తప్ప ఆమె అతని దగ్గరకు తిరిగి వెళ్లదు.
15రాజు దగ్గరకు వెళ్లడానికి ఎస్తేరు యొక్క వంతు వచ్చినప్పుడు (ఈమె మొర్దెకై పినతండ్రి అబీహయిలు కుమార్తె, మొర్దెకై ఈమెను దత్తత తీసుకున్నాడు), ఆమె రాజు యొక్క నపుంసకుడు, అంతఃపురం యొక్క అధికారియైన హేగై ప్రతిపాదించింది తప్ప మరి ఏవి అడగలేదు. ఎస్తేరును చూసిన వారందరికి ఆమె అంటే ఇష్టం కలిగింది. 16అలా ఎస్తేరు రాజైన అహష్వేరోషు పరిపాలనలోని ఏడవ సంవత్సరంలో టెబేతు అనే పదవ నెలలో రాజభవనంలోకి వెళ్లింది.
17రాజు ఇతర స్త్రీలందరికంటే ఎస్తేరును ఎక్కువ ప్రేమించాడు, ఆమె ఇతర కన్యకలందరికంటే రాజు దయను, ఆమోదాన్ని పొందుకుంది. కాబట్టి అతడు ఆమె తలమీద రాజ కిరీటం పెట్టి, వష్తి స్థానంలో ఎస్తేరును రాణిగా నియమించాడు. 18రాజు తన సంస్థానాధిపతులు, అధికారులైన అందరికి ఎస్తేరు గౌరవార్థం గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అతడు సంస్థానాలలో సెలవు ప్రకటించి రాజ ఔదార్యంతో వరాలు ఇచ్చాడు.
మొర్దెకై ఒక కుట్రను బయట పెట్టుట
19కన్యకలు రెండవసారి సమావేశమైనప్పుడు, మొర్దెకై రాజ ద్వారం దగ్గర కూర్చున్నాడు. 20అయితే ఎస్తేరు మొర్దెకై చెప్పినట్లు తన కుటుంబ నేపథ్యం, తన జాతి గురించి రహస్యంగా ఉంచింది, మొర్దెకై తనను పెంచుతున్నప్పుడు ఉన్నట్లే అతని హెచ్చరికలు పాటించింది.
21మొర్దెకై రాజు ద్వారం దగ్గర కూర్చుని ఉన్న సమయంలో, రాజు యొక్క ద్వారా సంరక్షకులుగా ఉన్న బిగ్తాన్, తెరెషు అనే ఇద్దరు రాజు అధికారులు రాజైన అహష్వేరోషు మీద కోప్పడి అతన్ని చంపాలని కుట్రపన్నారు. 22అయితే మొర్దెకై ఈ కుట్ర గురించి విని ఎస్తేరు రాణికి చెప్పాడు, ఆమె మొర్దెకై పేరిట, రాజుకు తెలియజేసింది. 23ఆ సమాచారం గురించి విచారణ జరిపించినప్పుడు అది నిజమే అని తెలిసింది, ఆ ఇద్దరు అధికారులు స్తంభాలకు ఉరితీయబడ్డారు. ఇదంతా రాజు సమక్షంలో చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడింది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఎస్తేరు 2: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.