ఎస్తేరు 3

3
యూదులను నాశనం చేయాలని హామాను కుట్ర
1ఈ సంఘటనలు జరిగిన తర్వాత, రాజైన అహష్వేరోషు అగగీయుడైన హమ్మెదాతా కుమారుడైన హామానుకు ఇతర సంస్థానాధిపతులందరికన్నా ఉన్నత స్థానాన్ని ఇచ్చి అతన్ని గౌరవించాడు. 2రాజ ద్వారం దగ్గర ఉండే రాజ్యాధికారులంతా మోకరించి రాజాజ్ఞ ప్రకారం హామానుకు నమస్కరించారు. అయితే మొర్దెకై హామాను ముందు మోకరించి నమస్కరించలేదు.
3అప్పుడు రాజ ద్వారం దగ్గర ఉన్న రాజ్య అధికారులు మొర్దెకైని, “ఎందుకు నీవు రాజాజ్ఞకు లోబడట్లేదు?” అని అడిగారు. 4ప్రతిరోజు వారు అతన్ని అడుగుతున్నా అతడు ఖాతరు చేయలేదు. మొర్దెకై తాను యూదుడని వారికి చెప్పాడు కాబట్టి అతడు తాను చెప్పిన దానిపై నిలబడతాడో లేదో చూడాలని ఈ విషయం హామానుకు చెప్పారు.
5మొర్దెకై తన ఎదుట మోకరించడం లేదని, గౌరవించడం లేదని చూసి హామానుకు చాలా కోపం వచ్చింది. 6మొర్దెకై ఏ జాతివాడో తెలుసుకుని, అతన్ని ఒక్కడినే చంపితే సరిపోదు అని అతడు అనుకున్నాడు. బదులుగా హామాను, అహష్వేరోషు రాజ్యమంతటిలో ఉన్న మొర్దెకై ప్రజలను అనగా యూదులందరిని నాశనం చేసే మార్గం కోసం ఆలోచించాడు.
7రాజైన అహష్వేరోషు పరిపాలనలోని పన్నెండవ ఏట, మొదటి నెల అయిన నీసానులో హామాను సమక్షంలో ఏ నెల ఏ రోజున అలా చేయాలో అని పర్షియా భాషలో పూరు, అనగా చీటి వేశారు. ఆ చీటిలో#3:7 కొ.ప్ర.లలో చీటి వచ్చింది అని లేదు అదారు అనే పన్నెండవ నెల వచ్చింది.
8అప్పుడు హామాను రాజైన అహష్వేరోషుతో ఇలా అన్నాడు, “మీ రాజ్యంలోని సంస్థానాలన్నిటిలో ఉండే ప్రజల్లో ఉన్న ఒక జాతి ప్రజలు వేరుగా ఉంటున్నారు. వారి చట్టాలు ఇతర ప్రజల చట్టాలకు వేరుగా ఉన్నాయి; వారు రాజు శాసనాలను పాటించరు; అలా వారిని సహించడం రాజుకు అంత మంచిది కాదు. 9ఒకవేళ రాజుకు ఇష్టమైతే, వారిని నాశనం చేయడానికి ఓ శాసనం జారీ చేయండి, నేను పదివేల తలాంతుల#3:9 అంటే, సుమారు 375 టన్నులు వెండిని రాజ్య ఖజానా కోసం రాజ నిర్వాహకులకు ఇస్తాను.”
10కాబట్టి రాజు తన చేతికున్న ముద్ర ఉంగరం తీసి అగగీయుడైన హమ్మెదాతా కుమారుడైన హామానుకు ఇచ్చాడు, ఇతడు యూదులకు శత్రువు. 11రాజు హామానుతో, “డబ్బు నీ దగ్గర పెట్టుకో, నీకు ఏది ఇష్టమో, అది ప్రజలకు చేయి” అన్నాడు.
12తర్వాత మొదటి నెల పదమూడవ రోజున రాజ కార్యదర్శులను పిలిపించారు. వారు హామాను ఆజ్ఞలన్నిటిని రాజు సంస్థానాధిపతులకు, సంస్థానాధికారులకు, ఆ సంస్థానాల్లోని ప్రజల అధిపతులకు, అధికారులకు వారి వారి లిపిలో వారి భాషలో వ్రాసి పంపాలని ఆజ్ఞాపించారు. వాటిని రాజైన అహష్వేరోషు పేరిట వ్రాసి వాటిపై రాజు ఉంగరంతో ముద్ర వేశారు. 13అదారు అనే పన్నెండవ నెల పదమూడవ రోజున యువకుల నుండి ముసలివారి వరకూ స్త్రీలు, పిల్లలు అని తేడా లేకుండా ఒకే రోజులోనే యూదులనందరిని చంపి నాశనం చేసి, వారి ఆస్తులను దోచుకోవాలని శాసనాలు వార్తాహరుల ద్వారా రాజు సంస్థానాలన్నిటికి పంపబడ్డాయి. 14ఆ రోజు కోసం అందరు సిద్ధంగా ఉండేలా ఆ ఆజ్ఞ ఉన్న ప్రతులను ప్రతి సంస్థానంలో ఉన్న ప్రజలందరికి పంపించారు.
15అది రాజాజ్ఞ కాబట్టి వార్తాహరులు వెంటనే బయలుదేరి వెళ్లారు. ఆ ఆజ్ఞ షూషను కోటలో అందించడం జరిగింది. రాజు, హామాను త్రాగడానికి కూర్చుకున్నారు, కాని షూషను పట్టణం ఆందోళనగా ఉంది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఎస్తేరు 3: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి