ప్రసంగి 3
3
ప్రతి దానికి సమయముంది
1ప్రతిదానికీ ఒక సమయం ఉంది,
ఆకాశాల క్రింద ప్రతీ కార్యకలాపానికి ఒక కాలం ఉంది:
2పుట్టడానికి సమయం చావడానికి సమయం,
నాటడానికి సమయం, పెరికివేయడానికి సమయం,
3చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం,
పడగొట్టడానికి, కట్టడానికి.
4ఏడ్వడానికి, నవ్వడానికి
దుఃఖపడడానికి, నాట్యమాడడానికి,
5రాళ్లు పారవేయడానికి, కుప్పవేయడానికి,
కౌగిలించుకోడానికి, కౌగిలించడం మానడానికి.
6వెదకడానికి సమయం, పోగొట్టుకోడానికి సమయం,
దాచిపెట్టడానికి, పారవేయడానికి,
7చింపివేయడానికి, కుట్టడానికి,
మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి,
8ప్రేమించడానికి, ద్వేషించడానికి,
యుద్ధం చేయడానికి, సమాధానపడడానికి సమయం ఉంటుంది.
9కష్టపడేవారికి తమ కష్టానికి పొందే లాభమేంటి? 10మనుష్యజాతి మీద దేవుడు మోపిన భారం నేను చూశాను. 11ఆయన ప్రతిదాన్ని దాని సమయానికి తగినట్లుగా ఉండేలా చేశారు. ఆయన మానవ హృదయంలో నిత్యమైన జ్ఞానాన్ని ఉంచారు; దేవుడు చేసిన వాటిని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా ఎవరూ గ్రహించలేరు. 12మనుష్యులు జీవించినంత కాలం సంతోషంగా ఉంటూ, మంచి చేయడం కంటే ఉత్తమమైనది ఏదీ లేదని నేను తెలుసుకున్నాను. 13ప్రతి ఒక్కరు తిని త్రాగుతూ తన కష్టార్జితాన్ని ఆస్వాదించడమే దేవుని వరమని నేను తెలుసుకున్నాను. 14దేవుడు చేసే ప్రతిదీ శాశ్వతంగా ఉంటుందని నాకు తెలుసు; దానికి ఏమీ జోడించలేము దాని నుండి ఏమీ తీసివేయలేము. ప్రజలు ఆయనకు భయపడేలా దేవుడు అలా నియమించారు.
15ఇప్పుడు జరుగుతున్నది ఇంతకుముందు జరిగిందే.
ఇకముందు జరగబోయేది, పూర్వం జరిగి ఉన్నదే.
మునుపున్నదాన్నే మళ్ళీ దేవుడు రప్పిస్తారు, జరిగిస్తారు.
16సూర్యుని క్రింద ఈ భూమి మీద మరో విషయం నేను చూశాను.
న్యాయస్థానంలో దుర్మార్గం జరుగుతూ ఉంది.
న్యాయానికి బదులు దుర్మార్గమే ప్రబలుతోంది.
17నేనిలా అనుకున్నాను,
“నీతిమంతులకు దుర్మార్గులకు
దేవుడు తీర్పు తీరుస్తారు,
ఎందుకంటే ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది
ప్రతి పనికి తీర్పు తీర్చడానికి సమయం ఉంది.”
18నేను ఇంకా ఇలా అనుకున్నాను, “మనుష్యుల తాము జంతువుల్లాంటివారని గ్రహించేలా దేవుడు వారిని పరీక్షిస్తారు. 19ఖచ్చితంగా జంతువులకు జరిగినట్లే మనుష్యులకు జరుగుతుంది. వారిద్దరి విధి ఒక్కటే; జంతువులు చనిపోతాయి మనుష్యులు చనిపోతారు. అంతా అర్థరహితమే. 20అంతా వెళ్లేది ఒక చోటికే; సమస్తం మట్టిలో నుండి వచ్చింది, తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది. 21ఒకవేళ మానవ ఆత్మ పైకి లేస్తుందో లేదో, జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందో లేదో ఎవరికి తెలుసు?”
22కాబట్టి మనుష్యులు తమ పనిని ఆస్వాదించడం కంటే మెరుగైనది ఏదీ లేదని నేను గ్రహించాను, ఎందుకంటే అదే వారు చేయవలసింది. వారి తర్వాత ఏమి జరుగుతుందో చూడటానికి వారిని ఎవరు వెనక్కి తీసుకురాగలరు?
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ప్రసంగి 3: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.