ద్వితీయో 30
30
యెహోవా వైపుకు తిరిగిన తర్వాత కలిగే వృద్ధి
1నేను మీ ముందుంచిన ఈ దీవెనలు, శాపాలన్నీ మీ మీదికి వచ్చి, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లో మీరు వాటిని హృదయంలో భద్రం చేసుకుని, 2మీరు మీ పిల్లలు మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగివచ్చి, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ప్రతీదాని ప్రకారం మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణ ఆత్మతో ఆయనకు లోబడితే, 3మీ దేవుడైన యెహోవా మీ భాగ్యాలను పునరుద్ధరిస్తారు,#30:3 లేదా మిమ్మల్ని చెర నుండి తీసుకువస్తారు మీపై కనికరం చూపించి ఆయన మిమ్మల్ని చెదరగొట్టిన అన్ని దేశాలన్నిటి నుండి మిమ్మల్ని మళ్ళీ సమకూరుస్తారు. 4మీరు ఆకాశం క్రింద అత్యంత సుదూర దేశానికి చెదరిపోయినప్పటికి, అక్కడినుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి తిరిగి తీసుకువస్తారు. 5మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మీ పూర్వికులకు చెందిన దేశానికి తీసుకువస్తారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. మీ పూర్వికులకంటే ఆయన మిమ్మల్ని వృద్ధిలోను, సంఖ్యలోను అధికం చేస్తారు. 6మీ దేవుడైన యెహోవా మీ హృదయాలను, మీ సంతతివారి హృదయాలను సున్నతి చేస్తారు. అప్పుడు మీరు ఆయనను మీ పూర్ణ హృదయం, మీ పూర్ణ ఆత్మతో ప్రేమించి జీవిస్తారు. 7మీ దేవుడైన యెహోవా ఈ శాపాలన్నింటినీ మిమ్మల్ని ద్వేషించే, మిమ్మల్ని హింసించే మీ శత్రువులపైకి తెస్తారు. 8మీరు తిరిగివచ్చిన తర్వాత యెహోవాకు లోబడి ఆయన ఆజ్ఞలన్నిటిని పాటిస్తారు. 9అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ చేతిపనులన్నిటిలోను మీ గర్భఫలాల్లో మీ పశువుల పిల్లల్లోను మీ భూమిలోని పంటల్లోను మిమ్మల్ని వర్ధిల్ల చేస్తారు. యెహోవా మీ పూర్వికుల విషయంలో సంతోషించి మిమ్మల్ని అభివృద్ధి చేస్తారు. 10అయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులై ఉండి, ఈ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను శాసనాలను పాటించి మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో యెహోవా వైపు తిరగాలి.
మరణం కావాలా లేదా జీవం కావాలా
11నేను ఈ రోజున మీకిస్తున్న ఆజ్ఞ అంత కష్టమైందేమీ కాదు, ఇది మీరు అందుకోలేనిదీ కాదు. 12మీరు, “దానిని పొందడానికి పరలోకంలోకి ఎవరు ఎక్కి వెళ్లి, మేము దానిని పాటించేలా మాకు ఎవరు ప్రకటిస్తారు?” అని అడగడానికి ఇది పరలోకంలో లేదు. 13లేదా, “సముద్రాన్ని దాటి దాన్ని తెచ్చి, మేము దానిని పాటించేలా మాకు ఎవరు ప్రకటిస్తారు?” అని మీరు అడగడానికి అది సముద్రం అవతల లేదు. 14మీరు దానిని పాటించేలా ఆ వాక్యం మీకు చాలా దగ్గరగా ఉంది; అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.
15చూడండి, నేను ఈ రోజు జీవాన్ని వృద్ధిని, మరణాన్ని నాశనాన్ని మీ ముందు ఉంచాను. 16మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని, ఆయన మార్గంలో నడుచుకోవాలని, ఆయన ఆజ్ఞలు, శాసనాలు, చట్టాలను పాటించాలని నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపిస్తున్నాను; అప్పుడు మీరు జీవిస్తారు, వృద్ధిచెందుతారు, మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశించే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
17కానీ ఒకవేళ మీ హృదయం మారి, మీరు విధేయత చూపకుండ ఇతర దేవుళ్ళకు నమస్కరించి వారిని సేవించడానికి ఆకర్షించబడితే, 18మీరు ఖచ్చితంగా నాశనం చేయబడతారని నేను ఈ రోజు మీకు ప్రకటిస్తున్నాను. మీరు ప్రవేశించి, స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటుతున్న దేశంలో మీరు ఎక్కువకాలం జీవించలేరు.
19ఈ రోజు నేను మీ ముందు జీవాన్ని మరణాన్ని, దీవెనలు శాపాలను ఉంచి, ఆకాశాలను భూమిని మీకు మీద సాక్షులుగా పిలుస్తాను. ఇప్పుడు జీవాన్ని ఎంచుకోండి, అప్పుడు మీరు, మీ పిల్లలు బ్రతకవచ్చు. 20మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించేలా, ఆయన స్వరాన్ని విని ఆయనను గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే యెహోవాయే మీ జీవం; మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో ఆయన మీకు దీర్ఘాయుష్షు ఇస్తారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ద్వితీయో 30: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.