ద్వితీయో 29

29
ఒడంబడిక షరతులు
1యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన ఒడంబడికతో పాటు, మోయాబు దేశంలో వారితో మరో ఒడంబడిక చేయమని ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఒడంబడిక షరతులు.
2మోషే ఇశ్రాయేలీయులందరిని పిలిపించి, వారితో ఇలా అన్నాడు:
యెహోవా ఈజిప్టులో ఫరోకు అతని అధికారులందరికి, అతని దేశమంతటికి చేసింది మీ కళ్లు చూశాయి. 3మీ కళ్లతో మీరు ఆ గొప్ప పరీక్షలను, ఆ అసాధారణ గుర్తులను, గొప్ప అద్భుతాలను చూశారు. 4అయినా నేటి వరకు గ్రహించే మనస్సును గాని, చూసే కళ్లను గాని, వినే చెవులను గాని యెహోవా మీకు ఇవ్వలేదు. 5అయినప్పటికీ యెహోవా అంటున్నారు, “నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించిన నలభై సంవత్సరాల్లో, మీ బట్టలు గాని, కాళ్ల చెప్పులు గాని పాతగిల్లలేదు. 6మీరు రొట్టెలు తినలేదు ద్రాక్షరసం గాని మద్యం గాని త్రాగలేదు. నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకుంటారని ఇలా చేశాను.”
7మీరిక్కడికి వచ్చినప్పుడు హెష్బోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మనతో పోరాడడానికి వచ్చారు, కాని మనం వారిని ఓడించాము. 8మనం వారి దేశాన్ని స్వాధీనపరచుకుని రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రానికి వారసత్వంగా దాన్ని ఇచ్చాము.
9ఈ ఒడంబడిక షరతులను జాగ్రత్తగా పాటించాలి, తద్వార మీరు చేసేవాటన్నిటిలో మీరు వృద్ధిచెందుతారు. 10-13మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన ప్రకారం మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారం, నేడు మిమ్మల్ని తనకు ప్రజలుగా నియమించుకొని తానే మీకు దేవుడైయుండేలా మీ దేవుడైన యెహోవా నేడు మీకు నియమిస్తున్న మీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణంలోను మీరు ఈ రోజున మీరంతా అనగా మీ నాయకులు, ముఖ్య పురుషులు, మీ పెద్దలు, అధికారులు, ఇశ్రాయేలీయులలో ఇతర పురుషులందరు, మీ పిల్లలు, మీ భార్యలు, మీ పాళెంలో నివసిస్తున్న విదేశీయులు, మీ కట్టెలను నరికేవారు, మీ నీటిని తోడేవారు, అందరు నేడు మీ దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడికలోకి ప్రవేశించడానికి ఇక్కడ నిలబడి ఉన్నారు, ఈ రోజు యెహోవా ప్రమాణం చేయడం ద్వారా, ఈ రోజు మిమ్మల్ని తన ప్రజలుగా నియమించుకొని, ఆయన మీకు వాగ్దానం చేసినట్లుగా మీ తండ్రులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుతో ప్రమాణం చేసినట్లుగా మీ దేవునిగా ఉంటారు. 14నేను ఈ ఒడంబడిక ప్రమాణాన్ని మీతో మాత్రమే కాదు, మన దేవుడైన యెహోవా సన్నిధిలో మాతోపాటు నిలబడి ఉన్నవారితో కూడా చేస్తున్నాను. 15మా దేవుడైన యెహోవా సన్నిధిలో ఈ రోజు మాతో పాటు నిలబడ్డ వారు కానీ ఈ రోజు ఇక్కడ లేని వారితో కూడా ఉన్నారు.
16మేము ఈజిప్టులో ఎలా జీవించామో, ఇక్కడి మార్గంలో దేశాల గుండా ఎలా వెళ్లామో మీకే తెలుసు. 17వాటిలో మీరు వారి అసహ్యకరమైన చిత్రాలు చెక్క రాతి, వెండి బంగారు విగ్రహాలను చూశారు. 18ఆ దేశాల దేవుళ్ళను సేవించడానికి వెళ్లి మన దేవుడైన యెహోవా నుండి తమ హృదయాన్ని మనస్సు ప్రక్కకు త్రిప్పుకున్న పురుషుడు గాని, స్త్రీ గాని, వంశం గాని గోత్రం గాని లేరనే విషయాన్ని నిర్ధారించుకోండి; అటువంటి చేదు విషాన్ని ఉత్పత్తి చేసే మూలం మీ మధ్యలో లేదనేది నిర్ధారించుకోండి.
19అలాంటి వ్యక్తులు ఈ ప్రమాణం యొక్క మాటలు విన్నప్పుడు, వారు తమ మీదికి ఆశీర్వాదాన్ని ఆహ్వానించుకుంటూ, “నేను నా సొంత మార్గంలో వెళ్లాలని పట్టుదలతో ఉన్నప్పటికీ, నేను సమాధానం కలిగి ఉంటాను” అని అనుకుంటారు, వారు నీటితో తడపబడిన భూమిపైకి, అలాగే ఎండిన భూమిపైకి విపత్తును తెస్తారు. 20యెహోవా వారిని క్షమించడానికి ఎన్నటికీ ఇష్టపడరు; ఆయన కోపం, రోషం వారిపై భగ్గుమంటాయి. ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపాలన్నీ వారి పైకి వస్తాయి, యెహోవా ఆకాశం క్రిందనుండి వారి పేర్లను తుడిచివేస్తారు. 21ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఒడంబడిక యొక్క అన్ని శాపాల ప్రకారం, కీడు కలుగజేయడానికి యెహోవా వారిని ఇశ్రాయేలు యొక్క అన్ని గోత్రాల నుండి వేరు చేస్తారు.
22తర్వాతి తరాలలో మిమ్మల్ని అనుసరించే మీ పిల్లలు, సుదూర దేశాల నుండి వచ్చిన విదేశీయులు, దేశంపై పడిన ఆపదలను, వ్యాధులను వేటితోనైతే యెహోవా దాన్ని బాధించారో చూస్తారు. 23దేశమంతా ఉప్పు, గంధకం చేత తగలబడుతున్న వ్యర్థంలా ఉంటుంది అనగా ఏదీ నాటబడదు, ఏదీ మొలకెత్తదు, దానిపై ఏ కూరగాయలు పెరగవు. ఈ నాశనం యెహోవా తీవ్ర కోపంతో పడగొట్టిన సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయిము పట్టణాల నాశనంలా ఉంటుంది. 24దేశాలన్నీ, “ఈ దేశానికి యెహోవా ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఈ భయంకరమైన, మండుతున్న కోపం?” అని అడుగుతాయి.
25దానికి సమాధానం ఇలా ఉంటుంది: “ఈ ప్రజలు తమ పూర్వికుల దేవుడైన యెహోవా ఒడంబడికను, ఆయన వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు ఆయన వారితో చేసుకున్న ఒడంబడికను విడిచిపెట్టారు. 26వారు వెళ్లి ఇతర దేవుళ్ళను సేవించారు, వారికి నమస్కరించారు, వారు వారికి తెలియని దేవుళ్ళు, ఆయన వారికి ఇవ్వని దేవుళ్ళు. 27అందువల్ల ఆ దేశంపై యెహోవా కోపం భగ్గుమంది, అందుకే గ్రంథంలో వ్రాయబడి ఉన్న అన్ని శాపాలను ఆయన వారి పైకి తీసుకువచ్చారు. 28యెహోవా భీకరమైన కోపంలో, గొప్ప క్రోధంలో వారి దేశంలో నుండి వారిని పెకిలించి, ఇప్పుడున్నట్లుగా, వారిని వేరే దేశంలోకి నెట్టివేశారు.”
29రహస్య విషయాలు మన దేవుడైన యెహోవాకు చెందినవి, కానీ వెల్లడించబడిన విషయాలు మనకు మన పిల్లలకు ఎప్పటికీ ఉంటాయి, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ మనం పాటించాలి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయో 29: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి