ద్వితీయో 21

21
పరిష్కరించబడని హత్యకు ప్రాయశ్చిత్తం
1మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని ఒక పొలంలో ఎవరైనా హత్యకు గురియై పడి ఉండడం కనబడి, ఆ హంతకుడు ఎవరో తెలియనప్పుడు, 2మీ పెద్దలు, న్యాయాధిపతులు బయటకు వెళ్లి మృతదేహం నుండి దగ్గరలో ఉన్న పట్టణాలకు దూరం కొలుస్తారు. 3తర్వాత మృతుడికి దగ్గరగా ఉన్న పట్టణ పెద్దలు ఎప్పుడూ పని చేయని, కాడి కట్టని ఓ దూడను తెచ్చి, 4దానిని ప్రవహించే ప్రవాహం ఉండి, ఎన్నడు దున్నబడని నాటబడని లోయ దగ్గరకు తోలుకుపోవాలి. అక్కడ ఆ లోయలో పట్టణ పెద్దలు దూడ మెడను విరిచివేయాలి. 5లేవీయ యాజకులు ముందుకు సాగాలి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా వారిని పరిచర్య కోసం, యెహోవా పేరిట ఆశీర్వాదాలు పలకడానికి, వివాదాలు దాడులకు సంబంధించిన అన్ని దావాలను నిర్ణయించడానికి వారిని ఎన్నుకున్నారు. 6మృతుడి గ్రామానికి చెందిన పట్టణ పెద్దలు లోయలో మెడ విరగదీసిన దూడ మీద చేతులు కడుక్కుని, 7వారు ఇలా ప్రకటించాలి: “మా చేతులు రక్తపాతం చేయలేదు, మా కళ్లు అది చేయడం చూడలేదు. 8యెహోవా, మీరు విమోచించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు కోసం ఈ ప్రాయశ్చిత్తాన్ని అంగీకరించండి, నిర్దోషి యొక్క రక్తాన్ని బట్టి మీ ప్రజలను దోషులుగా పరిగణించవద్దు” అప్పుడు రక్తపాతం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది, 9యెహోవా దృష్టిలో మీరు సరియైనది చేశారు కాబట్టి, నిర్దోషి రక్తం చిందించిన అపరాధం మీ నుండి తొలగిపోతుంది.
చెరపట్టబడిన స్త్రీని పెళ్ళి చేసికొనుట
10మీరు మీ శత్రువుల మీద యుద్ధానికి వెళ్లినప్పుడు మీ దేవుడైన యెహోవాకు వారిని మీ చేతులకు అప్పగించి, మీరు బందీలను తెచ్చినప్పుడు, 11ఒకవేళ నీవు బందీలలో ఒక అందమైన స్త్రీని గమనించి, ఆమె పట్ల ఆకర్షితుడవైతే, నీవు ఆమెను మీ భార్యగా తీసుకోవచ్చు. 12ఆమెను మీ ఇంటికి తీసుకురండి ఆమె తలను గుండు చేసుకోవాలి, గోర్లు కత్తిరించుకోవాలి, 13చెరపట్టబడినప్పుడు ఆమె వేసుకుని ఉన్న వస్త్రాలు తీసివేయాలి. నెలరోజులు ఆమె మీ ఇంట్లోనే ఉండి, తన తల్లిదండ్రుల కోసం విలపించిన తర్వాత, నీవు ఆమె దగ్గరకు వెళ్లవచ్చు, నీవు ఆమెకు భర్తగా ఆమె నీకు భార్యగా ఉండవచ్చు. 14వద్దనుకుంటే, ఆమె కిష్ఠమైన చోటికి ఆమెను పంపివేయాలి. నీవు ఆమెను అగౌరపరచినట్టే కాబట్టి ఆమెను డబ్బుకు అమ్మకూడదు బానిసగా చూడకూడదు.
జ్యేష్ఠ సంతానం యొక్క హక్కు
15ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటే, అతడు ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని ప్రేమించడు, ఇద్దరూ అతనికి కుమారులను కంటారు కాని జ్యేష్ఠ కుమారుడు అతడు ప్రేమించని భార్య కుమారుడు, 16అతడు తన కుమారులకు తన ఆస్తిని పంచినప్పుడు, నిజానికి జ్యేష్ఠ కుమారుడైన తాను ప్రేమించని భార్య కుమారుని స్థానంలో అతడు ప్రేమించే భార్య కుమారునికి జ్యేష్ఠత్వపు హక్కును ఇవ్వకూడదు. 17అతడు తనకున్న అన్నిటిలో రెట్టింపు వాటా ఇవ్వడం ద్వారా తాను ప్రేమించని భార్య కుమారుడిని జ్యేష్ఠ కుమారునిగా గుర్తించాలి. ఆ కుమారుడు తన తండ్రి శక్తికి మొదటి సంకేతము. జ్యేష్ఠత్వపు హక్కు అతనికి చెందినది.
తిరుగుబాటు చేసిన కుమారుడు
18ఒకవేళ ఎవరికైనా తండ్రికి తల్లికి లోబడని, వారు వాన్ని క్రమశిక్షణ చేసినప్పుడు వారికి వినని, మొండితనం గల తిరుగుబాటు చేసే కుమారుడు ఉంటే, 19అతని తండ్రి, తల్లి అతన్ని పట్టుకుని పట్టణ ద్వారం దగ్గర ఉన్న పెద్దల దగ్గరకు తీసుకురావాలి. 20వారు పెద్దలతో, “ఈ మా కుమారుడు మొండివాడు, తిరుగుబాటు చేసేవాడు. వీడు మాకు లోబడడు. వీడు తిండిబోతు, త్రాగుబోతు” అని చెప్పాలి. 21అప్పుడు అతని పట్టణంలోని పురుషులందరు వాన్ని రాళ్లతో కొట్టి చంపాలి. మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి. ఇశ్రాయేలీయులందరు దాని గురించి విని భయపడతారు.
వివిధ చట్టాలు
22ఒకవేళ ఎవరైనా మరణశిక్షకు తగిన పాపం చేసి చంపబడి వారి దేహం చెట్టుకు వ్రేలాడదీయబడి ఉంటే, 23దేహం రాత్రిపూట చెట్టుకు వ్రేలాడుతూ ఉండకూడదు. అదే రోజు దానిని పాతిపెట్టేలా చూడాలి, ఎందుకంటే మ్రానుపై వ్రేలాడదీయబడిన ఎవరైనా దేవుని శాపానికి గురవుతారు. మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశాన్ని మీరు అపవిత్రం చేయకూడదు!

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయో 21: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి