ద్వితీయో 20

20
యుద్ధానికి వెళ్లేటప్పుడు పాటించవలసిన నియమాలు
1మీ శత్రువులతో యుద్ధానికి వెళ్లినప్పుడు, మీ దగ్గర ఉన్నవాటి కంటే వారి దగ్గర ఎక్కువ గుర్రాలు, రథాలను చూసినప్పుడు, వారికి భయపడవద్దు, ఎందుకంటే ఈజిప్టు నుండి క్షేమంగా రప్పించిన మీ దేవుడైన యెహోవా మీతో ఉంటారు. 2మీరు యుద్ధానికి వెళ్లబోయేటప్పుడు, యాజకుడు ముందుకు వచ్చి సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతాడు. 3అతడు వారితో ఇలా అంటారు: “ఇశ్రాయేలు విను: ఈ రోజు మీరు మీ శత్రువుల మీదికి యుద్ధానికి వెళ్తున్నారు. మీరు మూర్ఛపోవద్దు, భయపడవద్దు, జడియవద్దు, వారికి భయపడకండి. 4శత్రువులతో యుద్ధం చేసేది, మిమ్మల్ని రక్షించేది మీ దేవుడైన యెహోవాయే! ఆయన మీతో ఉన్నాడు.”
5అధికారులు సైనికులతో చెప్పవలసిన మాటలు: “మీలో ఎవరైనా క్రొత్తగా ఇల్లు కట్టుకుని ఇంకా గృహప్రవేశం చేయనట్లైతే, వెంటనే ఇంటికి వెళ్లిపోవాలి, లేకపోతే ఒకవేళ అతడు యుద్ధంలో చనిపోతే మరొకరు ఆ ఇంట్లో నివసిస్తారు. 6ఎవడైనా ద్రాక్షతోట వేసి దాని ఫలసాయం అనుభవించకుండా ఉన్నాడా? అలాగైతే అతడు ఇంటికి తిరిగి వెళ్లవచ్చు, లేదా అతడు యుద్ధంలో చనిపోతే అతని తోట ఫలసాయం మరొకరు అనుభవిస్తారు. 7ప్రధానం చేసుకుని ఇంకా పెండ్లి చేసుకోకుండా ఉన్నవాడు మీలో ఉంటే అతడు ఇంటికి వెళ్లిపోవచ్చు, అతడు ఒకవేళ యుద్ధంలో చనిపోతే మరొకడు ఆమెను పెళ్ళి చేసుకోవచ్చు.” 8అధిపతులు చేయవలసిన హెచ్చరికలు, “ఎవనికైనా భయాందోళనలున్నాయా? అలాగైతే ఇంటికి వెళ్లిపోవచ్చు, లేకపోతే ఆ పిరికితనం మిగతా సైనికులకు కూడా వ్యాపిస్తుంది.” 9అధిపతులు ప్రజలకు ఈ సందేశమిచ్చిన తర్వాత సేనాధిపతులు తమ బాధ్యతలను స్వీకరిస్తారు.
10పట్టణాన్ని ముట్టడించినప్పుడు ముందు దాని ప్రజలకు సమాధానం కోసం రాయబారం పంపాలి. 11ఒకవేళ వారు సమాధానపడడానికి ఒప్పుకుని వారి ద్వారాలు తెరిస్తే, అందులో ఉన్న ప్రజలంతా మీకు లొంగిపోయి మీ కోసం వెట్టిచాకిరి చేస్తారు. 12ఒకవేళ వారు సంధికి నిరాకరించి మీతో యుద్ధానికి వస్తే, ఆ పట్టణాన్ని ముట్టడించండి. 13మీ దేవుడైన యెహోవా దానిని మీ చేతికి అప్పగిస్తే, దానిలో ఉన్న మనుష్యులందరిని ఖడ్గంతో హతమార్చాలి. 14స్త్రీలను, చిన్న పిల్లలను పశువులను మీరు కొల్లగొట్టిన ఆస్తిని మీరు తీసుకోవచ్చు; మీ దేవుడైన యెహోవా మీకిచ్చే మీ శత్రువుల దోపుడుసొమ్ము మీదే అవుతుంది. 15మీకు దూరంగా ఉన్న సమీపంలోని దేశాలకు చెందని అన్ని పట్టణాల పట్ల మీరు ఈ విధంగా వ్యవహరిస్తారు.
16యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇచ్చే పట్టణాల్లో ఊపిరి పీల్చేదేదీ మిగలకూడదు. 17మీ దేవుడైన యెహోవా ఆజ్ఞమేరకు హిత్తీయులను, అమోరీయులను కనానీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను పూర్తిగా నాశనం చేయాలి. 18లేకపోతే తమ దేవుళ్ళకు చేసే హేయ క్రియలను మీకు నేర్పుతారు, మీరు మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపాలు చేస్తారు, అందుకే వారిని నిర్మూలించమని చెప్తున్నాను.
19మీరు ఒక పట్టణాన్ని ముట్టడి వేసి, దానిని స్వాధీనపరచుకోడానికి ఎక్కువసేపు దానితో పోరాడవలసి వస్తే, మీరు దాని చెట్లను గొడ్డలితో నరికివేయవద్దు, ఎందుకంటే వాటి ఫలాలు మీరు తినవచ్చు. చెట్లేమైనా మనుష్యులా మీరు వాటిని నరికివేయడానికి? 20ఏదేమైనా, పండ్లచెట్లు కాదని మీకు తెలిసిన చెట్లను మీరు నరికివేయవచ్చు, వాటి కర్రను మీరు ముట్టడి వేసిన పట్టణం పతనం అయ్యేవరకు ముట్టడి పనులను నిర్మించడానికి ఉపయోగించవచ్చు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయో 20: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి