అపొస్తలుల కార్యములు 2:37-47

అపొస్తలుల కార్యములు 2:37-47 TSA

ప్రజలు ఈ మాటలు విని, మనస్సులో బాధపడి పేతురు, ఇతర అపొస్తలులతో, “సహోదరులారా, మేము ఏమి చేయాలి?” అని అన్నారు. అందుకు పేతురు, “మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కోసం పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరంగా ఉన్నవారందరికి అనగా, మన ప్రభువైన దేవుడు పిలిచే వారందరికి చెందుతుంది” అని వారితో చెప్పాడు. ఇంకా అనేక రకాల మాటలతో పేతురు వారిని హెచ్చరించి, “ఈ వక్ర తరం నుండి మీరు రక్షణ పొందండి” అని వారికి విజ్ఞప్తి చేశాడు. అతని సందేశాన్ని అంగీకరించినవారు బాప్తిస్మం పొందుకున్నారు, ఆ రోజు సుమారుగా మూడువేలమంది వ్యక్తులు సంఘానికి చేర్చబడ్డారు. వారు అపొస్తలులు చెప్పే బోధలకు లోబడి, వారి సహవాసంలో ఉండి, రొట్టె విరుచుటలో ప్రార్థనలో ఆసక్తితో కొనసాగుతున్నారు. అపొస్తలుల ద్వార జరిగిన అనేక అద్భుతాలు సూచకక్రియలను బట్టి ప్రతీ వ్యక్తికి భయం కలిగింది. విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు. వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలో ఉన్నవారికి ఇచ్చారు. వారందరు ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో క్రమంగా కలుసుకొనేవారు. తమ ఇళ్ళలో అందరు కలిసి ఆనందంగా యథార్థ హృదయంతో రొట్టెను విరిచి తినేవారు. వారు దేవుని స్తుతిస్తూ, ప్రజలందరి అభిమానం పొందుకున్నారు. ప్రభువు ప్రతిదినం రక్షించబడుచున్న వారిని వారి సంఖ్యకు చేర్చారు.

అపొస్తలుల కార్యములు 2:37-47 కోసం వీడియో