అపొస్తలుల కార్యములు 2:37-47
అపొస్తలుల కార్యములు 2:37-47 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ప్రజలు ఈ మాటలు విని, మనస్సులో బాధపడి పేతురు, ఇతర అపొస్తలులతో, “సహోదరులారా, మేము ఏమి చేయాలి?” అని అన్నారు. అందుకు పేతురు, “మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కోసం పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరంగా ఉన్నవారందరికి అనగా, మన ప్రభువైన దేవుడు పిలిచే వారందరికి చెందుతుంది” అని వారితో చెప్పాడు. ఇంకా అనేక రకాల మాటలతో పేతురు వారిని హెచ్చరించి, “ఈ వక్ర తరం నుండి మీరు రక్షణ పొందండి” అని వారికి విజ్ఞప్తి చేశాడు. అతని సందేశాన్ని అంగీకరించినవారు బాప్తిస్మం పొందుకున్నారు, ఆ రోజు సుమారుగా మూడువేలమంది వ్యక్తులు సంఘానికి చేర్చబడ్డారు. వారు అపొస్తలులు చెప్పే బోధలకు లోబడి, వారి సహవాసంలో ఉండి, రొట్టె విరుచుటలో ప్రార్థనలో ఆసక్తితో కొనసాగుతున్నారు. అపొస్తలుల ద్వార జరిగిన అనేక అద్భుతాలు సూచకక్రియలను బట్టి ప్రతీ వ్యక్తికి భయం కలిగింది. విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు. వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలో ఉన్నవారికి ఇచ్చారు. వారందరు ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో క్రమంగా కలుసుకొనేవారు. తమ ఇళ్ళలో అందరు కలిసి ఆనందంగా యథార్థ హృదయంతో రొట్టెను విరిచి తినేవారు. వారు దేవుని స్తుతిస్తూ, ప్రజలందరి అభిమానం పొందుకున్నారు. ప్రభువు ప్రతిదినం రక్షించబడుచున్న వారిని వారి సంఖ్యకు చేర్చారు.
అపొస్తలుల కార్యములు 2:37-47 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు. ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్షమిచ్చి, “మీరు ఈ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి” అని వారిని హెచ్చరించాడు. అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు. వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు. అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు. నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.
అపొస్తలుల కార్యములు 2:37-47 పవిత్ర బైబిల్ (TERV)
ఇది విని ప్రజల హృదయాలు కదిలిపొయ్యాయి. వాళ్ళు పేతురు మరియు యితర అపొస్తలులను, “సోదరులారా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు. పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు: “మీలో ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ నిమిత్తం మారుమనస్సు కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడ్తాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది. దేవుడు ఈ వాగ్దానాన్ని మీకోసం, మీ సంతానాని కోసం, ప్రభువు ఆహ్వానించబోయే దూర ప్రాంతాల వాళ్ళకందరి కోసం చేసాడు.” వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక, వాళ్ళతో ఈ విధంగా బ్రతిమిలాడాడు: “వక్రబుద్ధులున్న ఈ తరం వాళ్ళనుండి విడిపోయి రక్షణ పొందండి.” అతని సందేశాన్ని అంగీకరించినవాళ్ళు బాప్తిస్మము పొందారు. ఆ రోజు సుమారు మూడువేల మంది విశ్వాసులుగా చేరారు. వాళ్ళు అపొస్తలుల బోధను వింటూ సహవాసములోను, రొట్టె విరుచుటలోను పాలి భాగస్థులై, ప్రార్థన చేయుటలో నిమగ్నులై యుండేవాళ్ళు. దేవుడు అపొస్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసాడు. చిహ్నాలు చూపాడు. ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది. భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకొనేవాళ్ళు. తమ ఆస్తిని, వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్ళకు యిచ్చేవాళ్ళు. ప్రతి రోజు మందిరావరణంలో ఒకే ఉద్దేశ్యంతో సమావేశమయ్యేవాళ్ళు. ఇండ్లలో సమావేశమై ఆహారాన్ని పంచుకొని తినేవాళ్ళు. మంచి మనస్సుతో అమితానందంగా భుజించేవాళ్ళు, దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. ప్రజలందరూ వాళ్ళను యిష్టపడేవాళ్ళు. ప్రభువు తాను రక్షించినవాళ్ళను విశ్వాసులతో చేరుస్తూ వచ్చాడు.
అపొస్తలుల కార్యములు 2:37-47 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని –సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి–మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
అపొస్తలుల కార్యములు 2:37-47 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)