2 కొరింథీ పత్రిక 5
5
నూతన శరీరం కోసం వేచివుండటం
1మనం నివసిస్తున్న భూసంబంధమైన గుడారం నాశనమైనా, మానవ నిర్మితం కాని దేవుడు కట్టిన ఒక శాశ్వతమైన గృహం పరలోకంలో ఉందని మనకు తెలుసు. 2ఈలోగా పరలోకం నుండి వచ్చే మన నివాసాన్ని ధరించుకోవాలని ఆశపడుతూ మనం మూలుగుతున్నాము. 3ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడము. 4ఈ గుడారంలో ఉన్నంతసేపు మనం భారం మోస్తూ మూల్గుతూ ఉన్నాం, ఎందుకంటే, మనం దిగంబరులుగా ఉండాలని కోరుకోం కాని చనిపోయేది జీవం చేత మ్రింగివేయబడేలా, మన పరలోక నివాసాన్ని ధరించుకోవాలని కోరుతున్నాము. 5దీని కోసం మనల్ని సిద్ధపరచింది దేవుడే; ఆయనే రాబోయే దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చారు.
6కాబట్టి మనం ఎల్లప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, ఈ దేహంలో నివసించేంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు. 7మనం కంటికి కనిపించే దాన్ని కాక, విశ్వాసం వల్ల జీవిస్తున్నాము. 8కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం సంపూర్ణ నమ్మకం కలిగి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గర నివసించాలని ఎంతగానో ఇష్టపడుతున్నాము. 9కాబట్టి మనం ఈ శరీరంలో ఉన్నా లేదా దానికి దూరంగా ఉన్నా ఆయనను సంతోషపెట్టడమే లక్ష్యంగా ఉందాము. 10ఎందుకంటే, మనలో ప్రతి ఒక్కరు తాము శరీరంలో ఉండగా చేసిన వాటికి, అవి మంచివైనా చెడ్డవైనా, తగిన ప్రతిఫలాన్ని పొందడానికి మనమందరం క్రీస్తు న్యాయసింహాసనం ఎదుట ఖచ్చితంగా కనబడాలి.
సమాధానపరిచే పరిచర్య
11అయితే, ప్రభువుకు భయపడడం అంటే ఏమిటో మాకు తెలుసు కాబట్టి ఇతరులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. మేమేంటో దేవునికి స్పష్టంగా తెలుసు, మీ మనస్సాక్షికి కూడ స్పష్టంగా తెలుసని నేను నమ్ముతున్నాను. 12మరల మీ ముందు మమ్మల్ని మేము పొగడుకోవాలని ప్రయత్నించడం లేదు కాని, హృదయంలో ఉన్నదానిని బట్టి కాక, కనిపించే దానిని బట్టి గర్వించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా మమ్మల్ని బట్టి మీరు గర్వించడానికి ఒక కారణాన్ని ఇస్తున్నాము. 13కొందరు చెప్పినట్లు, మేము పిచ్చివారమైతే అది దేవుని కోసం మాత్రమే; మేము వివేకవంతులమైనా అది మీ కోసమే. 14క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది, ఎందుకంటే అందరి కోసం ఒక్కడే మరణించాడు కాబట్టి అందరు మరణించినట్టే అని మనం ఒప్పించబడ్డాము. 15ఆయన అందరి కోసం చనిపోయారు, కాబట్టి జీవిస్తున్నవారు ఇకపై తమ కోసం కాక, వారి కోసం మరణించి తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి.
16అందువల్ల, మేము ఇప్పటినుండి లోక దృష్టితో ఎవరిని లక్ష్యపెట్టము. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే లక్ష్యపెట్టినా, ఇక మేము అలా చేయము. 17కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే, వారు నూతన సృష్టి; పాతవి గతించాయి, క్రొత్తవి మొదలయ్యాయి! 18ఇదంతా దేవుని వల్లనే జరిగింది, ఆయన క్రీస్తు ద్వారా మనల్ని తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరిచే పరిచర్యను మాకు అప్పగించారు. 19ఆ పరిచర్య ఏంటంటే: దేవుడు ప్రజల పాపాలను వారి మీద మోపకుండా క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరచుకున్నారు. ఆ సమాధాన సందేశాన్ని బోధించే పని మాకు అప్పగించారు. 20అందువల్ల మేము దేవుడు మా ద్వారా వేడుకోడానికి ఏర్పరచబడిన క్రీస్తు రాయబారులము. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాము. 21మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా#5:21 పాపంగా పాపపరిహారబలిగా చేశారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 కొరింథీ పత్రిక 5: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.