2 కొరింథీ పత్రిక 2
2
1కాబట్టి నేను దుఃఖం కలిగించేలా మీ దగ్గరకు తిరిగి రాకూడదని నేను నిర్ణయించుకున్నాను. 2ఎందుకంటే, నేను మీకు దుఃఖం కలిగిస్తే, నేను దుఃఖంలో విడిచిపెట్టిన వారు తప్ప మరి ఎవరు నన్ను సంతోషపెట్టగలరు? 3కాబట్టి, నేను అక్కడికి వచ్చినపుడు నన్ను సంతోషపెట్టాల్సిన వ్యక్తులే నన్ను దుఃఖపెట్టకూడదని నేను మీకు వ్రాశాను. నా ఆనందమే మీ అందరి ఆనందమని నాకు గట్టి నమ్మకము. 4ఎంతో దుఃఖ హృదయంతో, కన్నీటితో మీకు వ్రాశాను. నేను వ్రాసింది మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు కాని, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో, మీరు గుర్తించడానికి మాత్రమే.
దోషికి క్షమాపణ
5ఎవరైనా దుఃఖం కలిగిస్తే, నాకు మాత్రమే గాక మీకందరికిని దుఃఖం కలిగించినట్లే. ఇంతకంటే కఠినంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. 6అలాంటి వానికి మీలో ఎక్కువ మంది ద్వారా విధించబడిన శిక్షే చాలు. 7కాబట్టి మీరిక అతన్ని శిక్షించకుండా క్షమించి, ఓదార్చడం మంచిది, లేకపోతే అతడు అధిక దుఃఖంలో మునిగిపోతాడేమో. 8అందుకే, మీరు అతని పట్ల మీ ప్రేమను మళ్ళీ రూఢిపరచుమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. 9మిమ్మల్ని పరీక్షించి, అన్ని విషయాల్లో మీరు విధేయత చూపుతారో లేదో తెలుసుకోవడానికి నేను అలా వ్రాశాను. 10మీరు క్షమించేవారిని నేను క్షమిస్తాను. నేను ఏ దోషమైన క్షమిస్తే, మీ కోసమే క్రీస్తును బట్టి క్షమిస్తాను. 11సాతాను మనపై ఆధిక్యాన్ని పొందకుండా అలా చేశాను, సాతాను తంత్రాలు మనకు తెలియనివి కావు.
క్రొత్త నిబంధన పరిచారకులు
12క్రీస్తు సువార్తను బోధించడానికి నేను త్రోయకు చేరినప్పుడు ప్రభువు నా పని కోసం అప్పటికే అక్కడ మార్గం సిద్ధపరచి ఉంచారని తెలుసుకున్నాను. 13కాని నా సోదరుడు తీతును అక్కడ నాకు కనిపించకపోవడంతో నా మనస్సుకు నెమ్మది లేదు. కాబట్టి అక్కడి ప్రజలకు వీడ్కోలు చెప్పి మాసిదోనియా ప్రాంతానికి వెళ్లాను.
14కాబట్టి ఆయన మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసన వ్యాపింపచేస్తూ, ఆయనలో మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు. 15ఎందుకంటే, రక్షించబడుతున్నవారి మధ్య, నశించేవారి మధ్య మేము దేవునికి ఇష్టమైన క్రీస్తు పరిమళంగా ఉన్నాము. 16ఒకరికి మరణం తెచ్చే వాసనగా, మరొకరికి జీవం తెచ్చే వాసనగా ఉన్నాము. కాబట్టి, అలాంటి కార్యానికి యోగ్యులు ఎవరు? 17మేము దేవుని వాక్యాన్ని స్వలాభం కోసం అమ్మేవారం కాదు, మేము దేవుని వాక్యాన్ని నిజాయితీగా క్రీస్తు అధికారంతో ఆయన ఎదుట బోధిస్తున్నాము. దేవుడు మమ్మల్ని చూస్తున్నారని మాకు తెలుసు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 కొరింథీ పత్రిక 2: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.