1 పేతురు 2

2
1కాబట్టి, ప్రతి విధమైన దుష్టత్వానికి, కపటానికి, అసూయకు దూరంగా ఉండండి. ప్రతి విధమైన దూషణ మానేయండి. 2నూతనంగా జన్మించిన శిశువుల్లా ఆధ్యాత్మిక పాల కొరకై అపేక్షించండి, దాన్ని త్రాగడం వలన మీరు పెరిగి పెద్దవారై రక్షించబడతారు, 3ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి తెలుసుకోండి.
సజీవమైన రాయి మరియు ఎన్నుకోబడిన ప్రజలు
4ఉపయోగం లేనిదిగా మనుష్యులచే తిరస్కరించబడిన, అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకోబడిన సజీవ రాయియైన ప్రభువును సమీపించండి. 5మీరు సజీవమైన రాళ్లవలె ఆత్మీయ మందిరంగా నిర్మించబడుతున్నారు. యేసు క్రీస్తు ద్వారా, ప్రీతికరమైన ఆత్మీయ బలులను దేవునికి అర్పించడానికి మీరు పవిత్రమైన యాజకులుగా చేయబడ్డారు. 6ఎందుకంటే లేఖనాలలో చెప్పబడిన రీతిగా:
“చూడండి, ఎన్నుకోబడిన అమూల్యమైన మూలరాతిని,
సీయోనులో స్ధాపిస్తున్నాను;
ఆయనలో విశ్వాసముంచిన వాడు,
ఎన్నటికీ సిగ్గుపడడు.”#2:6 యెషయా 28:16
7ఇప్పుడు విశ్వసించువారికి ఈ రాయి అమూల్యమైనది. కాని విశ్వసించని వారికి,
“ఇల్లు కట్టు వారిచే నిరాకరించబడిన ఈ రాయి
మూలరాయి అయ్యింది,”#2:7 కీర్తన 118:22
8మరియు,
“మనుష్యుల త్రోవకు అడ్డు వచ్చి
తొట్రిల్లి పడిపోయేలా చేసేది ఈ రాయే.”#2:8 యెషయా 8:14
వారిని పడద్రోసేది ఈ రాయే, ఆ వాక్యానికి అవిధేయులు అయినందుకు వారు పతనమయ్యారు. వారిని గురించిన దేవుని సంకల్పం అలాంటిది.
9కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఎన్నుకోబడిన ప్రజలు, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని ప్రత్యేకమైన సొత్తైయున్నారు. 10ఒకప్పుడు మీరు ప్రజలు కారు కాని ఇప్పుడు మీరు దేవుని ప్రజలు; ఒకప్పుడు మీరు దేవుని కృపను ఎరుగరు కాని ఇప్పుడు మీరు ఆ కృపకు పాత్రులు.
ఇతర నమాజంలో దైవభక్తి కలిగి జీవించుట
11ప్రియ మిత్రులారా, ఈ లోకంలో పరదేశులుగా, యాత్రికులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకుంటున్నాను. శారీరక కోరికలు ఎప్పుడు ఆత్మతో పోరాడుతుంటాయి. కనుక వాటికి విడిచిపెట్టండి. 12యూదులు కాని మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. మీ సత్కార్యాలను వారు గుర్తించి, దేవుడు మనల్ని దర్శించే రోజున వారు దేవుని మహిమపరచగలరు.
13ప్రభువు కొరకు మానవ అధికారులందరికి లోబడి ఉండండి: సార్వభౌమాధికారంలో ఉన్న చక్రవర్తులకు లోబడి ఉండండి. 14దుష్టులను శిక్షించడానికి, మంచివారిని మెచ్చుకోవడానికి పంపబడిన పాలకులకు విధేయులై ఉండండి. 15మీరు మీ సత్కార్యాల వలన మూర్ఖులైన జ్ఞానంలేని ప్రజల నోరు మూయించాలి, ఇది దేవుని చిత్తం. 16స్వతంత్రులై బ్రతకండి, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మీ స్వాతంత్ర్యాన్ని వినియోగించకండి; దేవునికి దాసులుగా జీవించండి. 17అందరిని గౌరవించండి, తోటి విశ్వాసులను ప్రేమించండి, దేవునిలో భయభక్తులు కలిగి ఉండండి, రాజులను గౌరవించండి.
18దాసులారా, మీ యజమానులకు మీరు విధేయులై ఉండండి, వారికి సమస్త మర్యాదలను చూపండి, దయ గలవారు, సౌమ్యులైనవారికి మాత్రమే గాక, కఠినులకు కూడా లోబడి ఉండండి. 19ఎవడైన అన్యాయంగా శ్రమ పొందుతూ, దేవుని పట్ల నిష్కపటమైన మనస్సాక్షి కలిగి దాన్ని ఓర్పుతో సహిస్తే దేవుని అంగీకారం పొందుతారు. 20ఎలాగంటే, పాపం చేసినందుకు ప్రతిఫలంగా వచ్చే శిక్షను ఓర్పుతో భరిస్తే దానిలో ఏం గొప్పతనం ఉన్నది? కాని మంచినే చేసి దాని కొరకు బాధను అనుభవించాల్సి వచ్చినపుడు ఓర్పుతో భరిస్తే, దేవుడు దానికై మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. 21దీని కొరకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు, ఎలాగంటే క్రీస్తే మీ కొరకు బాధపడి, ఆయన అడుగుజాడల్లో మీరు నడవడానికి ఒక మాదిరిని ఏర్పరిచారు.
22“ఆయన ఎలాంటి పాపం చేయలేదు,
ఆయన నోటి వెంట ఎన్నడు అసత్యం రాలేదు.”#2:22 యెషయా 53:9
23తాను దూషించబడినా తిరిగి దూషించలేదు, తాను హింసించబడుతున్నా ఎవరిని బెదిరించలేదు, కాని న్యాయంగా తీర్పుతీర్చే దేవునికి తనను తాను అప్పగించుకొన్నారు. 24మనం పాపం కొరకు మరణించి నీతికొరకు జీవించేలా ఆయన “మన పాపాలను తనపై ఉంచుకొని సిలువను మోసారు. ఆయన పొందిన గాయాల వల్ల మీరు స్వస్థత పొందారు. 25మీరు త్రోవ తప్పిన గొర్రెల్లా ఉన్నారు”#2:25 యెషయా 53:4,5,6 కాని ఇప్పుడు మీ ఆత్మలకు పర్యవేక్షకుడు కాపరి అయిన వాని దగ్గరకు మీరు తిరిగి వచ్చారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 పేతురు 2: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

1 పేతురు 2 కోసం వీడియో