1 కొరింథీ పత్రిక 15

15
క్రీస్తు పునరుత్థానం
1సహోదరీ సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీరు అంగీకరించి దానిలో నిలిచి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2నేను మీకు బోధించిన విధంగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకుని ఉంటే ఈ సువార్తను బట్టి మీరు రక్షించబడతారు. లేకపోతే మీరు నమ్మడం వ్యర్థమే.
3నేను పొందిన దానిని మొదట మీకు ప్రకటించాను: అది ఏంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం మరణించారు. 4లేఖనాల ప్రకారం ఆయన సమాధి చేయబడి, మూడవ దినాన సజీవునిగా లేచారు. 5ఆయన కేఫాకు, తర్వాత పన్నెండు మందికి కనబడ్డారు. 6దాని తర్వాత ఆయన ఒకేసారి అయిదువందల మందికి పైగా సహోదర సహోదరీలకు కనబడ్డారు. వారిలో కొందరు మరణించినా చాలామంది ఇంకా జీవించే ఉన్నారు. 7ఆ తర్వాత యాకోబుకు, మిగిలిన అపొస్తలులందరికి ఆయన కనబడ్డారు. 8అందరికంటే చివరిగా అకాలంలో పుట్టిన నాకు కూడా ఆయన కనబడ్డారు.
9అపొస్తలులందరిలో నేను అల్పమైనవాన్ని. నేను దేవుని సంఘాన్ని హింసించిన కారణంగా అపొస్తలుడని పిలువబడడానికి యోగ్యున్ని కాను. 10అయితే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే, ఆయన కృప నాలో వ్యర్థం కాలేదు. పైగా ఇతర అపొస్తలుల కంటే నేను ఎంతో ఎక్కువగా శ్రమపడ్డాను కాని అది నిజంగా నా ప్రయాస కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే. 11కాబట్టి నేనైనా వారైనా దానినే ప్రకటిస్తున్నాం, దానినే మీరు నమ్మారు.
మృతుల పునరుత్థానం
12మృతులలో నుండి క్రీస్తు సజీవంగా లేపబడ్డారని మేము ప్రకటిస్తుండగా, మృతుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎలా చెప్తారు? 13మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడనట్టే కదా. 14అంతేకాదు క్రీస్తు లేపబడకపోతే, మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. 15అంతేకాక, దేవుడు క్రీస్తును మరణం నుండి లేపారని దేవుని గురించి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము అబద్ధ సాక్షులంగా కనబడుతున్నాము. అయితే దేవుడు ఆయనను లేపకపోతే మరణించినవారు లేపబడరు అనేది నిజం కదా. 16మృతులు లేపబడకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు. 17క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే; మీరు ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు. 18అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. 19కేవలం ఈ జీవితకాలం వరకే క్రీస్తులో మన నిరీక్షణ ఉంచితే, అందరికంటే మనం అత్యంత దయనీయంగా ఉంటాము.
20ఇప్పుడైతే మరణించినవారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మరణం నుండి లేపబడ్డారు. 21ఒక్క మనుష్యుని ద్వారా మరణం వచ్చింది కాబట్టి మృతుల పునరుత్థానం కూడ ఒక్క మనుష్యుని ద్వారానే వస్తుంది. 22ఆదాములో అందరు ఎలా మరణించారో అలాగే క్రీస్తులో అందరు బ్రతికించబడతారు. 23అయితే ప్రతి ఒక్కరు తమ క్రమాన్ని బట్టి బ్రతికించబడతారు. క్రీస్తు ప్రథమ ఫలము. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయనకు చెందినవారు బ్రతుకుతారు. 24క్రీస్తు సమస్త ఆధిపత్యాన్ని అధికారాన్ని బలాన్ని నాశనం చేసి తండ్రియైన దేవునికి రాజ్యానికి అప్పగిస్తారు. అప్పుడు అంతం వస్తుంది. 25ఎందుకంటే ఆయన తన శత్రువులందరిని తన పాదాల క్రింద ఉంచేవరకు ఆయన పరిపాలిస్తారు. 26చివరిగా నశించే శత్రువు మరణం. 27“దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచారు”#15:27 కీర్తన 8:6 అని చెప్పినప్పుడు ఆయన క్రింద సమస్తాన్ని ఇచ్చిన దేవుడు మినహా మిగిలిన వాటన్నిటిని ఆయన క్రింద ఉంచారని అర్థం. 28ఆయన ఇది చేసినప్పుడు, దేవుడే అన్నిటిలో సర్వమై ఉండేలా, కుమారుడు తనకు సమస్తాన్ని లోబరచిన దేవునికి తానే లోబడతారు.
29ఇప్పుడు పునరుత్థానం లేకపోతే, మరి మృతుల కోసం బాప్తిస్మం పొందినవారు ఏం చేస్తారు? మరణించినవారు ఎన్నటికి లేపబడకపోతే, ప్రజలు వారి కోసం ఎందుకు బాప్తిస్మం పొందుతున్నారు? 30మరి అనుక్షణం మేము ఎందుకు ప్రాణభయంతో ఉండాలి? 31సహోదరీ సహోదరులైన మీ గురించి మన ప్రభువైన యేసు క్రీస్తులో నాకు అతిశయం కలుగుతున్నట్టుగానే నేను ప్రతి రోజూ చస్తూనే ఉన్నాను. 32కాని, కేవలం మానవరీతిగా ఎఫెసులోని మృగాలతో నేను పోరాడితే నాకు లాభమేంటి? ఒకవేళ మరణించినవారు లేపబడకపోతే,
“రేపు చనిపోతాం కాబట్టి,
మనం తిని త్రాగుదాం.”#15:32 యెషయా 22:13
33మోసపోకండి: “దుష్టులతో సహవాసం మంచి ప్రవర్తనను పాడుచేస్తుంది.” 34మీరు నీతిప్రవర్తన కలిగి పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గురించి తెలియదు కాబట్టి, మీరు సిగ్గుపడాలని ఇలా చెప్తున్నాను.
పునరుత్థాన శరీరం
35“చనిపోయినవారు ఎలా లేపబడతారు? వారికి ఎలాంటి శరీరం ఉంటుంది?” అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. 36మూర్ఖుడా! నీవు ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది చనిపోతేనే తప్ప మొలకెత్తదు. 37గోధుమ గింజనైన, మరొక దానినైన నీవు భూమిలో నాటినప్పుడు విత్తనం మాత్రమే నాటావు గాని పెరిగిన మొక్క కాదు. 38అయితే దేవుడు తాను నిర్ణయించిన శరీరాన్ని దానికి ఇస్తారు. ఆయన ప్రతి ఒక్క గింజకు దాని సొంత శరీరాన్ని ఇస్తారు. 39శరీరాలన్ని ఒకేలా ఉండవు. మానవుల మాంసం వేరు, జంతువుల మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, చేపల మాంసం వేరు. 40అలాగే ఆకాశ శరీరాలు ఉన్నాయి, భూలోక శరీరాలు ఉన్నాయి; ఆకాశ శరీరాల మహిమ వేరు, భూశరీరాల మహిమ వేరు. 41సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి మహిమలో భేదం ఉంటుంది.
42మృతుల పునరుత్థానం కూడా ఇలాగే ఉంటుంది. నశించిపోయే శరీరం నాటబడి నాశనంలేనిదిగా లేపబడుతుంది. 43ఘనహీనంగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుంది; అది బలహీనమైనదిగా విత్తబడి శక్తిగలదానిగా లేపబడుతుంది. 44ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మీయ శరీరంగా లేపబడుతుంది.
ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నట్లే ఆత్మీయ శరీరం కూడ ఉంది. 45కాబట్టి “మొదటి మనిషియైన ఆదాము జీవి అయ్యాడు”#15:45 ఆది 2:7 అని వ్రాయబడింది; చివరి ఆదాము జీవాన్నిచ్చే ఆత్మ అయ్యాడు. 46ఆత్మ సంబంధమైనది మొదట రాలేదు, కాని ప్రకృతి సంబంధమైనది మొదట వచ్చింది, ఆ తర్వాతే ఆత్మ సంబంధమైనది వచ్చింది. 47మొదటి మానవుడు భూమిలోని మట్టితో చేయబడ్డాడు, రెండవ మానవుడు పరలోకానికి చెందిన వాడు. 48భూమికి చెందిన మానవునిలా భూలోక సంబంధులు ఉంటారు. పరలోకానికి చెందిన వానిలా పరలోక సంబంధులు ఉంటారు. 49మనం భూసంబంధియైన మనుష్యుని రూపాన్ని ధరించినట్లే పరలోకసంబంధమైన వాని రూపాన్ని ధరించుకుంటాము.
50సహోదరీ సహోదరులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, రక్తమాంసాలు దేవుని రాజ్య వారసత్వాన్ని పొందలేవు. నశించిపోయేది శాశ్వతమైన దానిని స్వతంత్రించుకోలేదు. 51నేను మీకు ఒక రహస్యాన్ని చెప్తాను వినండి: మనమందరం నిద్రించం గాని, మనమందరం మార్పు చెందుతాము. 52ఒక క్షణంలోనే, రెప్పపాటులో, చివరి బూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుతాము. బూర మ్రోగుతుంది, అప్పుడు మృతులు శాశ్వతమైనవారిగా లేపబడతారు, మనమందరం మార్పు చెందుతాము. 53ఎందుకంటే, నశించిపోయేది శాశ్వతమైన దాన్ని ధరించుకోవాలి, మరణించేది మరణంలేని దాన్ని ధరించుకోవాలి. 54నశించిపోయేది శాశ్వతమైన దాన్ని, మరణించేది మరణంలేని దాన్ని ధరించినపుడు, “విజయం మరణాన్ని మ్రింగివేసింది”#15:54 యెషయా 25:8 అని వ్రాయబడిన వాక్యం నిజమవుతుంది.
55“ఓ మరణమా, నీ విజయం ఎక్కడ?
ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ?”#15:55 హోషేయ 13:14
56మరణపు ముల్లు పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రమే. 57అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు.
58కాబట్టి నా ప్రియ సహోదరీ సహోదరులారా, స్థిరంగా నిలబడండి. ఏది మిమ్మల్ని కదపలేదు. ప్రభువులో మీ శ్రమ వ్యర్థం కాదని మీకు తెలుసు కాబట్టి ఎల్లప్పుడు ప్రభువు కార్యాల్లో పూర్తి శ్రద్ధ చూపండి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 కొరింథీ పత్రిక 15: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి