ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5:1-11

ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5:1-11 TERV

మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటివాళ్ళను ప్రేమిస్తూ జీవించండి. కాని మీరు వ్యభిచారాన్ని గురించి గాని, అపవిత్రతను గురించి గాని, దురాశను గురించి గాని మాట కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసుల్లో ఉండకూడదు. అంతేకాక మీరు బూతు మాటలు, అర్థంలేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యాశాపరులు, నిజానికి ఇలాంటి వాళ్ళు విగ్రహారాధకులతో సమానము, ఇలాంటి వాళ్ళు దేవుడు మరియు క్రీస్తు పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు. వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి.