ఎఫెసీయులకు 5:1-11
ఎఫెసీయులకు 5:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సర సోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి. మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి నిష్ఫలమైన అంధకారక్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి.
ఎఫెసీయులకు 5:1-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కావున, మీరు దేవుని ప్రియ పిల్లల్లా ఆయనను పోలి నడుచుకోండి. క్రీస్తు మనల్ని ప్రేమించి, పరిమళ సువాసనగా మనకొరకు తనను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొన్నట్లే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. జారత్వం, అపవిత్రత, అత్యాశ అనేవి మీ మధ్యలో ఎంత మాత్రం ఉండకూడదు, ఎందుకంటే ఇవి దేవుని పరిశుద్ధ ప్రజలకు తగినవి కావు. దేవుని పట్ల కృతజ్ఞతగల మాటలనే మాట్లాడండి, మీలో బూతు మాటలకు, మూర్ఖమైన లేదా పోకిరి మాటలకు చోటు ఉండకూడదు. వ్యభిచారులు, అపవిత్రులు, అత్యాశపడేవారు అందరు విగ్రహారాధికులే; దేవునికి మరియు క్రీస్తుకు చెందిన రాజ్యంలో వారికి వారసత్వం లేదని మీకు ఖచ్చితంగా తెలుసు. వ్యర్థమైన మాటలతో ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, ఎందుకంటే వీటిని బట్టి అవిధేయులైనవారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. గనుక అలాంటి వారితో మీరు భాగస్వాములుగా ఉండకండి. ఒకప్పుడు మీరు చీకటియై యున్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై యున్నారు. కనుక వెలుగు బిడ్డలుగా జీవించండి, ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగివుంటుంది. కనుక ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి. నిష్ఫలమైన చీకటి క్రియల్లో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి.
ఎఫెసీయులకు 5:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి. క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి. మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన. కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు. మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం. పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి వారికి దూరంగా ఉండండి. గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి. ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం. కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ, పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.
ఎఫెసీయులకు 5:1-11 పవిత్ర బైబిల్ (TERV)
మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటివాళ్ళను ప్రేమిస్తూ జీవించండి. కాని మీరు వ్యభిచారాన్ని గురించి గాని, అపవిత్రతను గురించి గాని, దురాశను గురించి గాని మాట కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసుల్లో ఉండకూడదు. అంతేకాక మీరు బూతు మాటలు, అర్థంలేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యాశాపరులు, నిజానికి ఇలాంటి వాళ్ళు విగ్రహారాధకులతో సమానము, ఇలాంటి వాళ్ళు దేవుడు మరియు క్రీస్తు పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు. వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి.
ఎఫెసీయులకు 5:1-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి మీరు దేవుని ప్రియ పిల్లల్లా ఆయనను పోలి నడుచుకోండి. క్రీస్తు మనల్ని ప్రేమించి, పరిమళ సువాసనగా మన కోసం తనను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొన్నట్లే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. లైంగిక అపవిత్రత గాని లేదా ఇతర అపవిత్రత గాని అత్యాశ గాని మీ మధ్యలో ఎంత మాత్రం ఉండకూడదు, ఎందుకంటే ఇవి దేవుని పరిశుద్ధ ప్రజలకు తగినవి కావు. దేవుని పట్ల కృతజ్ఞతగల మాటలనే మాట్లాడండి, మీలో బూతు మాటలకు, మూర్ఖపు లేదా పోకిరి మాటలకు చోటు ఉండకూడదు. వ్యభిచారులు, అపవిత్రులు, అత్యాశపడేవారు అందరు విగ్రహారాధికులే; దేవునికి క్రీస్తుకు చెందిన రాజ్యంలో వారికి వారసత్వం లేదని మీకు ఖచ్చితంగా తెలుసు. వ్యర్థమైన మాటలతో ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, ఎందుకంటే వీటిని బట్టి అవిధేయులైనవారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి అలాంటి వారితో మీరు భాగస్వాములుగా ఉండకండి. ఒకప్పుడు మీరు చీకటియై ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు బిడ్డలుగా జీవించండి, ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి. నిష్ఫలమైన చీకటి క్రియలలో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి.