ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు. ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు. వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు. మేము నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలని, వాటికి కట్టుబడాలని నీవు మాకు ఆజ్ఞాపించావు. ఆహా, నేను నీ చట్టాల ప్రకారం ప్రవర్తించేలా నా ప్రవర్తన స్థిరం అయితే ఎంత మంచిది! నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తే నాకు అవమానం కలగదు. నీ న్యాయచట్టాలను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ కట్టడలను నేను పాటిస్తాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు. యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా? నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు. నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను. యెహోవా, నీవే ఆరాధ్య దైవం. నీ నియమాలను నాకు బోధించు. నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను. సంపదలన్నిటి కంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను. నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను. నీ సేవకుణ్ణి దయ చూడు. అప్పుడు నేను సజీవంగా ఉండి నీ వాక్కు పాటిస్తాను. నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు. నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు. అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది. గర్విష్ఠులను నువ్వు గద్దిస్తున్నావు. వారు నీ ఆజ్ఞలను విడిచి తిరుగులాడే శాపగ్రస్తులు. నేను నీ నిబంధన శాసనాలకు లోబడిన వాణ్ణి. నన్ను అప్రదిష్ట, అవమానాల పాలు చెయ్య వద్దు. పాలకులు నాకు విరోధంగా కుట్ర పన్ని అపనిందలు వేసినా నీ సేవకుడు మాత్రం నీ కట్టడలను ధ్యానిస్తూనే ఉంటాడు. నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు. నా ప్రాణం మట్టి కరిచింది. నీ వాక్కుతో నన్ను బతికించు. నా ప్రవర్తనంతా నీకు చెప్పుకున్నాను. నాకు జవాబిచ్చావు. నీ కట్టడలను నాకు బోధించు. నీ ఉపదేశమార్గం నాకు బోధపరచు. అప్పుడు నీ దివ్యోపదేశాన్ని నేను నెమరు వేసుకుంటాను. విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది. నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు. మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి. దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు. విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను. నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనాలను అంటి పెట్టుకుని ఉన్నాను. నన్ను సిగ్గుపాలు చెయ్యవద్దు. నా హృదయాన్ని నీవు విశాలం చేస్తే నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతాను. యెహోవా, నీ శాసనాలను అనుసరించడం నాకు నేర్పు. అప్పుడు నేను కడదాకా వాటిని పాటిస్తాను. నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి. అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను. నీ ఆజ్ఞల జాడల్లో నన్ను నడిపించు. వాటి ప్రకారం నడుచుకోవడం నాకెంతో ఆనందం. నా హృదయాన్ని నీ శాసనాలవైపు తిప్పు. అక్రమ లాభం నుండి నన్ను విముఖుణ్ణి చెయ్యి. పనికిమాలిన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివెయ్యి. నీ మార్గాల్లో నాకు ఊపిరి పొయ్యి. నిన్ను కొలిచే వారికి నీవిచ్చిన వాగ్దానం నీ సేవకుని పట్ల నెరవేర్చు. నీ న్యాయవిధులు మంచివి. నాకు భయం గొలుపుతున్న నా అవమానాన్ని తీసివెయ్యి. నీ ఉపదేశాల కోసం తహతహలాడుతున్నాను. న్యాయమైన నీ విమోచన మూలంగా నన్ను సజీవంగా ఉంచు. యెహోవా, విఫలం కాని నీ ప్రేమను నాకు అనుగ్రహించు. నీ వాగ్దానం చొప్పున నీ రక్షణ కలిగించు. అప్పుడు నన్ను హేళన చేసే వారికి నేను జవాబు చెప్పగలుగుతాను. ఎందుకంటే నీ మాటపై నమ్మకం ఉంచాను. నా నోటినుండి సత్య వాక్కును ఏమాత్రం తీసి వేయకు. ఎందుకంటే నేను నీ న్యాయవిధుల మీద నా ఆశ పెట్టుకున్నాను. ఎడతెగక నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను. నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను. సిగ్గుపడక రాజుల ఎదుట నీ పవిత్ర శాసనాలను గూర్చి నేను మాట్లాడతాను. నీ ఆజ్ఞల్లో నేను హర్షిస్తాను. అవి నాకు అతి ప్రియం. నాకు ఎంతో ఇష్టమైన నీ ఆజ్ఞలవైపు నా చేతులెత్తుతాను. నీ కట్టడలను నేను ధ్యానిస్తాను. నీ సేవకుడికి నీవు దయచేసిన మాట జ్ఞాపకం చేసుకో. దానివలన నీవు నాలో ఆశాభావం రేకెత్తించావు. నీ వాక్కు నన్ను బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు ఉపశమనం కలిగిస్తున్నది. గర్విష్ఠులు నన్ను ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేశారు. అయినా నీ ధర్మశాస్త్రాన్నుండి నేను తొలగలేదు. యెహోవా, పూర్వకాలంనుండి ఉన్న నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందాను. నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూస్తే నాకు పట్టరాని కోపం పుడుతున్నది. యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు. యెహోవా, రాత్రివేళ నీ నామాన్ని స్మరణ చేస్తున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా అనుగ్రహించావు. యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను. కటాక్షం చూపమని నా పూర్ణహృదయంతో నిన్ను బతిమాలుకుంటున్నాను. నీవిచ్చిన మాట ప్రకారం నన్ను కరుణించు. నా మార్గాలు నేను పరిశీలన చేశాను. నీ శాసనాలవైపు నా ముఖం తిప్పుకున్నాను. నీ ఆజ్ఞలను పాటించడానికి నేను జాగుచేయక వేగిరపడ్డాను. భక్తిహీనుల పాశాలు నన్ను చుట్టుకుని ఉన్నా నీ ధర్మశాస్త్రాన్ని నేను విస్మరించ లేదు. న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్థరాత్రివేళ నేను నిద్ర లేస్తున్నాను. నీపట్ల భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశాలను అనుసరించే వారికీ నేను నెచ్చెలిని. యెహోవా, భూమి నీ నిబంధన విశ్వాస్యతతో నిండి ఉంది. నీ కట్టడలను నాకు బోధించు. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేశావు. నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్చు. బాధ కలగక మునుపు నేను దారి విడిచాను. ఇప్పుడు నీ వాక్కు ననుసరించి నడుచుకుంటున్నాను. నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధించు. గర్విష్ఠులు నా మీద అబద్ధాలు అల్లుతున్నారు. అయితే పూర్ణహృదయంతో నేను నీ ఉపదేశాలను అనుసరిస్తాను. వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది. నేను నీ ధర్మశాస్త్రాన్నిబట్టి ఆనందిస్తున్నాను. బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను. వేవేల వెండి బంగారు నాణాలకంటే నీ విచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు.
Read కీర్తన 119
వినండి కీర్తన 119
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తన 119:1-72
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు