కీర్తనలు 119:1-72
కీర్తనలు 119:1-72 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు. ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడియుండిన నెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము. యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్దిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతు లను చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను భూమిమీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము. నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నామీదికి రాకుండ నిందను తిరస్కారమును తొల గింపుము. అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాట లాడుకొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను. వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను నీ న్యాయవిధులను నేను నాయెదుట పెట్టుకొని యున్నాను యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని యున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ చేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకా రము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము. లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృద యము త్రిప్పుము. వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికిం పుము. నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయ గలను ఏలయనగా నీమాట నమ్ముకొనియున్నాను. నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసి వేయకుము నీ న్యాయవిధులమీద నా ఆశ నిలిపియున్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును నేను నిత్యము దాని ననుసరించుదును నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును సిగ్గుపడక రాజులయెదుట నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను. నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతు లెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసికొనుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు. నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రమునుండి నేను తొలగక యున్నాను. యెహోవా, పూర్వకాలమునుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసికొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణచేయు చున్నాను నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది. యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను. కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలనచేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని. భక్తిహీనులపాశములు నన్ను చుట్టుకొని యున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను. నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలి కాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా, నీ మాటచొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమకలుగకమునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను. నీవు దయాళుడవై మేలుచేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశ ములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమునుబట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను. వేలకొలది వెండి బంగారు నాణెములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.
కీర్తనలు 119:1-72 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు. ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు. వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు. మేము నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలని, వాటికి కట్టుబడాలని నీవు మాకు ఆజ్ఞాపించావు. ఆహా, నేను నీ చట్టాల ప్రకారం ప్రవర్తించేలా నా ప్రవర్తన స్థిరం అయితే ఎంత మంచిది! నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తే నాకు అవమానం కలగదు. నీ న్యాయచట్టాలను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ కట్టడలను నేను పాటిస్తాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు. యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా? నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు. నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను. యెహోవా, నీవే ఆరాధ్య దైవం. నీ నియమాలను నాకు బోధించు. నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను. సంపదలన్నిటి కంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను. నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను. నీ సేవకుణ్ణి దయ చూడు. అప్పుడు నేను సజీవంగా ఉండి నీ వాక్కు పాటిస్తాను. నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు. నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు. అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది. గర్విష్ఠులను నువ్వు గద్దిస్తున్నావు. వారు నీ ఆజ్ఞలను విడిచి తిరుగులాడే శాపగ్రస్తులు. నేను నీ నిబంధన శాసనాలకు లోబడిన వాణ్ణి. నన్ను అప్రదిష్ట, అవమానాల పాలు చెయ్య వద్దు. పాలకులు నాకు విరోధంగా కుట్ర పన్ని అపనిందలు వేసినా నీ సేవకుడు మాత్రం నీ కట్టడలను ధ్యానిస్తూనే ఉంటాడు. నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు. నా ప్రాణం మట్టి కరిచింది. నీ వాక్కుతో నన్ను బతికించు. నా ప్రవర్తనంతా నీకు చెప్పుకున్నాను. నాకు జవాబిచ్చావు. నీ కట్టడలను నాకు బోధించు. నీ ఉపదేశమార్గం నాకు బోధపరచు. అప్పుడు నీ దివ్యోపదేశాన్ని నేను నెమరు వేసుకుంటాను. విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది. నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు. మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి. దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు. విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను. నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనాలను అంటి పెట్టుకుని ఉన్నాను. నన్ను సిగ్గుపాలు చెయ్యవద్దు. నా హృదయాన్ని నీవు విశాలం చేస్తే నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతాను. యెహోవా, నీ శాసనాలను అనుసరించడం నాకు నేర్పు. అప్పుడు నేను కడదాకా వాటిని పాటిస్తాను. నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి. అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను. నీ ఆజ్ఞల జాడల్లో నన్ను నడిపించు. వాటి ప్రకారం నడుచుకోవడం నాకెంతో ఆనందం. నా హృదయాన్ని నీ శాసనాలవైపు తిప్పు. అక్రమ లాభం నుండి నన్ను విముఖుణ్ణి చెయ్యి. పనికిమాలిన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివెయ్యి. నీ మార్గాల్లో నాకు ఊపిరి పొయ్యి. నిన్ను కొలిచే వారికి నీవిచ్చిన వాగ్దానం నీ సేవకుని పట్ల నెరవేర్చు. నీ న్యాయవిధులు మంచివి. నాకు భయం గొలుపుతున్న నా అవమానాన్ని తీసివెయ్యి. నీ ఉపదేశాల కోసం తహతహలాడుతున్నాను. న్యాయమైన నీ విమోచన మూలంగా నన్ను సజీవంగా ఉంచు. యెహోవా, విఫలం కాని నీ ప్రేమను నాకు అనుగ్రహించు. నీ వాగ్దానం చొప్పున నీ రక్షణ కలిగించు. అప్పుడు నన్ను హేళన చేసే వారికి నేను జవాబు చెప్పగలుగుతాను. ఎందుకంటే నీ మాటపై నమ్మకం ఉంచాను. నా నోటినుండి సత్య వాక్కును ఏమాత్రం తీసి వేయకు. ఎందుకంటే నేను నీ న్యాయవిధుల మీద నా ఆశ పెట్టుకున్నాను. ఎడతెగక నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను. నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను. సిగ్గుపడక రాజుల ఎదుట నీ పవిత్ర శాసనాలను గూర్చి నేను మాట్లాడతాను. నీ ఆజ్ఞల్లో నేను హర్షిస్తాను. అవి నాకు అతి ప్రియం. నాకు ఎంతో ఇష్టమైన నీ ఆజ్ఞలవైపు నా చేతులెత్తుతాను. నీ కట్టడలను నేను ధ్యానిస్తాను. నీ సేవకుడికి నీవు దయచేసిన మాట జ్ఞాపకం చేసుకో. దానివలన నీవు నాలో ఆశాభావం రేకెత్తించావు. నీ వాక్కు నన్ను బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు ఉపశమనం కలిగిస్తున్నది. గర్విష్ఠులు నన్ను ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేశారు. అయినా నీ ధర్మశాస్త్రాన్నుండి నేను తొలగలేదు. యెహోవా, పూర్వకాలంనుండి ఉన్న నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందాను. నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూస్తే నాకు పట్టరాని కోపం పుడుతున్నది. యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు. యెహోవా, రాత్రివేళ నీ నామాన్ని స్మరణ చేస్తున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా అనుగ్రహించావు. యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను. కటాక్షం చూపమని నా పూర్ణహృదయంతో నిన్ను బతిమాలుకుంటున్నాను. నీవిచ్చిన మాట ప్రకారం నన్ను కరుణించు. నా మార్గాలు నేను పరిశీలన చేశాను. నీ శాసనాలవైపు నా ముఖం తిప్పుకున్నాను. నీ ఆజ్ఞలను పాటించడానికి నేను జాగుచేయక వేగిరపడ్డాను. భక్తిహీనుల పాశాలు నన్ను చుట్టుకుని ఉన్నా నీ ధర్మశాస్త్రాన్ని నేను విస్మరించ లేదు. న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్థరాత్రివేళ నేను నిద్ర లేస్తున్నాను. నీపట్ల భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశాలను అనుసరించే వారికీ నేను నెచ్చెలిని. యెహోవా, భూమి నీ నిబంధన విశ్వాస్యతతో నిండి ఉంది. నీ కట్టడలను నాకు బోధించు. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేశావు. నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్చు. బాధ కలగక మునుపు నేను దారి విడిచాను. ఇప్పుడు నీ వాక్కు ననుసరించి నడుచుకుంటున్నాను. నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధించు. గర్విష్ఠులు నా మీద అబద్ధాలు అల్లుతున్నారు. అయితే పూర్ణహృదయంతో నేను నీ ఉపదేశాలను అనుసరిస్తాను. వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది. నేను నీ ధర్మశాస్త్రాన్నిబట్టి ఆనందిస్తున్నాను. బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను. వేవేల వెండి బంగారు నాణాలకంటే నీ విచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు.
కీర్తనలు 119:1-72 పవిత్ర బైబిల్ (TERV)
పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు. ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు. యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు. వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు. ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు. వారు యెహోవాకు విధేయులవుతారు. యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు. ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు. యెహోవా, నేను నీ ఆజ్ఞలకు ఎల్లప్పుడూ విధేయుడనౌతాను, అప్పుడు నేను నీ ఆజ్ఞలను ఎప్పుడు చదివినా సిగ్గుపడను. అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను. యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను. కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము! యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు? నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే. నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను. దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము. నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను. ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను యెహోవా, నీకే స్తుతి. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను. ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను. నీ నియమాలను నేను చర్చిస్తాను. నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను. నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను. నీ మాటలు నేను మరచిపోను. నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము. తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను. యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను. ఈ దేశంలో నేను పరాయివాణ్ణి. యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము. నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి చదవాలని కోరుతున్నాను. యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు. ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి. నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు. నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు. నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను. నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు. అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను. నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు. అది నాకు మంచి సలహా ఇస్తుంది. నేను త్వరలోనే చనిపోతాను. యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము. నా జీవితం గూర్చి నేను నీతో చెప్పాను. నీవు నాకు జవాబు ఇచ్చావు. ఇప్పుడు నాకు నీ న్యాయ చట్టాలు నేర్పించు. యెహోవా, నీ న్యాయ చట్టాలు గ్రహించుటకు నాకు సహాయం చేయుము. నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము. నేను అలసిపోయి విచారంగా ఉన్నాను. ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము. యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకుము, నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము. యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని కోరుకొన్నాను. జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను జాగ్రత్తగా చదువుతాను. యెహోవా, నేను నీ ఒడంబడికకు కట్టుబడతాను. నన్ను నిరాశ పరచవద్దు. నేను నీ ఆజ్ఞలవైపు పరుగెత్తి విధేయుడనవుతాను. యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను ఎంతో సంతోష పెడతాయి. యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము. నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను. గ్రహించుటకు నాకు సహాయం చేయుము. నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను. నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను. యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు. నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను. నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, అయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము. నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము. నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు. యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు. జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి. చూడుము, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను. నా యెడల మంచితనం చూపించి నన్ను బ్రతుకనిమ్ము. యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము. నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము. అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది. యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను. నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను. యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను. అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను. ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక. యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను. వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను. యెహోవా, నీ ఆజ్ఞలను చదవటము నాకు ఆనందం. ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ. యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను. మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను. యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము. ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది. నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి. నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు. కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు. జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను. యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి. నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. నీ న్యాయ చట్టాలు నా ఇంటివద్ద పాడుకొనే పాటలు. యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను. నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను. నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను కనుక నాకు ఈలాగు జరుగుతుంది. యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను. యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను. నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము. నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను. మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను. ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను. దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు. అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు. నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను. నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను. నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను. యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు. నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు. యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు. నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను. నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను. కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను. దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు. కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను. ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు. నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం. శ్రమపడటం నాకు మంచిది. నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను. యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి. వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.
కీర్తనలు 119:1-72 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నిందారహిత మార్గాలను అనుసరిస్తూ, యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. ఆయన శాసనాలను పాటిస్తూ తమ హృదయమంతటితో ఆయనను వెదకేవారు ధన్యులు, వారు అన్యాయం చేయక ఆయన మార్గాలను అనుసరిస్తారు. అత్యంత జాగ్రత్తగా పాటించాలని మీరు వారికి శాసనాలిచ్చారు. మీ శాసనాలను అనుసరించుటలో నా మార్గాలు సుస్థిరమై ఉంటే ఎంత బాగుండేది! అప్పుడు మీ ఆజ్ఞలను లక్ష్యపెట్టినప్పుడు నేను అవమానపాలు కాను. నేను మీ నీతి న్యాయవిధులను తెలుసుకున్న కొలది యథార్థ హృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను. నేను మీ శాసనాలకు లోబడతాను. దయచేసి నన్ను పూర్తిగా ఎడబాయకండి. యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు? మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే. నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను; మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి. నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను. యెహోవా, మీకు స్తుతి కలుగును గాక; మీ శాసనాలను నాకు బోధించండి. మీ నోట నుండి వచ్చే న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరిస్తాను. ఒకడు గొప్ప ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించునట్లు నేను మీ శాసనాలను పాటించడంలో సంతోషిస్తాను. మీ శాసనాలను నేను ధ్యానిస్తాను మీ మార్గాలను పరిగణిస్తాను. మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను. నేను బ్రతికి ఉండి మీ వాక్యానికి లోబడేలా, మీ సేవకునిపట్ల దయగా ఉండండి. మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన వాటిని నేను చూడగలిగేలా నా కళ్లు తెరవండి. ఈ లోకంలో నేను అపరిచితున్ని; మీ ఆజ్ఞలను నా నుండి దాచిపెట్టకండి. అన్నివేళల్లో మీ న్యాయవిధుల కోసం తపిస్తూ నా ప్రాణం క్షీణించిపోతుంది. శపించబడినవారైన అహంకారులను మీరు గద్దిస్తారు, వారు మీ ఆజ్ఞల నుండి తొలగిపోయినవారు. నేను మీ శాసనాలను పాటిస్తున్నాను, వారి అపహాస్యాన్ని ధిక్కారాన్ని నా నుండి తొలగించండి. పాలకులు కలిసి కూర్చుని నన్ను అపవాదు చేసినప్పటికీ, మీ సేవకుడు మీ శాసనాలను ధ్యానిస్తాడు. మీ శాసనాలే నాకు ఆనందం; అవి నాకు ఆలోచన చెప్తాయి. నేను నేల మీద పడిపోయాను; మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. నా జీవిత పరిస్థితులను మీకు వివరించాను, మీరు నాకు జవాబిచ్చారు; మీ శాసనాలు నాకు బోధించండి. నేను మీ కట్టడల అర్థాన్ని గ్రహించేలా చేయండి, తద్వారా మీ అద్భుత కార్యాలను నేను ధ్యానిస్తాను. దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది; మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి. మోసపూరిత మార్గాల నుండి నన్ను తప్పించండి; నా మీద దయచూపి మీ ధర్మశాస్త్రం నాకు బోధించండి. నేను నమ్మకత్వం అనే మార్గం ఎంచుకున్నాను; మీ న్యాయవిధులపై నా హృదయాన్ని నిలుపుకున్నాను. యెహోవా, మీ శాసనాలను గట్టిగా పట్టుకుని ఉంటాను; నాకు అవమానం కలగనివ్వకండి. మీ ఆజ్ఞల మార్గాన నేను పరుగెడతాను, ఎందుకంటే మీరు నా గ్రహింపును విశాలపరిచారు. యెహోవా, మీ శాసనాల విధానాన్ని నాకు బోధించండి, అంతం వరకు నేను వాటిని అనుసరిస్తాను. మీ ధర్మశాస్త్రం నేను అనుసరించేలా హృదయపూర్వకంగా వాటికి విధేయత చూపేలా, నాకు గ్రహింపు దయచేయండి. మీ ఆజ్ఞల మార్గాన నన్ను నడిపించండి, అక్కడే నాకు ఆనందము. నా హృదయాన్ని అన్యాయపు లాభం వైపు కాక మీ శాసనాల వైపుకు త్రిప్పండి. పనికిరాని వాటినుండి నా కళ్లను త్రిప్పండి; మీ మార్గాల ద్వార నా జీవితాన్ని కాపాడండి. మీ సేవకునిపట్ల మీ మాటను నెరవేర్చండి, తద్వారా ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు. నాకు భయం కలిగిస్తున్న అవమానాన్ని తొలగించండి, ఎందుకంటే మీ న్యాయవిధులు మేలైనవి. మీ కట్టడల కోసం నేను ఎంతగా తహతహ లాడుతున్నాను! మీ నీతిలో నా జీవితాన్ని కాపాడండి. యెహోవా, మీ మారని ప్రేమ, మీ వాగ్దాన ప్రకారం, మీ రక్షణ నాకు వచ్చును గాక. అప్పుడు నన్ను నిందించే వారెవరికైనా నేను సమాధానం చెప్పగలను, ఎందుకంటే మీ మాట మీద నాకు నమ్మకము. మీ సత్య వాక్యాన్ని ఎప్పుడూ నా నోటి నుండి తీసివేయకండి, ఎందుకంటే నేను మీ న్యాయవిధులలో నా నిరీక్షణ ఉంచాను. నేను ఎల్లప్పుడు అంటే నిరంతరం, మీ ధర్మశాస్త్రానికి లోబడతాను. నేను మీ కట్టడలను వెదికాను, కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను. రాజుల ఎదుట కూడా నేను మీ శాసనాల గురించి మాట్లాడతాను నేను సిగ్గుపడను, నేను మీ ఆజ్ఞలలో ఆనందిస్తాను ఎందుకంటే అవంటే నాకు ప్రేమ. నేను ప్రేమించే మీ ఆజ్ఞల వైపు నా చేతులెత్తుతాను, తద్వారా నేను మీ శాసనాలను ధ్యానిస్తాను. మీ సేవకునికి మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మీరు నాకు నిరీక్షణ కలిగించారు. నా శ్రమలో నా ఆదరణ ఇదే: మీ వాగ్దానం నన్ను బ్రతికిస్తుంది. అహంకారులు కనికరం లేకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు, కాని నేను మీ ధర్మశాస్త్రం నుండి తిరిగిపోను. యెహోవా, మీ అనాది న్యాయవిధులు నాకు జ్ఞాపకం ఉన్నాయి, వాటిలో నాకెంతో ఆదరణ. మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన దుష్టులను బట్టి, నాకు చాలా కోపం వస్తుంది. నేను ఎక్కడ బస చేసినా మీ శాసనాలే నా పాటల సారాంశము. యెహోవా, నేను నీ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి రాత్రివేళ మీ పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను మీ కట్టడలకు విధేయత చూపుతాను ఇది నాకు అభ్యాసంగా ఉన్నది. యెహోవా, మీరే నా వాటా; మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను. నేను నా హృదయపూర్వకంగా మీ దయ కోసం వెదికాను; మీ వాగ్దానం మేరకు నా మీద దయచూపండి. నేను నా మార్గాలను గమనించి నా అడుగులను మీ శాసనాల వైపుకు త్రిప్పుకున్నాను. మీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను ఆలస్యం చేయకుండ త్వరపడతాను. దుష్టులు నన్ను త్రాళ్లతో ఉచ్చులా బిగించినా, నేను మీ ధర్మశాస్త్రం మరచిపోను. మీ నీతిగల న్యాయవిధులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి నేను మధ్యరాత్రి లేస్తున్నాను. మీకు భయపడేవారందరికి, మీ కట్టడలను అనుసరించే వారందరికి నేను స్నేహితుడను. యెహోవా, ఈ లోకమంతా మీ మారని ప్రేమ చేత నిండి ఉంది; మీ శాసనాలు నాకు బోధించండి. యెహోవా, మీ మాట ప్రకారం మీ సేవకునికి మేలు చేయండి. నేను మీ ఆజ్ఞలను నమ్ముకున్నాను, నాకు సరియైన వివేచనను గ్రహింపును బోధించండి. నాకు బాధ కలుగకముందు నేను త్రోవ తప్పి తిరిగాను, కాని ఇప్పుడు నేను మీ వాక్కుకు లోబడుతున్నాను. మీరు మంచివారు, మీరు మంచి చేస్తారు; మీ శాసనాలు నాకు బోధించండి. అహంకారులు నన్ను అబద్ధాలతో అరిచినప్పటికీ, నేను హృదయపూర్వకంగా మీ కట్టడలను అనుసరిస్తాను. వారి హృదయాలు క్రొవ్వులా మందగించాయి, కాని నేను మీ ధర్మశాస్త్రంలోనే ఆనందిస్తాను. నాకు బాధ కలగడం మేలైంది తద్వారా నేను మీ శాసనాలు నేర్చుకోగలను. వేలాది వెండి బంగారు నాణేలకంటే మీ నోట నుండి వచ్చిన ధర్మశాస్త్రం నాకు అమూల్యమైనది.