కీర్తన 107:1-22

కీర్తన 107:1-22 IRVTEL

యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించిన వారూ, తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానాదేశాల నుండి ఆయన పోగు చేసినవారూ ఆ మాట పలుకుతారు గాక. వారు అరణ్యమార్గాల్లో ఎడారి త్రోవల్లో తిరుగులాడుతూ ఉండే వారు. నివాస పురమేదీ వారికి దొరకలేదు. ఆకలి దప్పుల వల్ల వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లిపోయింది. వారు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు. వారొక నివాస పురం చేరేలా చక్కని దారిలో ఆయన వారిని నడిపించాడు. ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు. చీకటిలో మసక చీకటిలో కొందరు బాధతో, ఇనప గొలుసులతో బంధితులై కూర్చున్నారు. దేవుని మాటపై తిరుగుబాటు చేసినందువల్ల, మహోన్నతుని సూచనలను త్రోసిపుచ్చినందువల్ల ఇది జరిగింది. కడగండ్ల మూలంగా ఆయన వారి హృదయాలను లొంగదీశాడు. వారు తొట్రుపడినప్పుడు ఆదుకునేవాడు లేకపోయాడు. కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి దురవస్థలోనుండి వారిని విడిపించాడు వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండి, మరణాంధకారంలో నుండి వారిని బయటికి రప్పించాడు. ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఎందుకంటే ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనపగడియలను విరగగొట్టాడు. బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేత, తమ దోషం చేత, బాధ కొనితెచ్చుకుంటారు. భోజనపదార్థాలన్నీ వారి ప్రాణానికి అసహ్యమై పోతాయి. వారు మరణద్వారాలను సమీపిస్తారు. కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాడు. ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురు గాక.