మార్కు 1:1-20

మార్కు 1:1-20 IRVTEL

దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించిన సువార్త ఆరంభం. యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది, “ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు. ‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి, ఆయన దారులు తిన్నగా చేయండి’ అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.” యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు. యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు. యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం. యోహాను, “నాకంటే శక్తి గలవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను” అని ప్రకటించాడు. “నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు” అన్నాడు. యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం.” వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు. యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ, “కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి” అని ప్రకటించాడు. ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, జాలరులైన సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వలవేయడం చూశాడు. యేసు, “నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని వారితో అన్నాడు. వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు. ఆయన ఇంకా కొంతదూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబునూ, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు. వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు.