అపొస్తలుల కార్యములు 7:44-60

అపొస్తలుల కార్యములు 7:44-60 IRVTEL

మోషే చూసిన నమూనా చొప్పున సాక్షపు గుడారం చేయాలని దేవుడు అతనితో మాట్లాడి ఆజ్ఞాపించాడు. ఆ సాక్షపు గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉండేది. మన పూర్వీకులు దాన్ని తీసుకుని, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనాలను వారు స్వాధీనపర్చుకున్నప్పుడు, యెహోషువతో కూడ ఈ దేశంలోకి దాన్ని తీసుకొచ్చారు. అది దావీదు కాలం వరకూ ఉంది. దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు దేవునికి నివాస స్థలాన్ని నిర్మించాలని ఆశించాడు. కాని సొలొమోను మందిరం కట్టించాడు. “అయితే, ప్రవక్త చెప్పినట్టుగా సర్వోన్నతుడు మనుషుల చేతులతో చేసిన ఇళ్ళలో నివసించడు. ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా చేతిపనులు కావా? అని ప్రభువు అడుగుతున్నాడు.’ “మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేని వారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పూర్వీకులు ఏ ప్రవక్తను హింసించకుండా ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందే తెలియజేసిన వారిని చంపేశారు. ఆయనను కూడా మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు గాని దాన్ని మీరే పాటించలేదు” అని చెప్పాడు. మహాసభ వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తెఫనును చూసి పళ్ళు కొరికారు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశం వైపు తదేకంగా చూస్తూ, దేవుని తేజస్సును చూశాడు. దేవుని కుడి పక్కన యేసు నిలబడి ఉండడం చూసి “ఆకాశం తెరుచుకోవడం, మనుష్య కుమారుడు దేవుని కుడి పక్క నిలిచి ఉండడం చూస్తున్నాను” అని పలికాడు. అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకుని మూకుమ్మడిగా అతని మీదికి వచ్చి అతనిని పట్టణం బయటకు ఈడ్చుకు పోయి, రాళ్ళతో కొట్టారు. సాక్షులు సౌలు అనే యువకుని పాదాల దగ్గర తమ పైబట్టలు పెట్టారు. వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును పిలుస్తూ, “యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో” అని చెప్పాడు. అతడు మోకరించి, “ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు” అని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.

అపొస్తలుల కార్యములు 7:44-60 కోసం వీడియో