అపొస్తలుల కార్యములు 7
7
1ప్రధాన యాజకుడు “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు.
మహాసభ ఎదుట స్తెఫను ప్రసంగం: ఇశ్రాయేలు చరిత్ర
2అందుకు స్తెఫను చెప్పింది ఏమంటే, “సోదరులారా, తండ్రులారా, వినండి. మన పూర్వికుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసపటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై 3‘నీవు నీ దేశాన్నీ, నీ సొంతజనాన్నీ విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు’ అని చెప్పాడు.
4“అప్పుడతడు కల్దీయుల దేశాన్ని విడిచి వెళ్ళి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడతన్ని తీసుకొచ్చాడు. 5ఆయన ఇందులో అతనికి కనీసం కాలుపెట్టేంత స్థలం కూడా సొంత భూమిగా ఇవ్వకుండా, అతడికి సంతానం లేనపుడు అతనికీ, అతని తరువాత అతని సంతానానికీ దీన్ని స్వాధీనం చేస్తానని వాగ్దానం చేశాడు.
6“అయితే దేవుడు అతని సంతానం పరాయి దేశంలో కొంతకాలం ఉంటారనీ, ఆ దేశస్థులు వారిని 400 ఏళ్ళు బానిసలుగా బాధపెడతారనీ చెప్పాడు. 7అంతేగాక వారు బానిసలుగా ఉండబోతున్న ఆ దేశాన్ని తాను శిక్షిస్తాననీ ఆ తరువాత వారు బయటికి వచ్చి ఈ స్థలం లో తనను ఆరాధిస్తారనీ దేవుడు చెప్పాడు. 8ఆయన అబ్రాహాముకు సున్నతితో కూడిన ఒక నిబంధనను ఇచ్చాడు. అతడు ఇస్సాకును కని ఎనిమిదవ రోజున సున్నతి చేశాడు. ఇస్సాకు యాకోబును, యాకోబు పన్నెండుమంది గోత్ర మూలపురుషులనూ కని వాళ్లకి సున్నతి చేశారు.
9“ఆ గోత్రకర్తలు అసూయతో యోసేపును ఐగుప్తులోకి అమ్మేశారు గాని, దేవుడతనికి తోడుగా ఉండి 10అతడి బాధలన్నిటిలో నుండి తప్పించాడు. ఐగుప్తు రాజైన ఫరో ముందు అతనికి దయనూ జ్ఞానాన్నీ అనుగ్రహించాడు. ఫరో ఐగుప్తు మీదా తన ఇల్లంతటి మీదా అతనిని అధికారిగా నియమించాడు. 11ఆ తరువాత ఐగుప్తు దేశమంతటి మీదా, కనాను దేశమంతటి మీదా తీవ్రమైన కరువూ, గొప్ప బాధలూ వచ్చాయి. కాబట్టి మన పితరులకు ఆహారం దొరకలేదు. 12ఐగుప్తులో తిండి గింజలున్నాయని యాకోబు తెలుసుకుని మన పూర్వీకులను అక్కడికి మొదటిసారి పంపాడు. 13వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తనను తాను తెలియజేసుకున్నాడు. అప్పుడు యోసేపు కుటుంబం గురించి ఫరోకు తెలిసింది.
14“యోసేపు తన తండ్రి యాకోబునూ, తన సొంత వారందరినీ పిలిపించాడు. వారు మొత్తం 75 మంది. 15యాకోబు ఐగుప్తు వెళ్ళాడు. అతడూ మన పితరులూ అక్కడే చనిపోయారు. 16వారిని షెకెము అనే ఊరికి తెచ్చి హమోరు సంతతి దగ్గర అబ్రాహాము వెల ఇచ్చి కొన్న సమాధిలో ఉంచారు. 17అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన సమయం దగ్గరపడే కొద్దీ ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి చెందారు. 18చివరికి యోసేపును గూర్చి తెలియని వేరొక రాజు ఐగుప్తులో అధికారానికి వచ్చేవరకూ అలా జరిగింది. 19ఆ రాజు మన జాతి ప్రజలని మోసగించి, వారికి పుట్టిన పిల్లలు బతక్కుండా వారిని బయట పారేసేలా మన పూర్వీకులను బాధించాడు.
20“ఆ రోజుల్లో మోషే పుట్టాడు. అతడు చాలా అందగాడు. తన తండ్రి ఇంట్లో మూడు నెలలు పెరిగాడు. 21అతనిని బయట పారేస్తే ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకుని తన స్వంత కుమారుడిగా పెంచుకుంది. 22మోషే ఐగుప్తీయుల అన్ని విద్యలూ నేర్చుకుని, మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. 23అతనికి సుమారు నలభై ఏళ్ళ వయసప్పుడు ఇశ్రాయేలీయులైన తన స్వంత ప్రజలను చూడాలని నిశ్చయించుకున్నాడు. 24అప్పుడు వారిలో ఒకడు అన్యాయానికి గురి కావడం చూసి, అతనిని కాపాడి అతడి పక్షాన ఆ ఐగుప్తు వాణ్ణి చంపి ప్రతీకారం చేశాడు. 25తన ద్వారా తన ప్రజను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతి తన ప్రజలు గ్రహిస్తారని అతడనుకున్నాడు గాని వారు గ్రహించలేదు.
26“ఆ తరువాత రోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అతడు వారిని చూసి, ‘అయ్యలారా, మీరు సోదరులు. మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు’ అని వారికి సర్ది చెప్పాలని చూశాడు. 27అయితే తన పొరుగువాడికి అన్యాయం చేసినవాడు, ‘మామీద అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్నెవరు నియమించారు? 28నిన్న ఐగుప్తు వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకుంటున్నావా?’ అని చెప్పి అతణ్ణి నెట్టేశాడు. 29మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో విదేశీయుడుగా ఉంటూ, అక్కడే ఇద్దరు కొడుకులను కన్నాడు. 30నలభై ఏళ్ళయిన తరువాత సీనాయి పర్వతారణ్యంలో, ఒక పొదలోని మంటల్లో దేవదూత అతనికి కనిపించాడు. 31మోషే అది చూసి ఆ దర్శనానికి ఆశ్చర్యపడి దాన్ని స్పష్టంగా చూడ్డానికి దగ్గరికి వచ్చినపుడు 32‘నేను నీ పూర్వీకుల దేవుణ్ణి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి’ అన్న ప్రభువు మాట వినబడింది. మోషే వణికిపోతూ, అటు చూడడానికి సాహసించలేక పోయాడు. 33ప్రభువు అతనితో ఇలా అన్నాడు, ‘నీ చెప్పులు తీసివెయ్యి. నీవు నిలబడిన చోటు పవిత్ర స్థలం. 34ఐగుప్తులో ఉన్న నా ప్రజల యాతన చూశాను. వారి మూలుగులు విన్నాను. వారిని విడిపించడానికి దిగి వచ్చాను. రా, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుతాను.’
35“‘మాపై అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్ను నియమించినవాడు ఎవడు?’ అని వారు నిరాకరించిన ఈ మోషేను, అతనికి పొదలో కనబడిన దూత ద్వారా దేవుడు అధికారిగా విమోచకునిగా నియమించి పంపాడు. 36మోషే ఐగుప్తులో, ఎర్రసముద్రంలో, అరణ్యంలో నలభై ఏళ్ళు అనేక అద్భుతాలనూ మహత్కార్యాలనూ సూచక క్రియలనూ చేసి వారిని ఐగుప్తు నుండి తోడుకుని వచ్చాడు.
37‘నాలాటి ఒక ప్రవక్తను దేవుడు మీ సోదరుల్లో నుండి లేవనెత్తుతాడు’
అని ఇశ్రాయేలీయులతో చెప్పింది ఈ మోషేనే. 38సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దూతతోనూ మన పూర్వీకులతోనూ అరణ్యంలోని సంఘంలో ఉన్నదీ మనకు ఇవ్వడానికి జీవవాక్యాలను తీసుకున్నదీ ఇతడే.
ఇశ్రాయేలు అపనమ్మకం
39“మన పూర్వీకులు లోబడకుండా తిరస్కరించిన వ్యక్తి ఇతడే. వారు అతనిని తోసిపుచ్చి తమ హృదయాల్లో ఐగుప్తుకు తిరిగారు. 40అప్పుడు వారు ‘మా ముందర నడిచే దేవుళ్ళను మాకోసం ఏర్పాటు చెయ్యి. ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు’ అని అహరోనుతో అన్నారు. 41ఆ రోజుల్లో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహానికి బలి అర్పించి, తమ చేతులతో చేసిన పనిలో ఆనందించారు. 42అందుకని దేవుడు ఆకాశ సమూహాలను పూజించడానికి వారిని విడిచిపెట్టేశాడు. ప్రవక్తల గ్రంథంలో రాసి ఉన్నట్టుగా
‘ఇశ్రాయేలీయులారా,
నలభై ఏళ్ళు మీరు అరణ్యంలో
వధించిన పశువులనూ, బలులనూ నాకు అర్పించారా?
43మీరు చేసుకున్న ప్రతిమలను అంటే మొలెకు గుడారాన్నీ,
రెఫాను అనే శని దేవుడి నక్షత్రాన్నీ పూజించడం కోసం మోసుకుపోయారు.
కాబట్టి బబులోను అవతలికి మిమ్మల్ని తీసుకుపోతాను.’
44మోషే చూసిన నమూనా చొప్పున సాక్షపు గుడారం చేయాలని దేవుడు అతనితో మాట్లాడి ఆజ్ఞాపించాడు. ఆ సాక్షపు గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉండేది. 45మన పూర్వీకులు దాన్ని తీసుకుని, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనాలను వారు స్వాధీనపర్చుకున్నప్పుడు, యెహోషువతో కూడ ఈ దేశంలోకి దాన్ని తీసుకొచ్చారు. అది దావీదు కాలం వరకూ ఉంది. 46దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు దేవునికి నివాస స్థలాన్ని నిర్మించాలని ఆశించాడు. 47కాని సొలొమోను మందిరం కట్టించాడు.
48“అయితే, ప్రవక్త చెప్పినట్టుగా సర్వోన్నతుడు మనుషుల చేతులతో చేసిన ఇళ్ళలో నివసించడు.
49‘ఆకాశం నా సింహాసనం,
భూమి నా పాదపీఠం.
మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు?
నా విశ్రాంతి స్థలమేది?
50ఇవన్నీ నా చేతిపనులు కావా?
అని ప్రభువు అడుగుతున్నాడు.’
ఆనాటి ప్రజల పాపం
51“మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేని వారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. 52మీ పూర్వీకులు ఏ ప్రవక్తను హింసించకుండా ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందే తెలియజేసిన వారిని చంపేశారు. ఆయనను కూడా మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. 53దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు గాని దాన్ని మీరే పాటించలేదు” అని చెప్పాడు.
మొదటి హతసాక్షి. పౌలు మొదటి ప్రస్తావన
54మహాసభ వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తెఫనును చూసి పళ్ళు కొరికారు. 55అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశం వైపు తదేకంగా చూస్తూ, దేవుని తేజస్సును చూశాడు. దేవుని కుడి పక్కన యేసు నిలబడి ఉండడం చూసి 56“ఆకాశం తెరుచుకోవడం, మనుష్య కుమారుడు దేవుని కుడి పక్క నిలిచి ఉండడం చూస్తున్నాను” అని పలికాడు.
57అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకుని మూకుమ్మడిగా అతని మీదికి వచ్చి 58అతనిని పట్టణం బయటకు ఈడ్చుకు పోయి, రాళ్ళతో కొట్టారు. సాక్షులు సౌలు అనే యువకుని పాదాల దగ్గర తమ పైబట్టలు పెట్టారు. 59వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును పిలుస్తూ, “యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో” అని చెప్పాడు. 60అతడు మోకరించి, “ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు” అని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
అపొస్తలుల కార్యములు 7: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.