కీర్తనలు 57
57
ప్రధానగాయకునికి. అల్ తష్హేతు అను రాగముమీద పాడదగినది. గుహలో దావీదు సౌలునొద్దనుండి పారిపోయినప్పుడు, అతడు రచించినది. అనుపదగీతము.
1నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము
నేను నీ శరణుజొచ్చియున్నాను
ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను
శరణుజొచ్చియున్నాను.
2మహోన్నతుడైన దేవునికి
నా కార్యము సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱ
పెట్టుచున్నాను.
3ఆయన ఆకాశమునుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును
నన్ను మ్రింగగోరువారు దూషణలు పలుకునప్పుడు
దేవుడు తన కృపాసత్యములను పంపును. (సెలా.)
4నా ప్రాణము సింహములమధ్య నున్నది
కోపోద్రేకులమధ్యను నేను పండుకొనుచున్నాను
వారి దంతములు శూలములు అవి అంబులువారి నాలుక వాడిగల కత్తి.
5దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను
కనుపరచుకొనుము
నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము.
6నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి
నా ప్రాణము క్రుంగియున్నది.
నా యెదుట గుంట త్రవ్వి దానిలో తామేపడిరి. (సెలా.)
7నా హృదయము నిబ్బరముగా నున్నది
దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది
నేను పాడుచు స్తుతిగానము చేసెదను.
8నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా
సితారా, మేలుకొనుడి
నేను వేకువనే లేచెదను.
9నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది
నీ సత్యము మేఘమండలమువరకు వ్యాపించియున్నది.
10ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను
చెల్లించెదను
ప్రజలలో నిన్ను కీర్తించెదను.
11దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను
కనుపరచుకొనుము.
నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 57: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.