కీర్తనలు 38

38
జ్ఞాపకార్థమైనది. దావీదు కీర్తన.
1యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము.
నీ ఉగ్రతచేత నన్ను శిక్షింపకుము.
2నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి.
నీ చెయ్యి నామీద భారముగా నున్నది.
3నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి
పోయెను
నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.
4నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి
నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి
యున్నవి.
5నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన
గలవై స్రవించుచున్నవి.
6నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను
దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.
7నా నడుము తాపముతో నిండియున్నది
నా శరీరములో ఆరోగ్యము లేదు.
8నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను
నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను
9ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది
నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు.
10నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను
విడిచిపోయెను
నా కనుదృష్టియు తప్పిపోయెను.
11నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు
చూచి యెడముగా నిలుచుచున్నారు
నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు
12నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు
నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు
పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.
13చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను
మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని.
14నేను వినలేనివాడనైతిని
ఎదురుమాట పలుకలేనివాడనైతిని.
15యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను
–నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ
పడుదురని నేననుకొనుచున్నాను.
ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు
16నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక.
17నేను పడబోవునట్లున్నాను
నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు.
18నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను
నా పాపమునుగూర్చి విచారపడుచున్నాను.
19నా శత్రువులు చురుకైనవారును బలవంతులునైయున్నారు
నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు.
20మేలునకు ప్రతిగా వారు కీడుచేయుచున్నారు
నేను ఉత్తమమైనదాని ననుసరించుచున్నందుకు వారు
నాకు శత్రువులైరి
21యెహోవా, నన్ను విడువకుము
నా దేవా, నాకు దూరముగా నుండకుము.
22రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు
త్వరగా రమ్ము.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 38: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 38