సంఖ్యాకాండము 6
6
1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. 2పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకు#6:2 ప్రత్యేకముగా నుండుటకు. ఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించుకొనినయెడలవాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. 3ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండినవిగాని ద్రాక్షపండ్లను తినవలదు. 4అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు. 5అతడు నాజీ రగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్నుతాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను. 6అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు. 7తన దేవునికి మీదు కట్టబడిన తలవెండ్రుకలు అతని తలమీదనుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరిగాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్నుతాను అపవిత్రపరచుకొనవలదు. 8అతడు ప్రత్యేకముగాఉండు దినములన్నియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. 9ఒకడు అతనియొద్ద హఠాత్తుగా చనిపోవుటవలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడినయెడల అతడు పవిత్రపరపబడు దినమున, అనగా ఏడవదినమున తనతల గొరిగించుకొనవలెను. 10ఎనిమిదవదినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న యాజకునియొద్దకు తేవలెను. 11అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్థబలిని రెండవదానితో దహన బలిని అర్పించి,వాడు శవము ముట్టుటవలన పాపి యైనందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలెను. 12మరియు తాను ప్రత్యేకముగాఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱెపిల్లను తీసికొని రావలెను; తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుకమునుపటి దినములు వ్యర్థమైనవి.
13నాజీరు ప్రత్యేకముగాఉండు దినములు నిండిన తరువాత వానిగూర్చిన విధి యేదనగా, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు వానిని తీసికొని రావలెను. 14అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన యొక పొట్టేలును, 15గంపెడు పొంగని పిండి, అనగా గోధుమపిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవాయొద్దకు తేవలెను. 16అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పింపవలెను. 17యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను. 18అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించుకొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. 19మరియు యాజకుడు ఆ పొట్టేలుయొక్క వండిన జబ్బను ఆ గంపలోనుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని నాజీరు తన వ్రతసంబంధమైన వెండ్రుకలు గొరికించుకొనిన పిమ్మట అతనిచేతులమీద వాటి నుంచవలెను. 20తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠితమైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును; తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును. 21మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరునుగూర్చిన విధిని బట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము.
22యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము 23–మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. 24యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక; 25యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక; 26యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. 27అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామమును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యాకాండము 6: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.