సంఖ్యాకాండము 5

5
1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 2–ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతి వానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతి వానిని, పాళెములోనుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. 3నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్ర పరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్టవలెను. 4ఇశ్రాయేలీయులు ఆలాగు చేసిరి; పాళెము వెలుపలికి అట్టివారిని వెళ్లగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి.
5మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో 6–పురుషుడుగాని స్త్రీగాని యెహోవామీద తిరుగబడి మనుష్యులుచేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు 7వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధమువలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో అయిదవవంతు దానితో కలిపి యెవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను. 8ఆ అపరాధ నష్టమును తీసికొనుటకు ఆ మనుష్యునికి రక్తసంబంధి లేనియెడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును. 9ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతనివగును. 10ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చినయెడల అది అతని దగునని చెప్పుము.
11యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము 12ఒకని భార్య త్రోవతప్పి వానికి ద్రోహముచేసినయెడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించినయెడల 13ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడినదనుటకు సాక్ష్యము లేక పోయినను, ఆమె పట్టుబడకపోయినను, 14వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్యమీద కోపపడినయెడల, లేక వాని మనస్సులో రోషముపుట్టి అపవిత్ర పరచబడని తన భార్యమీద కోపపడినయెడల, 15ఆ పురుషుడు యాజకునియొద్దకు తన భార్యను తీసికొనివచ్చి, ఆమె విషయము తూమెడు యవలపిండిలో పదియవ వంతును తేవలెను.వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు; ఏలయవగా అది రోషవిషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకముచేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము. 16అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసికొనివచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను. 17తరువాత యాజకుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసికొనవలెను, మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసికొని ఆ నీళ్లలో వేయవలెను. 18తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తల ముసుకును తీసి, రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకునిచేతిలో ఉండవలెను. 19అప్పుడు యాజకుడు ఆ స్త్రీచేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసిన దేమనగా–ఏ పురుషుడును నీతో శయనింపనియెడలను, నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యముచేయక పోయినయెడలను, శాపము కలుగజేయు ఈ చేదునీళ్లనుండి నిర్దోషివి కమ్ము. 20నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవతప్పి అపవిత్ర పరచబడినయెడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమిచేసినయెడల 21యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుటవలన యెహోవా నీ జనులమధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక. 22శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీచేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ– ఆమేన్#5:22 ఆలాగున జరుగునుగాక. అని చెప్పవలెను. 23తరువాత యాజకుడు పత్రముమీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి 24శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలుగజేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును. 25మరియు యాజకుడు ఆ స్త్రీ చేతినుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసికొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠము నొద్దకు దాని తేవలెను. 26తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములోనుండి పిడికెడు తీసి బలిపీఠముమీద దాని దహించి 27ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పదముగా నుండును. 28ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రురాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగునని చెప్పుము. 29రోషము విషయమైన విధి యిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములోనున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడినయెడలనేమి, 30లేక వానికి రోషము పుట్టి తన భార్యమీద కోపపడినయెడలనేమి,వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజకుడు ఆమెయెడల సమస్తము విధిచొప్పున చేయవలెను. 31అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 5: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి