సంఖ్యాకాండము 21:10-20

సంఖ్యాకాండము 21:10-20 TELUBSI

తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులోనుండి వారు సాగి సూర్యోదయదిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయ్యె అబారీమునొద్ద దిగిరి. అక్కడనుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు. కాబట్టి –యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నో నులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెననుమాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది. అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ల నిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి– బావీ ఉబుకుము. దాని కీర్తించుడి బావీ; యేలికలు దాని త్రవ్విరి తమ అధికార దండములచేతను కఱ్ఱలచేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి.