మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందునవారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు–అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి? ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోనుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతట యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను –నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధినుండి ఆ కఱ్ఱను తీసికొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ యెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను. అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మెరీబా జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారిమధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను.
Read సంఖ్యాకాండము 20
వినండి సంఖ్యాకాండము 20
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: సంఖ్యాకాండము 20:1-13
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు